కశ్మీరుకు తాలిబన్ల మద్దతు కోరిన జైషే మహమ్మద్!

ABN , First Publish Date - 2021-08-28T01:16:28+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ఊపు మీద ఉన్న తాలిబన్లను పాకిస్థాన్‌లోని

కశ్మీరుకు తాలిబన్ల మద్దతు కోరిన జైషే మహమ్మద్!

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఊపు మీద ఉన్న తాలిబన్లను పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కలిసినట్లు తెలుస్తోంది. జమ్మూ-కశ్మీరులో తమకు మద్దతివ్వాలని తాలిబన్లను కోరినట్లు సమాచారం. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,  ముల్లా అబ్దుల్ ఘనీ బరదర్ సహా, తాలిబన్ అగ్ర నేతలను ఇటీవల మసూద్ అజహర్ కలిశాడు. పొలిటికల్ కమిషన్ హెడ్‌గా బరదర్ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీరు లోయలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు సహకరించాలని మసూద్ కోరాడు. 


ఆగస్టు 15న కాబూల్ తాలిబన్ల వశమైన తర్వాత మసూద్ అజహర్ సంతోషం వ్యక్తం చేశాడు. అమెరికా మద్దతుగల ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేసి, విజయం సాధించినందుకు హర్షం ప్రకటించాడు. ఆగస్టు 16న రాసిన వ్యాసంలో ఆఫ్ఘనిస్థాన్‌లో ముజాహిదీన్ల విజయాన్ని ప్రశంసించాడు. 


తాలిబన్ల విజయాన్ని పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో సంతోషంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ చట్టం షరియాను వివరించడంలో సైద్ధాంతిక కామ్రేడ్లుగా తాలిబన్లను, జైషే మహమ్మద్ ఉగ్రవాదులను పరిగణిస్తారు. 


Updated Date - 2021-08-28T01:16:28+05:30 IST