తాగి బండి నడిపితే జైలుకే..

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా జిల్లాలో పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టలేదు.

తాగి బండి నడిపితే జైలుకే..
శ్వేత, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌

జిల్లాలో ముమ్మురంగా డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు

నాలుగు నెలల్లో 1,197 కేసులు, 

రూ.21,75,500 జరిమానా.. 13 మందికి జైలు

నిరంతర తనిఖీలతో మందుబాబులకు చుక్కలు  

సిద్దిపేట క్రైం, మే 20: కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా జిల్లాలో పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టలేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడిపించడం వల్ల ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి రోజూ సాయంత్రం  అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రధాన చౌరస్తాలు, రాజీవ్‌ రహదారిపై డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం వల్ల కలిగే అనర్థాలపై  వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. తనిఖీలో వాహనదారులను బ్రీత్‌ అనలైజర్‌ పరికరంతో పరీక్షించి, మద్యం సేవించినట్లు రుజువైతే వెంటనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. 


పట్టుబడినవారికి శిక్షలు ఇలా..

 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్‌ చౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, విక్టరీ చౌరస్తా, ముస్తాబాద్‌ చౌరస్తా, బీజేఆర్‌ చౌరస్తా, పొన్నాల రాజీవ్‌ రహదారిపై పోలీసులు రోజూ డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. పట్టుబడినవారికి మరుసటిరోజు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపినవారికి  ఒక్కొక్కరికి రూ. 2వేల నుంచి 5 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. రెండోసారి పట్టుబడినవారికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తున్నారు. కోర్టులో జరిమానా కట్టిన తర్వాతే పోలీసులు వారికి వాహనాలను అప్పగిస్తున్నారు. 


పక్కా ప్రణాళికతో తనిఖీలు

జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల, దుబ్బాక మండలాల పరిధిలో పోలీసులు పక్కా ప్లానింగ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మందుబాబులు వచ్చే రూట్లను పసిగడుతూ, వేర్వేరు ప్రదేశాల్లో తనిఖీలు చేస్తూ పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపెడుతున్నారు.

 

 నాలుగు నెలల్లో వెయ్యికి పైగా కేసులు

జిల్లాలో అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022 జనవరి  నుంచి ఏప్రిల్‌ వరకు ప్రతీ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించి  1,197 మంది పై కేసులు నమోదు చేశారు. రూ.21,75,500 జరిమానా విధించారు. వీరిలో 13 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు. 


మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు

 శ్వేత, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల  రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే  వారితో పాటు  ఎదుటివారికి కూడా ప్రమాదమే. మద్యం తాగి ఎవరు వాహనాలు నడపినా ఉపేక్షించబోము. జిల్లాలో తనిఖీలను ఎక్కువ చేసి డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

 

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST