జమ్మూ-కశ్మీరు నియోజకవర్గాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2022-05-05T23:17:21+05:30 IST

Jammu and Kashmir శాసన సభ నియోజకవర్గాల పునర్విభజన తుది

జమ్మూ-కశ్మీరు నియోజకవర్గాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల

శ్రీనగర్ : Jammu and Kashmir శాసన సభ నియోజకవర్గాల పునర్విభజన తుది నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ సమాన సంఖ్యలో శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. జమ్మూ ప్రాంతంలో 43, కశ్మీరు ప్రాంతంలో 47 నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి షెడ్యూల్డు తెగలకు శాసన సభ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు లభించాయి. 


జమ్మూ-కశ్మీరు శాసన సభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ గురువారం సమావేశమై, తన నివేదికకు తుది రూపం ఇచ్చింది. దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్ కూడా గురువారం ప్రచురితమైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 90 శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో 43 నియోజకవర్గాలు జమ్మూ ప్రాంతంలోనూ, 47 నియోజకవర్గాలు కశ్మీరు ప్రాంతంలోనూ ఉన్నాయి. షెడ్యూల్డు తెగలకు 9 స్థానాలకు కేటాయించారు. ఈ విధంగా ఎస్టీలకు జమ్మూ-కశ్మీరులో రిజర్వేషన్లు లభించడం ఇదే తొలిసారి. డీలిమిటేషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 9(1)(ఏ), జమ్మూ-కశ్మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్, 2019లోని సెక్షన్ 60(2)(బీ) ప్రకారం ఈ ప్రక్రియ జరిగింది. 


Associate Members, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని వివిధ సంఘాలను సంప్రదించిన తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 9 శాసన సభ స్థానాలను ఎస్టీలకు కేటాయించాలని నిర్ణయించారు. వీటిలో ఆరు స్థానాలు జమ్మూ ప్రాంతంలోనూ, మూడు స్థానాలు కశ్మీరు లోయలోనూ ఉన్నాయి. జమ్మూ-కశ్మీరును ఏక కేంద్ర పాలిత ప్రాంతంగా Delimitation Commission పరిగణించింది. కశ్మీరు లోయలోని అనంత్‌నాగ్, జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంఛ్‌‌లను కలుపుతూ ఓ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ 18 చొప్పున శాసన సభ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. స్థానిక డిమాండ్ మేరకు కొన్ని శాసన సభ నియోజకవర్గాల పేర్లను కూడా మార్చారు. 


ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, డీలిమిటేషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 3  ప్రకారం డీలిమిటేషన్ కమిషన్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలోని పార్లమెంటరీ, శాసన సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయడం కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జమ్మూ-కశ్మీరు నుంచి ఎన్నికైన ఐదుగురు లోక్ సభ సభ్యులు ఈ కమిషన్‌తో కలిసి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ అసోసియేట్ మెంబర్స్‌ను లోక్‌సభ సభాపతి నియమించారు. 


భారత రాజ్యాంగంలోని అధికరణలు 330, 332లతోపాటు జమ్మూ-కశ్మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్, 2019లోని సెక్షన్ 7(6), సెక్షన్ 7(7) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు శాసన సభ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లను కల్పించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దీని కోసం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఎస్టీలకు 9, ఎస్సీలకు 7 నియోజకవర్గాలను కేటాయించినట్లు వివరించింది. గతంలోని జమ్మూ-కశ్మీరు రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు శాసన సభలో రిజర్వేషన్లు ఉండేవి కావని గుర్తు చేసింది. 


డీలిమిటేషన్ ప్రక్రియను ఓ ఏడాదిలో పూర్తి చేయవలసి ఉండగా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో గడువును పెంచాలని డీలిమిటేషన్  కమిషన్ కోరింది. అనంతరం మరో ఏడాదిపాటు దీని గడువును పెంచారు. డీలిమిటేషన్ కమిషన్‌లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్మూ-కశ్మీరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ వ్యవహరించారు. ఈ కమిషన్‌కు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహించారు. నిర్ణీత గడువుకు ఒక రోజు ముందే ఈ నివేదికను సమర్పించారు. 


Read more