జనని, జన్మభూమి

ABN , First Publish Date - 2022-02-16T09:41:25+05:30 IST

సభ్యతా ప్రయాణంలో కొన్ని విలువలు, వాటి ఆధారంగా కొన్ని ఉద్వేగాలు మానవులకు అలవడ్డాయి. తాను పుట్టిన కుటుంబం, ఎదిగి ఏర్పరచుకున్న కుటుంబం, చుట్టూ పరిసరాలు, నివసించే గ్రామం, మాట్లాడే భాష, కులం మతం తెగ వంటి...

జనని, జన్మభూమి

సభ్యతా ప్రయాణంలో కొన్ని విలువలు, వాటి ఆధారంగా కొన్ని ఉద్వేగాలు మానవులకు అలవడ్డాయి. తాను పుట్టిన కుటుంబం, ఎదిగి ఏర్పరచుకున్న కుటుంబం, చుట్టూ పరిసరాలు, నివసించే గ్రామం, మాట్లాడే భాష, కులం మతం తెగ వంటి సాముదాయిక అస్తిత్వాలు, అంతిమంగా ప్రాంతం, దేశం.. వీటన్నిటి విషయంలోనూ మనుషులకు కొన్ని మమకారాలు, గాఢమైన ఆవేశాలు ఉంటాయి. ప్రత్యర్థులైనవారు పరస్పరం ఈ ఆవేశోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటారు. తల్లిని, ఆమె లైంగిక నిబద్ధతను ప్రశ్నించేవిధంగా చేసే దూషణ మనుషులను ఎక్కువగా బాధించి, కలవరపరచడం అనేక సమాజాలలో పరిపాటి. తల్లిని దూషించడం పాత విలువ అయి, కుసంస్కారంగా స్థిరపడిన తరువాత, అత్యంత ఆధునిక ప్రజాస్వామిక నిందగా ‘దేశభక్తి రాహిత్యం’ ముందుకు వచ్చింది. జననీ జన్మభూమి, మన పవిత్ర సంభాషణల్లో జనని, జన్మభూమి రెండూ కలిసే వినిపిస్తాయి కాబట్టి, దేశభక్తి రాహిత్యం కూడా మాతృనింద వంటి తీవ్రమైనదే అవుతుంది.


ఆధునిక జాతీయ రాజ్యాలలో దేశభక్తికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. జాతీయత హద్దులను అధిగమించడానికి ప్రయత్నించేవారిని దేశంపై నిబద్ధత లేనివారిగా పరిగణించడం చూస్తాము. అంతే కాదు, అధికారం కోసం పోటీపడే జాతీయవాద శక్తులు కూడా, తమ స్పర్థలలో భాగంగా ఒకరినొకరు విజాతీయులుగా, జాతి వ్యతిరేకులుగా, దేశభక్తిరహితులుగా విమర్శించుకోవడం చూస్తున్నప్పుడు, నిజమైన జాతీయ భావం ఉనికిపైనే సందేహం కలగడం సహజం. పాలకశ్రేణుల్లోని వర్గాలే కాదు, ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడు, పాలనలో తమ భాగస్వామ్యాన్ని కోరినప్పుడు, ప్రాబల్యశక్తుల ప్రయోజనాలను దెబ్బతీసే కోర్కెలు కోరినప్పుడు సాధారణ ప్రజానీకం దేశభక్తి కూడా సందేహాస్పదం అవుతుంది. అత్యంత తీవ్రమైన నేరం, పాలకుల దేశభక్తినే ప్రశ్నించడం. ఆ ప్రశ్న వేసిన వ్యక్తి ఎంతగా ప్రముఖుడూ విశిష్టుడూ అయినా సరే, అతని పుట్టుకా తల్లి దాంపత్య నిష్ఠా చర్చలోకి వచ్చి, మనమేమంత ఆధునిక యుగంలోకి రాలేదన్న హఠాత్ జ్ఞానోదయం కలుగుతుంది. 


కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు అంశాలపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని శంకిస్తున్నారు. పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌లో వాస్తవమెంత, ప్రచారమెంత అన్నది ఒక ప్రశ్న. చైనా విషయంలో భారత ప్రభుత్వం చెప్పుకుంటున్నంత ప్రతిఘటన నిజంగా ఇచ్చిందా లేదా అన్నది రెండో ప్రశ్న. మొదటిది ప్రభుత్వం చేసిన గుణపాఠపు దాడి గురించి, రెండవది ఆత్మరక్షణ పోరాటం గురించి. తాము ఏమి చెబుతున్నామో దాన్ని విశ్వసించకుండా, అనుమానపడడం దేశభక్తి కాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇరుగు పొరుగుతో ఉద్రిక్తతలు, యుద్ధాలు, విదేశాంగ విధానాలు, ఇవి విమర్శకు అతీతమైనవా, కావా అన్నది మరొక్కసారి చర్చించవలసిన ప్రశ్న. పుల్వామా సంఘటన గురించి ప్రస్తావిస్తూ, అక్కడికి అంత పేలుడు సామగ్రి ఎట్లా సమకూరిందన్న మరో ప్రశ్న కానీ, గాల్వాన్‌లో జరిగిందేమిటన్న సందేహం కానీ భారత సైన్యాన్ని, శక్తిని శంకించడం అవుతుందా? 


భారత సైన్యం ధైర్యసాహసాలను కానీ, శక్తి పాటవాలను కానీ ఎవరూ శంకించలేరు. మనకంటె అన్ని విధాలా బలహీనంగా ఉన్న పాకిస్థాన్‌ను భారత సేనలు అవలీలగా పరాజితం చేయగలవు. పెద్ద సైనిక శక్తి అయినప్పటికీ, చైనాతో యుద్ధమే వస్తే భారతసైన్యం తగినవిధంగా ప్రతిఘటన ఇవ్వగలదు. ఏదైనా సామ్రాజ్యవాద శక్తి, ఇరాక్ విషయంలోనో, ఆప్ఘనిస్థాన్ విషయంలోనో వ్యవహరించినట్టు భారత్‌తో వ్యవహరిస్తే, భారత ప్రజలు, సైన్యమూ కలసి గొప్ప దేశభక్త పోరాటం చేయగలరు. కానీ, ఏదైనా ఒక సైనిక చర్య గురించిన విమర్శ వచ్చిందంటే, అది సైన్యాన్ని విమర్శించినట్టు కాదు. నాగాలాండ్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకరమైన మారణకాండను తప్పుపట్టామంటే అది భారత సేనను దోషిగా చేయడం కాదు. ఏవో సైనిక నియంతృత్వ దేశాలలో మినహాయిస్తే, దాదాపుగా అన్ని దేశాలలోనూ సైన్యం ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వం రాజకీయశక్తుల మార్గదర్శకత్వంలో ఉంటుంది. సర్జికల్ స్ట్రయిక్స్ కానీ, చైనా సరిహద్దుల్లో ఎట్లా వ్యవహరించాలన్నది కానీ సైన్యం తమంతట తాము తీసుకునే నిర్ణయం కాదు. ప్రభుత్వం నిర్దేశాలకు అనుగుణంగా సాయుధ బలగాలు వ్యవహరిస్తాయి. ప్రభుత్వం కల్పించిన అపరిమిత అధికారాల పర్యవసానంగానే పౌరులపై సైనిక అఘాయిత్యాలు జరుగుతాయి. ఈ అన్ని సందర్భాలలోనూ దోషి ప్రభుత్వమే, ఆ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ శక్తే.


కాబట్టి, ప్రభుత్వాలు తీసుకునే అన్ని నిర్ణయాలనూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రశ్నించే అవకాశం ఉండాలి. బంగ్లాదేశ్ యుద్ధాన్ని ఇందిర తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి వినియోగించుకున్నారని, అంతర్గత వ్యతిరేకతకు తరచు విదేశీ ప్రమాదాన్ని ముడిపెట్టి నిర్బంధం అమలు చేశారని విన్నాము. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మొదలవుతాయి అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడానికి కారణం ప్రభుత్వాలపై ఉన్న అపనమ్మకమే. భావోద్వేగాలపై సవారీ చేయాలనుకునే వారు, అటువంటి వాతావరణమే సృష్టిస్తారన్న అభిప్రాయం ప్రజలలో స్థిరపడిపోయింది. ఎన్నికల లాభం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడే ప్రభుత్వాలున్నప్పుడు, అన్ని పాలనాంశాలూ పరిశీలనలోకి రాకతప్పవు. అవి సైనిక సంబంధమైనవి అయినంత మాత్రాన వాటికి మినహాయింపు ఉండదు. ఆ విమర్శలను తప్పు పట్టకూడదు, విమర్శకులను విద్రోహులనకూడదు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు ప్రభుత్వాల సైనిక వ్యయంతో సహా అన్నిటినీ నిశిత పరిశీలన చేస్తారు. అన్ని ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు బాధ్యత వహించాలని ఆశిస్తారు. 


ప్రభుత్వ సైనిక సంబంధ ప్రచారంలోని వాస్తవావాస్తవాలను చర్చించినంత మాత్రాన, ఒక ప్రతిపక్ష నాయకుడి పుట్టుక గురించి నిందాపూర్వకంగా మాట్లాడడం మన రాజకీయ సంవాదాల్లోని కుసంస్కారాన్ని సూచిస్తుంది. పుట్టుక విషయంలో ఉండే గాఢమైన ప్రశ్నించరాని నమ్మకమే ప్రభుత్వంపై ఉండాలన్నది ఆ హీనప్రశ్న వెనుక ఉన్న అభీష్టం కావచ్చును కానీ, మన రాజకీయాలు ఎటువంటివారిని ప్రజాక్షేత్రంలోకి యథేచ్ఛగా వదిలిపెడుతున్నాయో తెలిసి బాధ కలుగుతుంది.

Updated Date - 2022-02-16T09:41:25+05:30 IST