Congress : ఆ రెండు రకాలవారే కాంగ్రెస్‌ను వీడుతున్నారు : జైరామ్ రమేశ్

ABN , First Publish Date - 2022-09-15T20:30:39+05:30 IST

కాంగ్రెస్‌‌ను రెండు రకాల నేతలు వదిలిపెడుతున్నారని ఆ పార్టీ ప్రధాన

Congress : ఆ రెండు రకాలవారే కాంగ్రెస్‌ను వీడుతున్నారు : జైరామ్ రమేశ్

తిరువనంతపురం : కాంగ్రెస్‌‌ను రెండు రకాల నేతలు వదిలిపెడుతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. పార్టీ నుంచి అన్ని ప్రయోజనాలను పొందినవారు, కేంద్ర దర్యాప్తు సంస్థల వల్ల ఇబ్బందులు ఉన్నవారు పార్టీని వీడుతున్నారన్నారు. ఇటీవల గులాం నబీ ఆజాద్, కొందరు గోవా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడిన నేపథ్యంలో జైరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


కేరళలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పొరపాటు చేసిందని అంగీకరించారు. అయితే రెండు రకాల నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. పార్టీ నుంచి అన్ని ప్రయోజనాలను పొందినవారు ఒక రకమని, కేంద్ర దర్యాప్తు సంస్థల వల్ల ఇబ్బందులు ఉన్నవారు మరొక రకమని చెప్పారు. పార్టీ నుంచి అన్నీ పొందినవారికి ఉదాహరణగా గులాం నబీ ఆజాద్‌ను చూపించారు. ఆజాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి, పీసీసీ అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రి పదవి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వంటివాటిని పొందారన్నారు. 


కేంద్ర దర్యాప్తు సంస్థల వల్ల ఇబ్బందులున్నవారు బీజేపీలో చేరుతున్నారని, ఆ పార్టీలో చేరగానే వారు పునీతులైపోతున్నారని అన్నారు. దీనికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంచి ఉదాహరణ అని చెప్పారు. ఆయనపై కనీసం ఒక కేసు అయినా లేదన్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నపుడు మాత్రం బీజేపీ ప్రతిరోజూ ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉండేదన్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారని, బీజేపీ పూర్తిగా మౌనంగా ఉందని చెప్పారు. ఇటీవల బీజేపీలో చేరిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ రెండో రకానికి చెందినవారేనని తెలిపారు. ఈ ఎనిమిది మంది బీజేపీ వాషింగ్ మిషన్‌లోకి వెళ్ళారన్నారు. తనకు తెలిసినంత వరకు వారు చాలా అవినీతిపరులని ఆరోపించారు. కాంగ్రెస్ పొరపాటు చేసిందని అంగీకరిస్తున్నానని చెప్పారు. వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడమే పొరపాటు అని చెప్పారు. వారు బీజేపీ వాషింగ్ మిషన్‌లో చేరిన తర్వాత తన కుర్తా మాదిరిగా మచ్చలేని తెలుపుదనంతో తళతళ మెరిసిపోతారని వ్యాఖ్యానించారు. అన్నీ అనుభవించినవారు పార్టీని వదిలిపెడితే, ఆ స్థానం కోసం 20 నుంచి 30 మంది యువ నేతలు వేచి చూస్తున్నారన్నారు. పెద్ద తలకాయల్లో కొందరు బయటకు వెళ్లిపోవడం పట్ల తానేమీ ఆందోళన చెందడం లేదన్నారు. అలాంటివాళ్ళు ఎంత త్వరగా పార్టీని వదిలిపెడితే అంత మంచిదని చెప్పారు. 


రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కేరళలో జరుగుతోంది. ఈ యాత్రలో జైరామ్ రమేశ్ కూడా పాల్గొంటున్నారు. ఈ యాత్రను హిమంత బిశ్వ శర్మ విమర్శిస్తున్నారు. దీంతో జైరామ్-హిమంత మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 


Updated Date - 2022-09-15T20:30:39+05:30 IST