ఆర్థిక, మత శక్తుల జమిలి ఎజెండా

ABN , First Publish Date - 2021-01-06T06:08:36+05:30 IST

భారత రాజకీయాలు ఒక డోలాయమాన స్థితిలో సాగుతున్నాయి. గడచిన సంవత్సరం దాదాపు కరోనా మహమ్మారి చీకట్లలో సాగినప్పటికీ...

ఆర్థిక, మత శక్తుల జమిలి ఎజెండా

రైతుల ప్రతిఘటన మోదీ లక్ష్యాలకు ఎంత మేరకు విఘాతం కల్పించగలదు? పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల లోపు ఈ సమస్య ఒక కొలిక్కి రాకపోతే మోదీ ఏమి చేస్తారు? ఆయన తిరోగమనానికి ఈ  పరిణామాలు సూచికలు అవుతాయా? ఎందుకంటే మోదీ విజయం కేవలం మతశక్తుల విజయంపైనే ఆధారపడి లేదు. తనకు అండగా నిలిచే ఆర్థిక శక్తుల విజయానికి ప్రధానమంత్రి తోడ్పడకపోతే ఆయనకు రాజకీయ విజయాలు సాధ్యపడవు.


భారత రాజకీయాలు ఒక డోలాయమాన స్థితిలో సాగుతున్నాయి. గడచిన సంవత్సరం దాదాపు కరోనా మహమ్మారి చీకట్లలో సాగినప్పటికీ ఈ అంధకారాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని నరేంద్రమోదీ ప్రభుత్వం తాను అనుకున్న ఎజెండాను అమలు చేయగలిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ ప్రభుత్వం బిజెపి ఎజెండాలో ఉన్న ఒక్కో అంశాన్ని అమలు చేస్తూ, 2020లో దాని విస్తృత స్వరూపాన్ని ప్రజల అనుభవంలోకి తీసుకువచ్చింది. ఒక సైద్ధాంతిక దృక్పథం, ఒక దీర్ఘకాలిక ఎజెండా ఉన్న పార్టీని ప్రజలు పూర్తి మెజారిటీతో గెలిపిస్తే ఎటువంటి నిర్విచక్షణతో ముందుకు వెళ్లగలదో అన్న విషయం రోజురోజుకూ స్పష్టమవుతున్నది. కశ్మీర్, అయోధ్య, పౌరసత్వ చట్టం వంటి అంశాలపై బిజెపి వేగంగా తీసుకున్న నిర్ణయాలను చూసి ఆ పార్టీకి కేవలం మతతత్వ ఎజెండా మాత్రమే ఉన్నదని, ఆర్థికవ్యవస్థను ఏ విధంగా నిర్వహించాలో అన్న అంశంపై ఆ పార్టీకి ఒక దృక్పథం అంటూ లేదని విమర్శించేవారంతా గత ఏడాది ప్రకటించిన కార్మిక, వ్యవసాయ సంస్కరణల తీరుతెన్నుల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కరోనాకు ముందే దేశ ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకం కాగా, కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. ఈ సంక్షోభం ఏర్పర్చిన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం కోసం మోదీ ప్రభుత్వానికి తీవ్ర నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ‘లాక్‌డౌన్ మొదటి దశలోనే ఆర్థిక వ్యవస్థ ద్వారాలు దాదాపు తెరిచాం. జూన్ తర్వాత ఇంకా చాలా నిర్ణయాలు జరుగబోతున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అవి తార్కిక ముగింపునకు చేరుకునేలా చూడడమే మా సంస్కరణల ఉద్దేశం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జూన్ 2న భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సదస్సులో వ్యాపార వేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. భారత దేశం అభివృద్ధి వేగాన్నీ, స్థాయినీ, పరిధినీ పెంచాలని, దేశం నత్తనడక సాగడానికి ఇక ఎంత మాత్రం వీల్లేదని మోదీ మంగళవారం కొచ్చి- మంగళూరు పైప్‌లైన్‌ను ప్రారంభిస్తూ స్పష్టం చేయడంతో ఆయన తన దూకుడును ఆపే అవకాశాలు లేవన్న విషయం తేలిపోయింది.


బిజెపి మతపరమైన ఎజెండాను ఎదుర్కోగల సత్తా కానీ, దానికి సైద్ధాంతిక ప్రత్యామ్నాయాన్ని రూపొందించి ప్రజలను చైతన్య పరిచి తమ వైపుకు తిప్పుకోగలగిన శక్తి కానీ ఉన్న రాజకీయ పార్టీలు మన దేశంలో లేవని, అవి ఇప్పట్లో ఉద్భవించగలిగిన పరిస్థితులు లేవని ఇప్పటివరకూ జరిగిన పరిణామాలనుబట్టి అర్థమవుతోంది. పౌరసత్వ చట్టం, కశ్మీర్ వంటి అంశాలు మైనారిటీలను ఎంత ఏకం చేయగలిగాయో, హిందూ ఓటర్లను అంత సంఘటితం చేయగలుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. చాలా మందికి బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా అనిపించవచ్చు. వీరు అభివృద్ధి గురించి, ఆర్థిక విధానాల గురించి మాట్లాడకుండా ఆలయాల గురించి, ఇతర మతపరమైన అంశాలగురించి మాట్లాడతారేం అన్న అనుమానాలు రావచ్చు. కాని అదే సమయంలో కొన్ని చోట్ల అక్కడ ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల రీత్యా అలా మాట్లాడే వారు జనంతో కనెక్టు కావడం కూడా జరుగుతుందన్న విషయాన్ని విస్మరించరాదు. ఈ విషయం తెలిసినందువల్లే ఎక్కడ ఒవైసీలు ఉపయోగపడగలరో, ఎక్కడ బండిసంజయ్‌లు భావోద్వేగాలకు తోడ్పడగలరో బిజెపి అధిష్ఠానం ఇప్పటికే ఒక కళగా అభ్యసించకలిగింది


అంత మాత్రాన బిజెపికి ఆర్థిక, అభివృద్ధి ఎజెండా లేదని చెప్పలేం. దేశంలో ఇప్పటివరకూ ప్రవేశించని రంగాల్లో కూడా ఆర్థిక శక్తుల రంగ ప్రవేశానికి దోహదం చేసి, ఈ శక్తులకు విస్తృత అవకాశాలు కల్పించడం, వాటి అండతో తాను కూడా బలోపేతం కావడం ఈ ఎజెండాలో భాగం. ఈ రీత్యా భారతీయ జనతా పార్టీ దూకుడు రెండు విధాలా సాగుతోందని చెప్పవచ్చు. కశ్మీర్, రామమందిరం, ముస్లిం వ్యతిరేకత, ఇతర భావోద్వేగాల విషయంలో బిజెపి మూల ఓటర్ల పునాదిని విస్తరిస్తూ, ఆ పార్టీ మాతృసంస్థ అయిన సంఘ్ పరివార్నూ సంతృప్తి పరుస్తూనే, పార్టీకి అండదండగా నిలిచే ఆర్థిక శక్తులను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకునే చర్యల ద్వారా మోదీ ఒక విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ రెండు చర్యలకూ అవినాభావ సంబంధం ఉన్నది. ఈ పరస్పర ప్రయోజనకర అంశాల మూలంగానే బిజెపి రాజకీయ విస్తరణ కూడా సాధ్యపడుతోంది. ఇది తిరుగులేనిదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పడానికి వీల్లేదు. ఈ క్రమంలో వచ్చే అడ్డంకులను అధిగమించడం పైనే బిజెపి ఉత్థాన పతనాలు ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు.


ఈ పరిణామ క్రమంలో భాగంగానే బిజెపి ఆర్థిక ఎజెండా ప్రస్తుతానికి కొంత ప్రతిఘటనను ఎదుర్కొంటోందని గమనించాలి. సాగు చట్టాలపై గత 40 రోజులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలోనూ, మంచు వర్షాల మధ్యా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నప్పటికీ, 60 మంది రైతులు చనిపోయినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టు విడుపులు లేకుండా వ్యవహరిస్తోంది. ఈ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసి కమిటీ ద్వారా పరిష్కరించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదంటే ఈ చట్టాలు అమలు చేయడం వెనుక మోదీకి బలమైన లక్ష్యం ఉన్నదన్న విషయం స్పష్టం అవుతున్నది. ఏడు సార్లు చర్చలు జరిగినా ప్రభుత్వం ఒక్కో క్లాజుపై చర్చిస్తామని మాత్రమే చెప్పడం, అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి వేదికపై తన వేగం ఆగదని మోదీ చెబుతుండడంతోనే చర్చలు జరిపే మంత్రులకు స్వంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రైతుల ప్రతిఘటన మోదీ లక్ష్యాలకు ఎంత మేరకు విఘాతం కల్పించగలదు? జనవరి నెలాఖరులో జరిగే పార్లమెంట్ సమావేశాల లోపు ఈ సమస్య ఒక కొలిక్కి రాకపోతే మోదీ ఏమి చేస్తారు? ఈ పరిణామాలు ఆయన తిరోగమనానికి సూచికలు అవుతాయా అన్నది 2021 ప్రారంభంలోనే తేలుతుంది. ఎందుకంటే మోదీ విజయం కేవలం మతశక్తుల విజయంపైనే ఆదారపడి లేదు. తనకు అండగా నిలిచే ఆర్థిక శక్తుల విజయానికి ప్రధానమంత్రి తోడ్పడకపోతే ఆయనకు రాజకీయ విజయాలు సాధ్యపడవు.


2021లో జరిగే ఎన్నికలను కూడా ఈ క్రమంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బిజెపి ఈశాన్యంలో తన విస్తరణను ప్రారంభించింది. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో జీహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లు విజయం సాధించడం ఒక రిహార్సల్ మాత్రమే. బెంగాల్, అస్సాం ఎన్నికలు కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీల భవిష్యత్‌ను కూడా నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్న రీత్యా కాంగ్రెస్‌తో ఏ ప్రాంతీయ పార్టీ చేతులు కలిపే అవకాశాలు కనపడడం లేదు. అస్సాంలో మహా కూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు తిరస్కరించడంతో కాంగ్రెస్ ఒంటరిదైపోయింది. అదే సమయంలో బిజెపి అస్సాం గణపరిషద్ వంటి పార్టీలతో కలిసి బిజెపి మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రాభవం క్షీణిస్తున్న విషయం గత లోక్‌సభ ఎన్నికల్లోనే తేలిపోయింది. అస్సాం, బెంగాల్‌లో హిందూత్వ ఓటర్లను సంఘటితం చేసేందుకు బీజేపీ చాలా రోజుల నుంచి ఉధృతమైన ప్రణాళికలను రూపొందించింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి ముఖ్యమైన నేతలు బిజెపిలోకి వలస రావడం ఎప్పటి నుంచో ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానమైన పోటీ నరేంద్ర మోదీ, మమతా బెనర్జీల మధ్యే ఉంటుందన్న విషయంలో సందేహం లేదు. రవీంద్రనాథ్ టాగోర్ ఆహార్యాన్నీ, ఆకారాన్నీ సంతరించుకుంటున్న నరేంద్ర మోదీకి బెంగాల్లో విజయం సాధించడం అత్యంత కీలకమైన రాజకీయ చారిత్రక అవసరం కనుక అన్ని శక్తియుక్తులూ ఒడ్డేందుకు సిద్ధపడుతున్నారు.


తమిళనాడులో రాజకీయ పరిస్థితుల రీత్యా అక్కడ సహజంగా డిఎంకె కూటమి ప్రభంజనం వీయాలి. కాని ఆ రాష్ట్రంలో ఉనికి కూడా లేని బిజెపి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు, అన్నాడిఎంకెను రెండుగా చీల్చి గుప్పిట్లో పెట్టుకోవడంలో బిజెపి విజయం సాధించడమే కాదు, మీడియా ప్రచారంలో కూడా అక్కడ అది అన్ని పార్టీల కన్నా ముందున్నదనడంలో సందేహం లేదు. తమిళనాడులో ఏదో రకంగా దూరి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే బిజెపి ప్రస్తుత లక్ష్యం. ‘2026లో మనమే అధికారంలోకి వస్తాం..’ అని అమిత్ షా ఇటీవలి తమిళనాడు పర్యటనలో చెప్పడం గమనార్హం. 


ఈ ఏడాది పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సాధించే విజయాలపైనే ఆ పార్టీ విస్తరణ, దాని లక్ష్యాలు నెరవేరడం ఆధారపడి ఉన్నాయయని చెప్పక తప్పదు. సంఘ్ పరివార్, బిజెపి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎజెండాలకు మాత్రమే కాదు, దేశంలో భావి పరిణామాలకు కూడా ఆ విజయాలు సూచిక అవుతాయి. అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్‌లో కూడా విజయం సాధిస్తే, తమిళనాడు, కేరళలో తన ఉనికిని చాటుకుంటే బిజెపికి దేశంలోనే తిరుగుండదని తేలవచ్చు. అంతేకాదు, తన ఆర్థిక ఎజెండాతో పాటు జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అనేక అంశాలను అమలు చేసి ఏకఛత్రాధిపత్యం క్రింద భారత దేశాన్ని తీసుకురాగలిగిన అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఏర్పడతాయి. ప్రధానమంత్రి మోదీ తాను స్వారీ చేస్తున్న సింహాన్ని ఎంత మేరకు అదుపులోకి తెచ్చుకోగలరన్న విషయంపై ఇది ఆధారపడి ఉన్నది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-01-06T06:08:36+05:30 IST