మార్పు కోసమే పార్టీ పెట్టాను: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2021-07-08T02:12:05+05:30 IST

ప్రజల బాగు కోసం, మార్పు కోసమే తాను పార్టీ పెట్టానని జనసేన పార్టీ అధ్యక్షుడు

మార్పు కోసమే పార్టీ పెట్టాను: పవన్ కల్యాణ్

అమరావతి: ప్రజల బాగు కోసం, మార్పు కోసమే తాను పార్టీ పెట్టానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మట్లాడారు. జన సైనికులు లేనిదే జనసేన లేదన్నారు. కరోనా సమయంలో జన సైనికులు ఎంతో సేవ చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. రాజ్యాధికారమే జనసేన లక్ష్యం కాదని ఆయన పేర్కొన్నారు. తన ఒక్కడి పదవి, గెలుపు కోసం తాను రాజకీయాలలోకి రాలేదని పవన్ స్పష్టం చేశారు. అవినీతితో నిండిపోయిన రాజకీయాలలో మార్పు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వారి పిల్లలే పదవులు పంచుకోవడం సరికాదన్నారు. కోట్లు దోచుకోవడం, తరతరాలకు దాచుకోవడమే రాజకీయం కాదన్నారు. అధికారం‌ కొన్ని కులాలకే పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హత ఉన్న అన్ని‌వర్గాల వారు రాజ్యాధికారం సాధించాలన్నారు.


ప్రజల కోసం పని చేసే వారినే రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అధికార దర్పంతో విర్రవీగేవారు కాదు, బాధ్యతతో పని చేసే వారు రాజకీయాలలో ఉండాలన్నారు. కుల పరమైన కార్పొరేషన్‌లు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఇప్పటి‌వరకు లేని కులాలు, అధికారంలోకి వచ్చేందుకు జనసేన కృషి‌ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎన్ని దెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని అవమానాలు ఉంటాయని తెలిసినా పార్టీ పెట్టానని ఆయన పేర్కొన్నారు. 




"నా స్వార్థం చూసుకుంటే... ఏ పార్టీ లోకి వెళ్లినా నాకు సముచిత స్థానం ఉండేది. ప్రజల బాగు కోసం.. మార్పు కోసమే నేను పార్టీ పెట్టాను" అని ఆయన అన్నారు. సీఎం నివాసానికి సమీపంలో దారుణం జరిగితే నిందితులను పట్టుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి నిందితులను కాపాడే రాజకీయం కాదు కావాల్సిందని, అటువంటి వారికి శిక్షలు పడేలా చూసే రాజకీయం కావాలని ఆయన కోరారు. లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందన్నారు. దీని పై ఉద్యమ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు.


రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారన్నారు. పన్నుల భారాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది పాలకులు బూతులు తిడుతూ కులాల వారీగా విడగొడుతున్నారని ఆయన విమర్శించారు. ముక్కుపచ్చలారని స్కూల్ విద్యార్థులపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. కులాలను ఆపాదిస్తూ తిట్టే విధానాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. 


అభివృద్ధి చేయకుండా,  అప్పులతో సంక్షేమం రాష్ట్రానికి, ప్రజలకు క్షేమం కాదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై తనకు నమ్మకం లేదన్నారు. ఇద్దరు సీఎంల మధ్య ఉన్న సయోధ్యతో ఎవరూ నిజం అనుకోవడం లేదన్నారు. ఈ సమస్యపై ఆ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. నిపుణులతో సమావేశం పెట్టి ఈ జల వివాదంపై చర్చిస్తామన్నారు. 


జనసేన పార్టీ కార్యవర్గం సభ్యులు ప్రజల్లోకి వెళ్లాలని నూతన కార్యవర్గానికి ఆయన హితబోధ చేశారు. అందరికి ఆమోదం లేకున్నా భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. మనం ప్రజల కోసం ఎంతవరకు పని చేస్తున్నామో ఆలోచన చేయాలన్నారు. పెద్ద స్థాయి వ్యక్తులే పార్టీ పెట్టలేక ఆగిపోయారన్నారు. పార్టీ నడపడం కష్టం అయినా ప్రజల కోసం ముందుకు సాగుతున్నావని ఆయన పేర్కొన్నానరు. యువత రాజకీయాలలోకి రావాలని,  ప్రజల సమస్యలపై స్పందించాలన్నారు. పార్టీలో‌ అభిప్రాయ బేధాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని పవన్ కల్యాణ్ సూచించారు. 


Updated Date - 2021-07-08T02:12:05+05:30 IST