ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ!

ABN , First Publish Date - 2022-05-21T08:16:52+05:30 IST

న్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో తమకు స్పష్టత..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ!

బీజేపీతోనే కలిసి వెళ్తాం.. కలిసొచ్చే పార్టీలతోనూ నడుస్తాం

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం.. వైసీపీ వాళ్లకు ఉలుకెందుకో!

ప్రజలకు దగ్గరయ్యేందుకు రాష్ట్రవ్యాప్త యాత్ర చేస్తా

నన్ను విమర్శించిన మంత్రులేమయ్యారు?

జగన్‌ పార్టీకి ఓటు కరెక్టా?

మేధావులు, పెద్దలు ఆలోచించాలి.. మీడియాతో పవన్‌

జనసేన అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ


అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో తమకు స్పష్టత ఉందన్నారు. రాష్ట్ర బీజేపీతో కలిసి పని చేస్తున్నా.. ప్రణాళికాలోపం ఉందని చెప్పారు. పొత్తులపై ఎలాంటి ఆలోచనా చేయలేదని.. కానీ బీజేపీతో మాత్రమే కలిసి నడుస్తామని చెప్పారు. ఇదే సమయంలో తమ భావాలకు అనుగుణంగా ఉండే పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరు కలిసొచ్చినా కలుపుకొని వెళ్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదని భావిస్తున్నట్లు తెలిపారు.


శుక్రవారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో   ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కామన్‌మేన్‌ ప్రోగ్రాం ఉండాలన్నారు. రాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయని వ్యాఖ్యానించారు. వైసీపీ విధానాల వల్లే వ్యతిరేక ఓటు చీలదన్న వ్యాఖ్యలు చేశానని తెలిపారు. ‘దానికి అధికారపక్షం వాళ్లు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలి. నన్ను తక్కువ చేసి మాట్లాడే నాయకులు నా వ్యాఖ్యల గురించి ఎందుకు మళ్లీ ప్రశ్నిస్తున్నారు? ఎందుకంత కంగారు? నాపై విమర్శలు చేసిన మంత్రులు ఇప్పుడు ఏమయ్యారు? ప్రజలకు సేవ చేయడం కన్నా నన్ను తిట్టడం మీదే కొంత మంది ఎక్కువ దృష్టిపెడుతున్నారు. దానికి ప్రజలే సమాధానం చెబుతారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తా. ప్రజల హృదయాలకు దగ్గరయ్యే విధంగా చేస్తాను. రాష్ట్రంలో కులాలను విభజించే పనిలో వైసీపీ ఉంది. బ్రిటిష్‌ వారి మాదిరిగా విభజించి పాలించు అనే విధానం పాటిస్తోంది. బీసీల కోసం పదుల సంఖ్యలో కార్పొరేషన్లు పెట్టి కనీసం నిధులు కూడా ఇవ్వడం లేదు. పొత్తుల అంశం గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. మాతో కలిసి వచ్చే వారితో నడుస్తాం. నేనెప్పుడు ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాలకు లోబడి మాత్రమే ఆలోచించి మాట్లాడతాను. బీజేపీ రూట్‌ మ్యాప్‌ అనే మాట కూడా ఇరు పార్టీల పొత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం మీద మాత్రమే ఉంటుంది. ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడే చెప్పలేం. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు. వైసీపీకి ఓటేయడం ఎంతవరకు కరెక్టో మేధావులు, పెద్దలు ఆలోచించాలన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..


కూర్చుని మాట్లాడితే సెట్‌ అవుతాయ్‌

నా విధానాలకు మద్దతివ్వాలా వద్దా అనేది బీజేపీ ఇష్టం. నా అభిప్రాయాన్ని ఆ పార్టీ పెద్దలకు వివరిస్తా. బీజేపీ విధానాలు ఎలా ఉన్నా.. నా నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తారనే భావిస్తున్నాను. నాకు మోదీతో బాగా కనెక్షన్‌ ఉంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా, మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు.. ఇలా షెడ్యూల్‌ కుదరలేదు. బీజేపీ, జనసేన నేతలు కూర్చుని మాట్లాడితే అన్ని సెట్‌ అవుతాయ్‌. బీజేపీకి జాతీయ స్థాయిలో మంచి బలం ఉంది. రాజధాని విషయంలో రైతులకు ఆ పార్టీ అండగా నిలిచింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అధ్వాన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం కేంద్ర పెద్దలకు తెలుసు. బీజేపీ, జనసేన సమావేశాల్లో కూడా వైసీపీ వైఫల్యాలను చర్చించాం. రాష్ట్రం బలంగా ఉంటనే జనసేన బలంగా ఉంటుంది. పార్టీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించలేదు. ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్న వైసీపీ వాళ్ల చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా.

 

ఏం చేసినా చెల్లుతుందా?

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి. ప్రజలు వైసీపీ 151 సీట్లు ఇస్తే.. మంచి పాలన ఉందా? ఏం చేసినా చెల్లిపోతుందంటే ఎలా కుదురుతుంది? దేశంలో ఎక్కడకు వెళ్లినా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని చర్చించుకుంటున్నారు. ఢిల్లీ పెద్దల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. అందుకే శ్రీలంకతో పోలుస్తున్నారు. ఈ అంశాలు చూశాకే ఇటీవల రాష్ట్ర పరిస్థితిపై ట్వీట్‌ చేశాను. పరిమితులు దాటి అప్పులు తీసుకుంటున్నారు. ఆర్థికపరమైన అంశాల్లో బ్యూరోక్రాట్స్‌ నలిగిపోతున్నారు. వారికి వాయిస్‌ లేదు.. చాయిస్‌ లేదు. కౌలు రైతు భరోసా యాత్రలో వాళ్ల కష్టాలను చూసి చాలా బాధ కలిగింది. నా వంతు బాధ్యతగా భావించి సాయం చేయడానికి ముందుకొచ్చాను. భూమి ఉన్న యజమానికి ఇబ్బంది కలగకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. కౌలు రైతులకు సాయం చేసే కార్యక్రమం దేశం మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఉంది.


సీపీఎస్‌ రద్దుపై చర్చలతో పరిష్కారం

ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. సీపీఎస్‌ రద్దుకు హామీ ఇచ్చి ఇప్పుడు టెక్నికల్‌గా కుదరదని ఎలా చెబుతారు? సీపీఎస్‌ రద్దుతో ప్రభుత్వానికి ఎలాంటి భారం ఉండదు. కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. ఏపీ ప్రభుత్వానికి కూడా మార్గాలున్నాయి. జనసేన అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తాం. చట్ట సభల్లో ఒక మాట చెబితే అది శాసనంగా భావించాలి. వైసీపీ నాయకులు మాత్రం చెప్పేదొకటి.. చేసేదొకటి. మాట తప్పిన రాజకీయ నాయకులను బాధ్యులను చేయాలి. నాతో సహా ఎవరు హామీ ఇచ్చి మాట తప్పినా చర్యలు ఉండాలి.


మద్య నిషేధం అని హామీ ఇచ్చి ఎలా అమ్ముతున్నారు? లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలు ఉన్నప్పుడు.. ప్రజలకు మేలు చేసే అంశాలపై దృష్టిపెట్టరా? అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఎలా? మైనింగ్‌ మాఫియా ఆగడాలు వాస్తవం కాదా? ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజలు ప్రశ్నించలేకపోతున్నారు. ఎవరికి వారే ఆలోచించుకుని నిలదీసే పరిస్థితి రావాలి. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఏపీలోని రాజకీయ నాయకులు వ్యక్తిగత స్వలాభం కోసం పని చేస్తున్నారు. ఏపీ సమస్యల పుట్టగా మారింది. ఒక రోజు ఒక సమస్య మీద మాట్లాడితే.. రేపటికి మరో కొత్త సమస్య ప్రత్యక్షమవుతోంది. సినిమా టికెట్ల అంశాన్ని ప్రజలు పెద్ద సీరియ్‌సగా పట్టించుకోలేదు.


ఆ కేసుల్లో దోషులను శిక్షించలేదేం?

కోడి కత్తి విషయంలో నడిచిన డ్రామా అందనీ ఆశ్చర్యపరచింది. ఆ కేసులో నిందితుడికి  ఏదో పదవి ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఎన్నో మలుపులు తిరిగింది. ఈ రెండు కేసుల్లో దోషుల్ని జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎందుకు శిక్షించలేకపోయారు? 


సుస్థిరత ఉంటేనే పెట్టుబడులు..

విదేశీ పెట్టుబడులు రావాలంటే సుస్థిరత ఉండాలి. అది లేనప్పుడు ఎన్ని పర్యటనలు చేసినా ప్రయోజనం ఉండదు. పేపర్ల మీద సంతకాలు పెడితే  పరిశ్రమలు పెట్టినట్లు కాదు. అవి వాస్తవ రూపంలోకి తీసుకొస్తే స్వాగతిస్తాం. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఒక్కటే తెలుగు వారందరినీ ఒక్కటి చేస్తుంది. ఈ అంశాన్ని ఇప్పటికే బీజేపీ పెద్దలకు వివరించాను. కేంద్రానికి కూడా బాధ్యత ఉంది. నేను చెప్పిన అంశాలను బీజేపీ విశ్వసిస్తుందని నమ్ముతున్నాను. కియా వ్యవహారంతో పెట్టుబడిదారుల్లో అభద్రత ఏర్పడింది. మన రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలం కాదన్న భావన వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వ్యక్తిగా పెట్టుబడులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


తెలంగాణలో 20% నియోజకవర్గాల్లో పోటీ: పవన్‌

చౌటుప్పల్‌, మే 20: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం నియోజకవర్గాల్లో బరిలో దిగే విషయమై పార్టీ నాయకులతో చర్చిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ బలం, బలహీనత తనకు తెలుసున్నారు. జనసేనకు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఆరు వేల ఓట్లు ఉన్నాయని.. తాము ఎన్నికల్లో గెలవకపోయినా, ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేయగలమని వివరించారు. ఆశయం కోసం నిలిచినవారికి  ఓటమి అనేదే ఉండదని, ముందడుగే ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు.. కొంగరి సైదులు, శ్రీనివాస్‌ కుటుంబాలను పవన్‌ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-05-21T08:16:52+05:30 IST