
అమరావతి: చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదంలో పెళ్లి బృందానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రమాదంలో మరో 54 మంది గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళకరంగా ఉండడం మరింత విషాదకరమని తెలిపారు. ప్రమాదం సంభవించగా చాలాసేపటి వరకు ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదని తెలిసి బాధ అనిపించదని ఆవేదన చెందారు. ఆ సమయంలో సహాయం అందక క్షతగాత్రులు ఎంత వేదన అనుభవించారో ఊహిస్తేనే గుండె భారంగా మారుతోందన్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని జనసేనాని అన్నారు. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపరచాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి తగినంత నష్టపరిహారాన్ని రాష్ట్రప్రభుత్వం అందివ్వాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి