
శ్రీనగర్ : హిజాబ్ వివాదం కొనసాగుతున్న తరుణంలో జమ్మూ-కశ్మీరుకు చెందిన విద్యార్థినిపై దుర్మార్గంగా ఆన్లైన్ ట్రోలింగ్ జరుగుతోంది. జమ్మూ-కశ్మీరు బోర్డు పరీక్షల్లో పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచిన అరూసా పర్వేజ్ తన తలపై హిజాబ్ ధరించని ఫొటో సోషల్ మీడియాలో కనిపించడంతో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
జమ్మూ-కశ్మీరు పాఠశాల విద్య బోర్డు మంగళవారం పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అరూసా పర్వేజ్ సైన్స్, కామర్స్, హోం సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా చదివారు. ఈ పరీక్షల్లో సైన్స్ స్ట్రీమ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా మొత్తం మీద 500 మార్కులకు 499 మార్కులు సాధించారు. తాను సాధించిన విజయం గురించి ఫేస్బుక్లో పంచుకున్నారు. పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత అరూసా పర్వేజ్‌ను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె హిజాబ్ ధరించలేదు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో చూసినవారు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఓ నెటిజన్ ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మన సిస్టర్స్ కర్ణాటకలో హిజాబ్ కోసం పోరాడుతున్నారు, కశ్మీరులోని ముస్లింలనబడుతున్న మనం అది లేకపోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం’’ అని విరుచుకుపడ్డారు.
మరొక నెటిజన్ స్పందన ఏమిటంటే, ‘‘ఈ ఆడ పిల్లల్ని చూసినపుడు కశ్మీరీలం సిగ్గు పడుతున్నాం. భారత దేశంలో మన సిస్టర్స్ హిజాబ్ కోసం పోరాడుతున్నారు, కానీ దురదృష్టవశాత్తూ, మనకు ధరించే హక్కు ఉంది, కానీ ఆ హక్కుకు మనం కట్టుబడి లేము’’ అని విమర్శించారు.
‘‘కర్ణాటకలో ముస్లిం బాలికలు హిజాబ్ కోసం పోరాడుతున్నారు. మన కశ్మీరులో మన సిస్టర్స్ తమ ముఖాలను కప్పుకోకుండా తమ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. ఇది అనుమతించదగినది కాదు’’ అని మరొక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆన్లైన్ ట్రోలింగ్‌పై స్థానిక మీడియాతో అరూసా మాట్లాడుతూ, హిజాబ్ ధరించడం, మానుకోవడం అనేది మతం పట్ల వ్యక్తికిగల విశ్వాసాన్ని నిర్వచించదని చెప్పారు. ‘‘వాళ్ళ (ట్రోల్స్) కన్నా ఎక్కువగా అల్లాను నేను ప్రేమిస్తూ ఉండవచ్చు. నేను మనస్ఫూర్తిగా ముస్లింను, హిజాబ్నుబట్టి కాదు’’ అని చెప్పారు.
కర్ణాటక విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు సోమవారం విచారణ జరుపుతుంది. కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి ట్విటర్ వేదికగా అరూసా పర్వేజ్ ధైర్యసాహసాలను ప్రశంసించారు. ఈమె ధైర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ‘‘ఓ మంచి ముస్లింనని నన్ను నేను నిరూపించుకోవడానికి హిజాబ్‌ను ధరించవలసిన అవసరం లేదు’’ అని కశ్మీరుకు చెందిన క్లాస్ 12 టాపర్ అరూసా పర్వేజ్ చెప్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి