జైలూ, బెయిలూ!

ABN , First Publish Date - 2020-11-12T06:20:36+05:30 IST

ఇంటీరియర్‌ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌‌‌‌ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌...

జైలూ, బెయిలూ!

ఇంటీరియర్‌ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌‌‌‌ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ కోసం దిగువ కోర్టుకు పొమ్మని సూచిస్తూ బాంబే హైకోర్టు తన పిటిషన్‌ తిరస్కరించడాన్ని సవాలు చేసి అర్ణబ్‌‌‌‌ సుప్రీంకోర్టులో ఊరట పొందగలిగారు. రెండేళ్ళక్రితం నాటి ఆత్మహత్య కేసును మహారాష్ట్ర పాలకులు కక్షపూరితంగా తవ్వితీసి, తనను అక్రమంగా అరెస్టు చేసి వెంటాడి వేధిస్తున్నారన్నది అర్ణబ్‌‌‌‌ వాదన. అర్ణబ్‌‌‌‌ హక్కులను మేము కాకుంటే ఎవరు రక్షిస్తారంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఈ సందర్భంలో అర్ణబ్‌‌‌‌ వాదనకు ఊతం ఇచ్చే రీతిలో పలు వ్యాఖ్యలు చేశారు. టీవీ ఛానెల్‌ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? మీ ఎన్నికల భవిష్యత్‌ ఆయన అరుపులమీద ఆధారపడిందా?, మేం ఆ టీవీ చూడం కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది మాత్రం సరిగా లేదు అంటూ న్యాయమూర్తులు ఘాటుగానే విమర్శలు చేశారు. ‘వ్యక్తులపై ప్రభుత్వాలు కత్తిదూస్తే ఊరుకొనేది లేదు, మేమున్నాం’ అన్నమాట హక్కులకు సంకెళ్ళు పడుతున్న ఈ కాలంలో బాధితులకు చక్కని భరోసా. 


అర్ణబ్‌‌‌‌కు ఇంత త్వరగా బెయిల్‌ రావడం అనేకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయన వేదన వెంటనే వినాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం, బెయిల్‌ పిటిషన్‌ లిస్టింగ్‌ జరిగిపోవడం చూసి, సుప్రీంకోర్టు బార్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఏమిటీ ప్రత్యేక ప్రాధాన్యాలని ప్రశ్నిస్తూ ఉన్నతన్యాయస్థానానికి ఓ పెద్ద లేఖ రాశారు. గోస్వామి బెయిల్‌ పిటిషన్‌లో కనీసం 9 లోపాలున్నాయనీ, నిజానికి వీటన్నింటినీ సరిదిద్దనిదే బెంచ్ విచారించకూడదని కొందరు న్యాయనిపుణుల వాదన. గోస్వామి కేసు ఇలా ఫైల్‌ కాగానే ఆగమేఘాలమీద దానికో క్రమసంఖ్య దక్కడం, మర్నాడే బెంచ్‌ముందుకు రావడం న్యాయవాదులను అమితంగా ఆశ్చర్యపరుస్తున్నదని దవే ఆ లేఖలో రాశారు. దీనికంటే ఎంతో ప్రాధాన్యం, సత్వర స్పందన అవసరమైన కేసులనేకం అదేరోజున లిస్టయిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. మీ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించడం కాదు కానీ అంటూనే న్యాయస్థానం కటాక్షవీక్షణాలకు నోచుకోక వేలాదిమంది అనామకులు జైళ్ళలో మగ్గుతున్న విషయాన్నీ, చివరకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు నెలల తరబడి బెయిల్‌ పిటిషన్‌ రాకపోవడంతో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సైతం జైల్లోనే ఉండిపోయిన విషయాన్నీ దవే గుర్తుచేశారు. అందరినీ సమానంగా చూడాల్సిన ఆటోమేటిక్‌ లిస్టింగ్‌ వ్యవస్థలో పక్షపాతాలకు తావివ్వరాదనీ, న్యాయస్థానం గౌరవాన్ని కాపాడాలని దవే చెప్పుకొచ్చారు.


అర్ణబ్‌‌‌‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంలో అభ్యంతరపెట్టాల్సిందేమీ లేదు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టుగా, వ్యక్తిగత స్వేచ్ఛనూ, హక్కులనూ పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే. న్యాయవ్యవస్థ ప్రాథమిక విధి అదే. అయితే, కొందరి విషయంలో కనిపిస్తున్న ఈ వేగం, అనేకులకు ఎందుకు అందడం లేదన్నదే ప్రశ్న. పిటిషన్లు కదలక, విజ్ఞప్తులు వినిపించక, వాయిదాలమీద వాయిదాలు పడుతూ అనేకమంది బందీలుగానే మిగిలిపోతున్నారు. రచయితలు, ఉద్యమకారులు, హక్కుల పరిరక్షకులు ఎందరో కారాగారాల్లో మగ్గిపోతుంటే వారి ఆరోగ్యం, వయసు న్యాయస్థానాల మనసు కరిగించడం లేదు. పార్కిన్సన్స్‌ వ్యాధి వల్ల గ్లాసు, చెమ్చా పట్టుకోలేకపోతున్నాను, స్ట్రా కానీ, సిప్పర్‌ గానీ ఇప్పించండని ఎనభైయేళ్ళ వృద్ధుడు, బీమా కోరేగావ్‌ కేసు నిందితుడూ స్టాన్‌స్వామి చేసుకున్న అభ్యర్థన పరిశీలనకు కూడా నెలలూ వారాలూ పడుతోంది. ఒకపక్క ఎంతోమంది దీర్ఘకాలంగా జైళ్ళలో మగ్గుతుంటే, నాలుగురోజుల్లోనే అర్ణబ్‌‌‌‌ బెయిల్‌ పిటిషన్‌ విచారించడమేమిటని అడ్డుపడిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అనాలోచితంగానైనా ఉన్న నిజం చెప్పారు. అర్ణబ్‌‌‌‌కు బెయిల్‌ ఇస్తే మిన్నువిరిగి మీదపడుతుందా? అని ప్రశ్నిస్తున్న న్యాయవాది హరీష్‌ సాల్వే మిగతా జైలుబాధితుల పక్షానా ఇదే తీరున ప్రశ్నిస్తే బాగుంటుంది. జైలు కంటే బెయిలుకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆయన ఏకరువు పెట్టిన న్యాయసూత్రాలు అర్ణబ్‌‌‌‌కు మాత్రమే కాక, జెఎన్‌యూ ఉదంతం నుంచి సీఏఏ ఆందోళనల వరకూ ప్రభుత్వం దేశద్రోహులుగా ముద్రవేసిన వారందరికీ వర్తిస్తాయి. హక్కులూ స్వేచ్ఛల పరిరక్షణ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం అందరిపక్షానా ఏకరీతిన నిలవాలన్నదే ఆశ.

Updated Date - 2020-11-12T06:20:36+05:30 IST