జల‘కలే’నా!?

ABN , First Publish Date - 2021-12-26T04:39:18+05:30 IST

సుమారు రెండేళ్ల కిత్రం అట్టహాసంగా ప్రారభమైన వైఎస్సార్‌ జలకళ పథకం ఆదిలోనే అటకెక్కింది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో బోర్ల డ్రిల్లింగ్‌ అర్ధంతరంగా ఆగిపోయింది.

జల‘కలే’నా!?
జలకళ పథకం ద్వారా జిల్లాకు చేరిన బోరు డ్రిల్లింగ్‌ లారీలు

రెండేళ్లు గడుస్తున్న ముందుకుసాగని పథకం

దరఖాస్తులన్నీ ‘బోరు’మంటున్నాయ్‌!

లక్ష్యం 10వేల డ్రిల్లింగ్‌.. వేసింది 421

రూ.2.5 కోట్ల వరకు బిల్లుల పెండింగ్‌

పనులు చేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

వేసిన బోర్లకూ అమర్చని మోటార్లు


నెల్లూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సుమారు రెండేళ్ల కిత్రం అట్టహాసంగా ప్రారభమైన వైఎస్సార్‌ జలకళ పథకం ఆదిలోనే అటకెక్కింది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో బోర్ల డ్రిల్లింగ్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. వేసిన బోర్లకూ మోటార్లు బిగించకుండా వదిలి పెట్టేశారు. జిల్లాలో పది వేల బోర్లు వేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 400 బోర్లకే పథకం నీరుగారిపోయింది. 


గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని కాస్త మార్పులు చేసి ప్రస్తుత ప్రభుత్వం  వైఎస్సార్‌ జలకళ అనే పేరుతో పథకాన్ని మొదలు పెట్టింది. 10 ఎకరాల మెట్ట, లేదా 5 ఎకరాల మాగాణి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. ఎంపికైన రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి మోటార్లు బిగించి ఇస్తుంది. 


పథకానికి రెండున్నరేళ్లు


ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే  జలకళ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యింది. ఈ పథకానికి ఎంపిక చేసిన ఆరు క్లస్టర్లు ఆత్మకూరు, గూడూరు, కావలి, ఉదయగిరి, వెంకటాచలం, వెంకటగిరి పరిధిలో మొత్తం 10621 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో అత్మకూరు క్లస్టర్‌లో 1912, గూడూరు 1611, కావలి 327, ఉదయగిరి 2650, వెంకటాచలం 976, వెంకటగిరి 1521, మొత్తం 8985 దరఖాస్తుదారులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. 


2020లో అట్టహాసంగా ప్రారంభం


గత ఏడాది ఆరంభంలో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. బోర్ల డ్రిలింగ్‌ కోసం కాంట్రాక్టు ఖరారు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బోరు వాహనాన్ని (రిగ్‌) డ్రిల్లింగ్‌ కోసం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు కొబ్బరి కాయలు కొట్టి ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 


ఆదిలోనే ఆగిన బండ్లు: 


జిల్లావ్యాప్తంగా 428 బోర్లు డ్రిల్‌ చేశారు. ఆత్మకూరు క్లస్టర్‌లో 100, గూడూరు 75, కావలి 63, ఉదయగిరి 65, వెంకటాచలం 61, వెంకటగిరి 60 బోర్లు డ్రిల్‌ చేశారు. అయితే, ఇందుకు సంబంధించి సుమారు రూ.2.5 కోట్ల బిల్లులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు బోర్ల డ్రిల్లింగ్‌ ఆపేశారు. నిధులు లేని కారణంగా డ్రిల్‌ చేసిన బోర్లకూ మోటార్లు బిగించలేదు. ప్రభుత్వం ఇప్పటివరకు డ్రిల్‌ చేసిన బోర్లకు బిల్లులు చెల్లిస్తే కానీ పథకం ముందుకు కదలేలా కనిపించడం లేదు. ఒకవేళ పెండింగ్‌ బిల్లులు చెల్లించినా, మిగిలిన బోర్ల డ్రిల్లింగ్‌కు కాంట్రాక్టర్లు సిద్దపడతారా లేదా అనేది అనుమానమే. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో బిల్లులు రావన్న భయంతో టెండర్లు వేయడానికి గుత్తేదారులు ముందుకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలో రైతు ప్రయోజనాలను ఆశించి ప్రారంభించిన ఈ పథకం పురిటినొప్పులు దాటి ముందుకు కదులుతుందా!? లేదా యథాతథ స్థితిలో నీరుగారిపోతుందా!? వేచి చూడాల్సిందే. సొంత వ్యయంతో బోర్లు వేసుకునే ఆర్థిక స్థోమత లేని రైతులు ఈ పథకం మీద కోటి ఆశలతో ఉన్నారు. బోర్ల డ్రిల్లింగ్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరి ఆశలు నెరవేరుతాయో, అడియాశలుగా మిగులుతాయో వేచి చూడాల్సిందే. 



6 నెలలుగా తిరుగుతున్నా


జలకళ పథకం కింద పొలంలో బోరు వేయాలని నా భార్య జయమ్మ పేరు మీద ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలమట్టం పెరిగింది. ఈ సమయంలో బోరు వేస్తే నీరు పుష్కలంగా పడి పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. బోరు వేయాలని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకోలేదు. 

- బండి రమణయ్య, రైతు, కృష్ణారెడ్డిపల్లి/ఉదయగిరిరూరల్‌



 2020లో బోరుకు దరఖాస్తు చేశా..


మాది సన్నవారిపల్లి. నాకున్న మూడెకరాల పొలంలో మెట్టపైర్లు పండించుకుంటున్నా. 2020, జూలైలో వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా బోరుకు దరఖాస్తు చేసుకున్నా. అది మంజూరైందో లేదో అసలు వస్తుందో లేదో ఇంతవరకు తెలియదు. ప్రభుత్వం బోరు సౌకర్యం కల్పిస్తే మిరప, బొప్పాయి వంటి పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుంది.

- గంగిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, సన్నవారిపల్లి, మర్రిపాడు

 


బోరు లేక బీడు భూమిగా మారింది


నాకు ప్రభుత్వం పదేళ్ల క్రితం రెండున్నర ఎకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిలో నీటి సౌకర్యం లేక బీడు భూమిగా మారింది. సచివాలయాల చుట్టూ తిరిగి ఎన్నిసార్లు వైఎస్‌ఆర్‌ జలకళకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇంక ఇప్పట్లో ఉచిత బోర్లు వచ్చే అవకాశం కన్పించట్లేదు. 

- చిట్టెనబోయిన సుబ్బమ్మ, చుంచులూరు/మర్రిపాడు 

Updated Date - 2021-12-26T04:39:18+05:30 IST