పట్టరపట్టు.. జల్లికట్టు

ABN , First Publish Date - 2022-01-22T14:11:43+05:30 IST

పొంగల్‌ను పురస్కరించుకొని పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌లో శనివారం అట్టహాసంగా జల్లికట్టు పోటీలు జరిగాయి. ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆలయానికి సమీపంలోని వడివాసన్‌ వద్దకు క్రీడాకారులు

పట్టరపట్టు.. జల్లికట్టు

- కోవై, తిరుచ్చిల్లో కోలాహలం 

- ప్రారంభించిన మంత్రులు 

- విజేతలకు విలువైన బహుమతులు


ప్యారీస్‌(చెన్నై): పొంగల్‌ను పురస్కరించుకొని పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌లో శనివారం అట్టహాసంగా జల్లికట్టు పోటీలు జరిగాయి. ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆలయానికి సమీపంలోని వడివాసన్‌ వద్దకు క్రీడాకారులు చేరుకున్నారు. కలెక్టర్‌ సమీరన్‌ వారిచే జల్లికట్టు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. కోయంబత్తూర్‌, ధర్మపురి, ఈరోడ్‌ తదితర జిల్లాల నుంచి 500 ఎద్దులు పాల్గొన్నాయి. పోటీల్లో అర్హులైన 300 మంది యువకులను అనుమతించారు. ప్రతి రౌండ్‌లో 50 మంది చొప్పున మొత్తం ఏడు రౌండ్లుగా పోటీలను నిర్వహించారు. ఆక్రోశంతో రంకెలేసిన ఎద్దులను అదుపుచేసిన విజేతలకు యమహా బైక్‌, ఎల్‌ఈడీ టీవీ, బీరువా, సైకిళ్లు తదితరాలను బహుమతిగా అందజేయగా, పట్టుబడకుండా ప్రథమస్థానంలో నిలిచిన ఎద్దు యజమానికి బహుమతిగా గాంగేయం ఎద్దును బహుకరించారు.


తిరుచ్చిలో....: తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్‌ కుత్తిపారై గ్రామంలో సంప్రదాయ సాహసక్రీడ జల్లికట్టు పోటీలను ఉదయం 8 గంటలకు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా చుట్టుపక్కల గ్రామాలు, సమీప జిల్లాలకు చెందిన 500ఎద్దులు, మైదానంలో పరుగుతీయగా, వాటిని 300 మంది యువకులు అదుపు చేసేందుకు ధైర్యసాహ సాలు ప్రదర్శించారు. సాయంత్రం 5గంటల వరకు సాగిన ఈ పోటీలను సుమారు 500 మందికి పైగా కొవిడ్‌ నిబంధనలతో తిలకించారు.

Updated Date - 2022-01-22T14:11:43+05:30 IST