Advertisement

ఇంకెన్నాళ్లీ అనాగరికాలు?

Oct 14 2020 @ 01:52AM

ప్రపంచం నాగరికంగా ఎంతో ముందుకి పోతుందనుకుంటున్నాం. చంద్రుని మీద కాపురం పెట్టేందుకు ఉరకలు వేస్తున్నాం. కానీ మరోపక్క ఇస్రో చైర్మన్ తన ప్రయోగాన్ని ఆశీర్వదించమని చెంగాళమ్మను వేడుకుంటున్నారు. మనిషిని కోసి బతికించగల గాంధీ ఆస్పత్రి డాక్టర్లు మృత్యుంజయ యాగం చేస్తున్నారు. ఇంకోపక్క దేశ ప్రధాని వేద కాలంలోనే విమానాలున్నాయని పుష్పక విమానాలను ఉదహరిస్తున్నారు. ఆ నాడే సర్జరీలు జరిగాయని వినాయకుని తలను అతికించే పురాణ కథను ఉటంకిస్తున్నారు. ఒక వైస్ చాన్సలర్, పిండాన్ని కోసి ముక్కలుగా చేసి కుండల్లో పెట్టి పిల్లలను పుట్టించవచ్చని చెబుతున్నాడు. ఎటుపోతున్నామో అర్థంగాని పరిస్థితి. వీరంతా చదువుకున్న వారే. ఈ రోజు తెలంగాణలోని నిజమాబాద్‌లో ఒక దొంగబాబా భూత వైద్యం పేరుతో ఒక మైనర్ బాలికకు మూడు నెలలుగా మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తుంటే, అసలు విషయం బయటపడి ప్రజలు ఆ దొంగ బాబాకి చెప్పులతో దేహశుద్ధి చేశారు. కరోనా సమయంలో కూడా మూఢనమ్మకాల వల్ల ఎన్నో అకృత్యాలు జరిగాయి.


ఆ మధ్య తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు మహిళలు ఏసు ప్రభువు పిలుస్తున్నాడంటూ ఉరివేసుకు చనిపోయారు. వేరొక చోట పందిపిల్లకు రోగమొచ్చి గుడి చుట్టూ తిరిగితే దాన్ని వరాహావతారమని పూజలు చేశారు. ఇంకొక చోట గుడిలోని సాయిబాబా బొమ్మకి కన్ను మీద రంగు పోయి లోపలి గోళీకాయ కనబడితే భక్తులకు పూనకాలు! మనం నిజంగా ఆధునిక సమాజంలోనే ఉన్నామా? ప్రజలకు సరే, వారిని పాలించే నేతలకు ఏమైంది? రాజ్యాంగంలో రాసుకున్న సూత్రాలు ఏమైనాయి? దేశంలోని సైన్స్ సెంటర్లు ఏమి చేస్తున్నాయి? జనం ఈ రకంగా మూఢ నమ్మకాలలో కూరుకుపోతుంటే దేశమెలా అభివృద్ధి చెందుతుంది? ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, మంత్రులు, గవర్నర్లు లౌకికవాదాన్ని మంట గలుపుతూ అధికార హోదాలో గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకా దిగజారి దొంగ బాబాల ఆశ్రమాల గేట్ల దగ్గర కాపలా కాస్తున్నారు. ఈ తిరోగమనాన్ని నిలువరించేందుకు ఒక్కటే పరిష్కారం. మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మాదిరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మూఢ నమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలి. దాని కోసం ప్రజా శ్రేయస్సు కోరేవారంతా కలిసి ఉద్యమించాలి. 


– నార్నె వెంకటసుబ్బయ్య

ఏపీ హేతువాద సంఘం

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.