జనం ఛీ అంటున్నారు

ABN , First Publish Date - 2022-06-28T05:18:22+05:30 IST

మునిసిపల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పక్ష సభ్యులే అభివృద్ధి పనులు జరగడం లేదంటూ విరు చుకుపడ్డారు. బయట తిరగలేకపోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనం ఛీ అంటున్నారు
సమావేశంలో మాట్లాడుతున్న వైస్‌ చైర్మన్‌ ముప్పిడి అంజి

వాడీవేడిగా జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ సమావేశం

అభివృద్ధి పనులపై వైస్‌ చైర్మన్‌ అంజి ఆగ్రహం

బయటకు వెళుతుంటే జనం నిలదీస్తున్నారు

ఆవేదన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు

చేసిన పనులు..వచ్చిన నిధులు లెక్కలు తేలాలి

ఏసీలు అవసరం లేదు..గోతులు పూడ్చండి చాలు  


జంగారెడ్డిగూడెం టౌన్‌, జూన్‌ 27 : మునిసిపల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పక్ష సభ్యులే అభివృద్ధి పనులు జరగడం లేదంటూ విరు చుకుపడ్డారు. బయట తిరగలేకపోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యలను లేవనెత్తారు. ప్రశ్నలతో చైరపర్సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. వార్డు ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నామని కౌన్సిల్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో 51 నూతన ప్రతిపాదనలను కౌన్సిల్‌ ముందుంచారు. టెండర్‌ పూర్తయిన పనులే పూర్తి చేయలేదని అవి పూర్తయ్యేవరకు కొత్త ప్రతిపాదనలు అవసరం లేదని కౌన్సిల్‌ సభ్యులు తేల్చిచెప్పారు. 


రోడ్ల దుస్థితిపై నిలదీస్తున్నారు

సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముప్పిడి అంజి మాట్లాడుతూ సూర్యకాలేజీ రోడ్డు దారుణంగా ఉందని, వర్షం పడితే అటువైపు వెళ్ళే పరిస్థితి లేదని ఎఈ సాయిని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తయినా నేటికి పని ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా పట్టణంలో ఎన్నో వార్డుల్లో పనులు ప్రారంభం కాలేదని వార్డు ప్రజలు ప్రశ్ని స్తుంటే ఏం సమాధానం చెప్పాలన్నారు. పట్టణంలో పలు రోడ్ల పరిస్థితి చూసి ప్రజలు ఉమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పనులే ప్రారంభం కాకుండా కొత్త టెండర్‌లు అవసరమా అని ప్రశ్నించారు.  జనరల్‌ ఫండ్‌ 58 లక్షలు మాత్రమే ఉంటే 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఎలా పెడతారని ప్రశ్నించారు. కౌన్సిలర్‌ చిటికెల అచ్చిరాజు మాట్లాడుతూ టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉంది. వార్డుకు అవ సరమైన వసతులు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నాం. నెలల తర బడి రోడ్లకు ప్యాచ్‌ వర్క్‌ కూడా చేయించలేక పోతున్నామన్నారు. 


ఎవరేమన్నారంటే..

 కౌన్సిలర్‌ తులసిరెడ్డీ మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన కమిషనర్‌ బదిలీ అయ్యారని, తమపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయని, విచారణకు సిద్ధమన్నారు. పార్క్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు పెట్టారని కానీ ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీలు ముఖ్యమన్నారు. చైర్మన్‌, ఏఈలు ఆరు  కోట్లతో అభివృద్ధి చేశామని ప్రకటనలు ఇస్తున్నారని, ఏ వార్డులో అభివృద్ధి జరిగిందో చూపించాలని కోరారు.  కౌన్సిలర్‌ అయినాల రమణ మూర్తి మాట్లాడుతూ కాంట్రాక్టర్‌లు లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి సరిపెడుతున్నాని, మిగిలిన పనులు టెండర్‌లు వేసి గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్‌చైర్మన్‌ కంచర్ల వాసవీరత్నం, టీపీఎస్‌ బాబాజీరావు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీఎస్‌ బాబాజీ సమావేశానికి రావాల్సిందేనని పట్టుబట్టడంతో కమిషనర్‌ వెంటేశ్వరావు మాట్లాడుతూ టీపీఎస్‌ సెలవు పెట్టిన విషయం తన దృష్టిలో కూడా లేదని బదులిచ్చారు.తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  కౌన్సిలర్‌ కంచర్ల గీతాకుమారి మాట్లాడుతూ ఏడాది కాలంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్దనున్న ప్రభుత్వ పాఠశాలకు డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నా కనీసం ప్రతిపాదనల్లో కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యాలయం కౌన్సిల్‌ హాలుకు ఏసీ, ఫర్నీచర్‌, సౌండ్‌ సిస్టమ్‌కు 35 లక్షలు ప్రతిపాదనలు పెట్టారని ముందు రోడ్లపై గోతుల పూడ్చితే చాలని కోరారు.  కౌన్సిలర్‌ నేట్రు సుబ్బలక్ష్మీ మాట్లాడుతూ 18 నెలలుగా వార్డులో లక్ష రూపాయల పనులు కూడా జరగలేదన్నారు.పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదని మంచినీటి సమస్య నేటికి అలాగే ఉందన్నారు. వార్డులోకి ప్రజలు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిసిరిపాము లక్ష్మీ మాట్లాడుతూ వార్డుల్లో శానిటేషన్‌ దారుణంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. కౌన్సిలర్‌ ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ నీటి సంఘాలు, శానిటేషన్‌ సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు.  టీడీపీ కౌన్సిలర్‌ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ  విడుదలైన నిధులు, పూర్తయిన పనులు, ఆదాయం, ఖర్చుల గురించి  కౌన్సిల్‌ సభ్యులు తెలుసుకోవాలన్నారు. జనరల్‌ ఫండ్‌లో పూర్తిచేసిన పనుల బిల్లులు ఎందుకు పెండింగ్‌ ఉంటున్నాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌లతో సమావేశం ఏర్పాటు చేసి పట్టణాన్ని అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ కరుటూరి రమాదేవి మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా వార్డులోని 5 కరెంటు స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేకపోయామని, నూతన ప్రతిపాదనల్లో తన వార్డు ప్రస్తావన లేకపోవడంపై ప్రశ్నించారు.  జనసేన పార్టీ కౌన్సిలర్‌ వలవల తాతాజీ మాట్లాడుతూ ప్రతీ ప్రతి పాదనల్లో కంటితుడుపులా తన వార్డు ప్రస్తావన ఉంటుందని కానీ ఏ పనీ జరగడం లేదని వాపోయారు. డంపింగ్‌ యార్డు నుంచి వస్తున్న దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-06-28T05:18:22+05:30 IST