కప్పలూ, పిల్లులే ఆదర్శం!

ABN , First Publish Date - 2021-02-12T08:21:41+05:30 IST

‘సుజుకి’ అనే పదాన్ని వినగానే మనకు మోటార్‌బైక్‌లు గుర్తుకువస్తాయి. జెన్‌ బౌద్ధానికి చెందిన గురువులు, ఆలయ అర్చకుల్లో కొందరి పేర్లకు ‘సుజుకి’ అనే పదం కలిసి ఉంటుంది.

కప్పలూ, పిల్లులే ఆదర్శం!

‘సుజుకి’ అనే పదాన్ని వినగానే మనకు మోటార్‌బైక్‌లు గుర్తుకువస్తాయి. జెన్‌ బౌద్ధానికి చెందిన గురువులు, ఆలయ అర్చకుల్లో కొందరి పేర్లకు ‘సుజుకి’ అనే పదం కలిసి ఉంటుంది. అమెరికాలో జెన్‌ బౌద్ధాన్ని బాగా వ్యాప్తి చేసిన ఒక జెన్‌ గురువు పేరు షున్ర్యు సుజుకి. అతణ్ణి ‘సుజుకి రోషి’ అని కూడా అనేవారు.  ఆసియా ఖండం వెలుపల తొలి జెన్‌ మఠాన్ని స్థాపించిన గురువుగా అతను ప్రసిద్ధుడు. 1904లో జపాన్‌లోని ఒక పేద అర్చక కుటుంబంలో షున్ర్యు జన్మించాడు. ఆచారం ప్రకారం శిరోముండనం చేయించుకోవడంతో... తోటి విద్యార్థులందరూ ‘బోడిగుండు షున్ర్యు’ అని గేలి చేసి ఏడిపించేవారు. 


కొంతకాలం తరువాత అతను పాఠశాల వదిలేసి, బాగా ప్రసిద్ధి చెందిన గ్యోకుజున్‌ సోఆన్‌ అనే గురువును ఆశ్రయించాడు. సోఆన్‌ క్రమశిక్షణకు మారురూపం. షున్ర్యుకు మతిమరపు ఎక్కువ. పైగా అతను ఎప్పుడు ఏం చేస్తాడో అతనికే తెలీదు. దీంతో ‘వంకరటింకర దోసకాయ’ అని అతణ్ణి సోఆన్‌ పిలిచేవాడు. రకరకాల పనులు చెప్పి తమ బిడ్డను గురువు వేధిస్తున్నాడంటూ, షున్ర్యును అతని తల్లితండ్రులు ఇంటికి తీసుకువచ్చారు. 


కానీ, జ్ఞానార్జనకోసం ఉవ్విళ్ళూరుతున్న షున్ర్యు ఊరకే ఇంటి పట్టున ఉండలేకపోయాడు. కష్టపడి చదివి, ఆంగ్లం మీద పట్టు సాధించి, పట్టా అందుకున్నాడు. 1959లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్నాడు. అది అతని జీవితంలో పెద్ద మలుపు. అక్కడ ఉన్న ఏకైక సోటో జెన్‌ ఆలయాన్ని అభివృద్ధి చేసి, దాన్ని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత అతనిపై పడింది. దాన్ని చాలా సమర్థవంతంగా అతను నిర్వర్తించాడు. వేలాది మందిని జెన్‌ ధర్మం వైపు ఆకర్షించాడు. జీవితపు చివరి రోజుల్లో, కేన్సర్‌తో బాధపడుతూ, 1971లో ఒక రోజు నిద్రలోనే కన్నుమూశాడు. 


ఒకసారి ఒక వ్యక్తి షున్ర్యును కలుసుకొని మాట్లాడుతూ, ‘‘మీ గురువుగారిలో ప్రత్యేకత ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

అప్పుడు షున్ర్యు ‘‘అందరి మాదిరిగానే తానూ ఒక సర్వసాధారణమైన వ్యక్తిని అని మా గురువుగారు ఎప్పుడూ భావించేవారు. నిజానికి ఆయన ఎంతో గొప్పవాడు. అయినా సాధారణంగా ఉండడమే ఆయన ప్రత్యేకత’’ అని చెప్పాడు. 


అలాగే ‘‘నాకు కప్పలు అంటే ఇష్టం’’ అంటూ ఉండేవాడు. 

‘‘ఎందుకు?’’ అని ఎవరైనా ప్రశ్నిస్తే -

‘‘కొలను దగ్గర కూర్చున్న కప్పను బాగా గమనించండి. ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ, ప్రపంచాన్నే మరచిపోయి, తనలో తాను లీనమై ఉంటుంది కదా! అందుకే కప్పను నేను ప్రేమిస్తాను’’ అని చెప్పేవాడు.


అంతేకాదు, మరో ఆశ్చర్యకరమైన ప్రకటన కూడా అతను చేసేవాడు. ‘‘నాకు జ్ఞానోదయం కలగడానికి ముందు ఒక మనిషిగా ఉండేవాణ్ణి. ఆ తరువాత పిల్లినయ్యాను. పిల్లిని గమనించారా? హుషారుగా ఉంటూనే, జాగ్రత్తగా ఉంటూనే, ఎంత నిశ్చింతగా ఉండవచ్చో పిల్లి నుంచి మనం నేర్చుకోవాలి’’ అని చెప్పేవాడు. 

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-02-12T08:21:41+05:30 IST