Taj Mahal: కృష్ణుడి విగ్రహంతో నో ఎంట్రీ..

ABN , First Publish Date - 2022-08-31T01:52:51+05:30 IST

తాజ్‌మహల్ ప్రవేశంపై మరోసారి వివాదం తలెత్తింది. జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తిని కృష్ణుని విగ్రహంతో...

Taj Mahal: కృష్ణుడి విగ్రహంతో నో ఎంట్రీ..

న్యూఢిల్లీ: తాజ్‌మహల్ (Taj Mahal) ప్రవేశంపై మరోసారి వివాదం తలెత్తింది. జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తిని కృష్ణుని విగ్రహంతో (Krishna Idol) తాజ్‌మహల్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సంచలనమైంది. ఈ చర్యను హిందూ సంస్థలు ఖండించాయి. జైపూర్ పర్యాటకుని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా నిరసనలు దిగుతామని హెచ్చరించాయి. దీనిపై ఆగ్రా సర్కిల్ ఆర్కియలాజికిల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. సీఐఎస్ఎఫ్ అధికారులతో ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ చేస్తానని చెప్పారు.


కాగా, తనకు ఎదురైన అనుభవాన్ని టూరిస్ట్ గౌతమ్ వివరిస్తూ..''భద్రతా కారణాలు చెబుతూ విగ్రహంతో ఆలయంలోకి అడుగుపెట్టకుండా అధికారులు నన్ను అడ్డుకున్నారు. లడ్డూ గోపాల్ (విగ్రహం పేరు) మా కుటుంబ సభ్యుల్లో ఒకరు. ఎక్కడికి వెళ్లినా ఇది తీసుకునే వెళ్తాను. లార్డ్ (కృష్ణ)తో కలిసి మధుర, బృందావనం కూడా వెళ్లాను. కానీ ఇక్కడ మాత్రం విగ్రహం లేకుండా లోపలకు వెళ్లమన్నారు'' అని చెప్పాడు. దీనిపై తాజ్ మహల్ కన్జర్వేటివ్ అసిస్టెంట్ (సీఏ) ప్రిన్స్ వాజ్‌పేయి మాట్లాడుతూ, దీనికి సంబంధించిన వీడియో తన వద్ద కూడా ఉందని, అయితే ఈ ఘటన సోమవారం జరిగిందా, మరో రోజు జరిగిందా అనేది తనకు తెలియదని అన్నారు. సీఐఎస్ఎఫ్‌ను అడిగి విషయం తెలుసుకుంటామని చెప్పారు.


అవమానం...

కృష్ణుని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్ జాతీయ అధ్యక్షుడు గోవింద్ పరాశర్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోని పక్షంలో నిరసనకు దిగుతామని హెచ్చరించారు.

Updated Date - 2022-08-31T01:52:51+05:30 IST