స్టడీ వీసాలతో ఉగ్రవాదంలోకి యువత : డీజీపీ

ABN , First Publish Date - 2021-08-11T00:31:02+05:30 IST

పాకిస్థాన్ వెళ్ళేందుకు వీసాల మంజూరుకు నిబంధనలను కఠినతరం

స్టడీ వీసాలతో ఉగ్రవాదంలోకి యువత : డీజీపీ

శ్రీనగర్ : పాకిస్థాన్ వెళ్ళేందుకు వీసాల మంజూరుకు నిబంధనలను కఠినతరం చేయవలసిన అవసరం ఉందని జమ్మూ-కశ్మీరు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ అన్నారు. విద్యాభ్యాసం, ఇతర అవసరాల కోసం పాకిస్థాన్ వెళ్లడానికి వీసాలు తీసుకున్నవారిలో చాలా మంది ఆ దేశంలో ఉగ్రవాదంలో చేరుతున్నారన్నారు. 


దిల్‌బాగ్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ వెళ్ళడానికి స్టడీ, ఇతర వీసాల కోసం సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రాసెస్‌ను కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ వెళ్ళి, ఉగ్రవాదంలో చేరిన 57 కేసుల గురించి తమకు తెలుసునని చెప్పారు. 2017, 2018లలో చాలా మంది యువత పాకిస్థాన్ వెళ్లారని తెలిపారు. వారిలో చాలా మందికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నారు. తమ దృష్టికి 57 కేసులు వచ్చాయని చెప్పారు. ఇటువంటి ఉగ్రవాదుల్లో 17 మంది నియంత్రణ రేఖ వెంబడి భారత దేశంలో చొరబడేందుకు ప్రయత్నించగా, వారిని మట్టుబెట్టినట్లు తెలిపారు. 13 మంది క్రియాశీలంగా ఉన్నారని చెప్పారు. 17 మంది ఇంకా తిరిగి రాలేదన్నారు. 


దోడాలో ఉగ్రవాదంలో చేరిన ముగ్గుర్ని వెంటనే పట్టుకున్నామని చెప్పారు. ఉగ్రవాదులతో సంబంధంగల మరొకరి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-08-11T00:31:02+05:30 IST