Saudi లో కొత్త రూల్.. ఇకపై ప్రవాసుల విషయంలో యజమాని అలా చేయడానికి లేదు!

ABN , First Publish Date - 2021-10-06T14:24:50+05:30 IST

వలసదారుల నియమకాలపై సౌదీ అరేబియా తాజాగా కొత్త రూల్ తీసుకొచ్చింది.

Saudi లో కొత్త రూల్.. ఇకపై ప్రవాసుల విషయంలో యజమాని అలా చేయడానికి లేదు!

రియాద్: వలసదారుల నియమకాలపై సౌదీ అరేబియా తాజాగా కొత్త రూల్ తీసుకొచ్చింది. సౌదీ యజమాని ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనం కోసం వలసదారుడిని పని చేయడానికి అనుమతించినట్లయితే మూడు నెలల జైలు, 50వేల సౌదీ రియాల్స్(సుమారు రూ.10లక్షలు) జరిమానా ఉంటుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) స్పష్టం చేసింది. జవాజత్ తెలిపిన వివరాల ప్రకారం... మొదటిసారి యజమాని ఈ తప్పు చేస్తే 5వేల సౌదీ రియాల్స్(సుమారు రూ.లక్ష) ఫైన్, నెల రోజుల జైలు శిక్ష ఉంటుంది.


రెండోసారి ఇదే నేరం రీపిట్ అయితే రెండు నెలల జైలు, 20వేల సౌదీ రియాల్స్(రూ.3.97లక్షలు) జరిమానా విధిస్తారు. ఇక మూడోసారి కూడా ఇదే నేరానికి పాల్పడితే 50వేల సౌదీ రియాల్స్(సుమారు రూ.10లక్షలు) జరిమానా, మూడు నెలల జైలు ఉంటుందని జవాజత్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉద్యోగుల సంఖ్యను బట్టి జరిమానా పెరుగుతుంది.


అంతేగాక ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలానికి కార్మికులను నియమించడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేస్తే యజమానిపై ఏడాది నిషేధం ఉంటుందని జవాజత్ తెలిపింది. ఈ ఉల్లంఘన వరుసగా రెండవసారి, మూడవసారి పునరావృతమైతే నిషేధం రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు పెరుగుతుంది. అలాగే వలసదారుడు అసలు యజమాని వద్ద కాకుండా వేరే ఎవరికైనా తన వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేస్తే సదరు ప్రవాసుడ్ని దేశం నుంచి బహిష్కరిస్తారు.   

Updated Date - 2021-10-06T14:24:50+05:30 IST