ఎంపిక పూర్తయింది.. ఆమోదమే మిగిలింది..

Published: Fri, 25 Mar 2022 23:44:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎంపిక పూర్తయింది.. ఆమోదమే మిగిలింది..

జిల్లాలో పట్టాలెక్కిన దళితబంధు పథకం

194 మంది లబ్ధిదారుల ఎంపిక 

కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో ఉన్నందున తగ్గిన సంఖ్య

అర్హతపై క్షేత్రస్థాయిలో స్థితిగతుల పరిశీలన

యూనిట్ల ఏర్పాటుపై అవగాహన సదస్సులు


దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. నిర్ణయించిన గడువులోగా పని పూర్తిచేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. అధికారులను అప్రమత్తం చేసింది. అనుకున్న పనిని పూర్తిచేసింది.  జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడమే ఇందుకు నిదర్శనం. మంత్రి ఎర్రబెల్లి ఆమోదం పొందడమే ఇక మిగిలి ఉంది. ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


జనగామ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళితబంధు కార్యక్రమం జిల్లాలో పట్టాలెక్కింది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి 100 చొప్పున యూనిట్లు మంజూరు అయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాగా నేడో రేపో యూనిట్లను కేటాయించనున్నారు. కాగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయి మంత్రి దయాకర్‌రావు ఆమోదం కోసం జాబితా వెళ్లింది. నేడో రేపో మంత్రి ఆమోదం పొందగానే ఆ రెండు నియోజకవర్గాల్లో దళితబంధు ప్రక్రియ షురూ కానుంది. లబ్ధిదారుల గుర్తింపు పూర్తి కాగానే వారితో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆసక్తి ఉన్న యూనిట్లను ఏర్పాటు చేయిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం లబ్ధిదారులు ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేస్తుంది.


జిల్లా నుంచి 194 మంది ఎంపిక

దళితబంధు పథకం కింద జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 194 మందిని ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 100 చొప్పున మూడు నియోజకవర్గాలకు 300 యూనిట్లు మంజూరైనప్పటికీ జిల్లాలోని కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో ఉన్న కారణంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి, దూల్మిట్ట మండలాలు సిద్ధిపేట జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర, మండలాలు మహబూబాబాద్‌లో, రాయపర్తి మండలం వరంగల్‌ జిల్లాలో, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని ధర్మసాగర్‌, వేలేరు మండలాలతో పాటు కాజీపేట మండలంలోని కొంతభాగం హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. ఈ మండలాలను మినహాయించిన కారణంగా జిల్లాలో 194 లబ్ధిదారులు ఎంపికయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి 50 మంది, స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి 78 మంది, జనగామ నియోజకవర్గంనుంచి 66 మందిని ఎంపిక చేశారు. 


మూడు నియోజకవర్గాల్లో 60,818 దళిత కుటుంబాలు

జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 60,818 దళిత కుటుంబాలు ఉండగా వారి జనాభా 2,14,615 ఉంది. జనగామ నియోజకవర్గంలో 17516 కుటుంబాలకు గానూ 62,260, పాలకురిలో 19,093 కుటుంబాలకు గాను 67,825, ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో అత్యధికంగా 24,209 కుటుంబాలకు గాను 84,530 మంది దళితులు ఉన్నారు.


లబ్ధిదారుల ఎంపిక ఇలా..

దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా చేశారు.  పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి మండలంలోని తీగారం గ్రామంలో 20 మందిని, దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామంలో 15 మందిని, కొడకండ్ల మండలంలోని రామన్నగూడెంలో 15 మందిని ఎంపిక చేశారు. ఇక జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రతీ మండలంలో దళిత కుటుంబాలు తక్కువగా ఉన్న కొన్ని గ్రామాలను తీసుకోని ఆయా గ్రామానికి ఒక్కో లబ్ధిదారుడిని ఎంపిక చేశారు. దళితబంధు విషయంలో ఇతర దళితుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్తిగా ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామం మొత్తంగా దళితబంధు అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ.. జిల్లాలో ఇందుకు విరుద్ధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీని వల్ల ఆ గ్రామంలో మిగతా దళితుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.


క్షేత్రస్థాయిలో పరిశీలన

లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడంతో వారిని స్థితిగతులు, అర్హత గురించి తెలుసుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇటీవల కొడకండ్ల మండలం రామన్నగూడెంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పర్యటించి దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారుల స్థితిగతులపై ఆరా తీశారు. లబ్ధిదారులు ప్రస్తుతం ఏ పని చేస్తున్నారు? దళితబంధు కింద ప్రభుత్వం ఇచ్చే రూ. 10 లక్షలను ఏ యూనిట్‌కు ఉపయోగించుకుంటారు అనే అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. లబ్ధిదారుడి కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిగా తీసుకుంటున్నారు.


అవగాహన సమావేశాలు

లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడంతో అధికారులు వారితో అవగాహన సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎంపిక, మంత్రి ఆమోదం పూర్తి కావడంతో కలెక్టరేట్‌లో శుక్రవారం లబ్ధిదారులతో కలెక్టర్‌ శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఏయే యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.


ఎంపిక తర్వాత శిక్షణ

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి శిక్షణ ఇస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎలాంటి బ్యాంక్‌ లింకేజీ లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ. 10 లక్షలను ఖాతాలో జమచేస్తుంది. ఈ డబ్బులను వృథాగా ఖర్చు పెట్టుకోకుండా వారి జీవనోపాధికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. వారికి ఆసక్తి ఉన్న యూనిట్లకు సంబంధించిన సాధారణ, సాంకేతిక శిక్షణను కూడా అందించనున్నారు. ఈ శిక్షణ అనంతరం వారు తాము శిక్షణ పొందిన రంగాలకు సంబంధించి యూనిట్లను నెలకొల్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంపిక అనంతరం ఈ బాధ్యతను అంతా నోడల్‌ అధికారుల  పర్యవేక్షించనున్నారు.


దళితబంధు బృహత్తర పథకం : కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య

జనగామ కల్చరల్‌, మార్చి 25: దళితబంధు పథకం బృహత్తరమైనదని కలెక్టర్‌ శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో దళిత బంధు పథకానికి ఎంపికైన పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల లబ్ధిదారులు, అధికారులకు అవగాహనతో పాటు శిక్షణ సదస్సు నిర్వహించారు. లబ్ధిదారులకు ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దళితుల జీవనశైలిని మార్చేందుకు, వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకం తెచ్చిందని అన్నారు. లబ్ధిదారులు పట్టుదలతో శ్రమించి విజయం సొంతం చేసుకోవాలని సూచించారు. దళితబంధు పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.