జలకళ నత్తనడక

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

నెర్రెలు బారి, నోళ్లు తెరుచుకున్న భూములను తడుపుతామని, ‘వైఎస్సార్‌ జలకళ’ ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.

జలకళ నత్తనడక

  1. రైతుల నుంచి 29,537 దరఖాస్తులు
  2. వీఆర్వోల అర్హత పొందినవి 17,242
  3. కలెక్టర్‌ ఆమోదించినవి 1,274 
  4. ఇప్పటి వరకూ వేసిన బోర్లు 610

కర్నూలు- ఆంధ్రజ్యోతి: నెర్రెలు బారి, నోళ్లు తెరుచుకున్న భూములను తడుపుతామని, ‘వైఎస్సార్‌ జలకళ’ ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అర్హత గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత సంవత్సరం అక్టోబరులో నియమ నిబంధనలను ప్రకటించింది. ఉచిత బోరు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. దీంతో జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం ఉచితంగా బోరు తవ్విస్తుందన్న నమ్మకంతో జిల్లా వ్యాప్తంగా 29,537 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత ఉన్నవి 17,242 దరఖాస్తులని వీఆర్వోలు నివేదించారు. వీటిలో ఇప్పటి వరకు 1,274 దరఖాస్తులు మాత్రమే ఆమోద ముద్ర పొందాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఉచిత బోరుకు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్న రైతులు, అధికారుల కాలయాపనతో డీలా పడుతున్నారు. ఇలా అయితే తాము బోరు తవ్వించుకున్నట్లే అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ దరఖాస్తులను ఆమోదిం చాలని, వెంటనే పొలాల్లో బోర్లు వేయించాలని రైతులు కోరుతున్నారు.


లక్ష్య సాధన ఎన్నడో..

వైఎస్సార్‌ జలకళ పథకంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ఒక రైతు లేదా రైతులు బృందాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించింది. జిల్లాలో మార్చి నాటికి సుమారు వెయ్యి బోర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం విధించింది. గత సంవత్సరం భారీగా కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న రైతులు తమకు ఉచిత బోరు అనుమతి త్వరగా వస్తుందని, తమ భూములకు నీటి ఎద్దడి తీరుతుందని సంతోషించారు. దీనికి అనుగుణంగానే గత సంవత్సరం నవంబరు నుంచి జిల్లాలో డ్వామా అధికారులు బోర్లను తవ్వడం ప్రారంభించారు. కానీ ఈ కార్యక్రమం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 610 బోర్లను మాత్రమే తవ్వారు. ఇందుకోసం రూ.2.76 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. గడువు పూర్తయినా, తమకు బోర్లు వేయలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఖరీఫ్‌ పంటలకైనా బోర్లు వేయాలని కోరుతున్నారు.


1,274 బోర్లకే ఆమోదం

ఉచిత బోరుకు రైతులు ఆన్‌లైన్‌ ద్వారా లేదా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని వీఆర్వోలు, ఉపాధి హామీ అధికారులు పరిశీలిస్తారు. అనంతరం బోర్లు వేసే ఏజన్సీకి పంపుతారు. పొలాల్లో బోరు వేయాల్సిన ప్రదేశాన్ని జియాలజిస్టులు ఆమోదిస్తే.. మళ్లీ ఉపాధి హామీ పీడీకీ సిఫారసు చేస్తారు. ఆయన కలెక్టర్‌ అనుమతి కోసం పంపుతారు. కలెక్టర్‌ నుంచి అనుమతి వచ్చాక పొలంలో బోరు వేస్తారు. భూగర్భ జలాల స్థాయిని అనుసరించి గరిష్ఠంగా 400 అడుగుల వరకు బోర్లు తవ్వుతారు. ఒక్కో అడుగుకు ప్రభుత్వం రూ.138 చెల్లిస్తోంది. ఈ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి 29,537 దరఖాస్తులు వస్తే, కేవలం 1,274 దరఖాస్తులకు కలెక్టర్‌ నుంచి ఆమోద ముద్ర లభించింది. బోర్లు వేసే కంపెనీల వద్ద ఉన్న జాబితా ప్రకారం 17,242 దరఖాస్తులను వీఆర్వోలు ఆమోదించగా, 16,825 దరఖాస్తులను డ్వామా అధికారులు ఆమోదించారు. వీటిల్లో 15,450 దరఖాస్తులు డ్రిల్లింగ్‌ ఏజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని దశలను దాటుకుని కలెక్టర్‌ ఆమోద ముద్ర పొందిన వాటిల్లో కూడా ఇంకా 78 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 


రాష్ట్రంలోనే రెండో స్థానం..

బోర్ల తవ్వకం విషయంలో చాలా యాక్టివ్‌గా ఉన్నాం. కలెక్టర్‌ ఆమోద ముద్ర పొందిన వాటిల్లో ఇప్పటికే 610 బోర్లు తవ్వి, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచాం. అన్ని అర్హతలు ఉన్న దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పరీశీలించి త్వరలోనే రైతుల పొలాల్లో బోర్లు వేయిస్తాం. - అమర్నాథ్‌రెడ్డి, డ్వామా పీడీ, కర్నూలు

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST