ఐక్యంగా ఉంటేనే భాషాభివృద్ధి

ABN , First Publish Date - 2022-04-24T13:44:36+05:30 IST

తెలుగు ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఐకమత్యంగా ఉంటేనే భాష, సంస్కృతులను కాపాడుకోగలరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

ఐక్యంగా ఉంటేనే భాషాభివృద్ధి

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ 

- ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య వార్షికోత్సవం


చెన్నై: తెలుగు ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఐకమత్యంగా ఉంటేనే భాష, సంస్కృతులను కాపాడుకోగలరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. చెన్నైలో శనివారంజరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 29వ వార్షికోత్సవావానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. చెన్నైఒకప్పుడు తెలుగు, తమిళుల రాజధాని నగరంగా ఉండేదని, ఈ నగరాన్ని నిర్మించినవారిలో తెలుగువారు కూడా కీలక పాత్రను పోషించారని, ఇప్పటీకి ఈ నగరాన్ని మనందరి ఊరుగానే భావించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం ఆవిర్భావం జరిగిందని, తొలుత కర్నూలు, ఆ తర్వాత హైదరాబాద్‌ నగరాలను రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ కొనసాగిందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రం కాస్తా తెలంగాణ, నవ్యాంధ్రగా విడిపోయాయని చెప్పారు. అమెరికా, అరబ్‌ సహా విదేశాల్లో తెలుగువారి చెమటకష్టం లేకుండా ఆ దేశాలు అభివృద్ధి చెందలేదని, ఇటీవల తాను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను సందర్శించినప్పుడు అక్కడి న్యాయమూర్తులు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే అక్కడ అధిక సంఖ్యలో ఉన్నారని, అందరూ కష్టజీవులని, క్రమశిక్షణ కలిగినవారని చెప్పినప్పుడు ఎంతో ఆనందించానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలోనూ, తమిళనాడులోనూ తెలుగుతోపాటు మరికొన్ని భాషలు నేర్చుకున్నవారు కూడా ఉన్నారని, వీరందరూ తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి భాష ఔన్నత్యాన్ని చాటితే సాహిత్య బంధం పటిష్ఠమవుతుందని, భాషల మధ్య సహకారం ఉంటే సాహిత్యం సుసంపన్నమవుతుందన్నారు. తమిళనాట నివసిస్తున్నవారు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఓపక్షం వైపు వ్యవహరించకూడదని, అదే సమయంలో హైకోర్టు న్యాయమూర్తుల్లో తెలుగువారిని కూడా నియమించాలన్న కోరికను పరిశీలించగలనని ఆయన సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తెలుగువారంతా తమ పిల్లలకు ఇంటిపట్టునే తెలుగు భాషను నేర్పించాలని, తెలుగులో ఉత్తరాలు రాయించాలని, తమ పూర్వీకుల స్వస్థలాలకు తీసుకెళ్ళి తాము పడిన కష్టాలను తెలుపాలని అప్పుడే తెలుగు భాష అభివృద్ధి చెందగలదని ఆయన పిలుపునిచ్చారు. 


ఘనంగా సమాఖ్య వేడుకలు

ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాత్‌ అధ్యక్షతన ఆ సంస్థ 29వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అరుణ గణేస్తుతితో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత కలైమామణి ఉమా మురళి కూచిపూడి నృత్యంతో సభికులను అలరింపజేశారు. ఆ తర్వాత  చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, విశిష్ట అతిథిగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్‌ భండారీ తదితర ప్రముఖులు జ్యోతిప్రజ్వలనం చేశారు. ఇందిరాదత్‌ స్వాగతోపన్యాసం చేస్తూ... రెండేళ్లుగా కరోనా కారణంగా సమాఖ్య తరపును ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించకపోయినా అంతర్జాలం ద్వారా తెలుగు ప్రజలకు సాంస్కృతి కార్యక్రమాలు, తెలుగుభాషా బోధన తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ వేడుకలకు చీఫ్‌ జస్టిస్‌ హాజరుకావటంతో ఇకపై సమాఖ్య కార్యక్రమాలు ఊపందుకుంటాయన్నారు. 1993లో సమాఖ్య ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ తెలుగు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తాము సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏవీ శివరామ ప్రసాద్‌ వార్షిక నివేదికను సమర్పించారు. జస్టిస్‌ ఎన్వీ రమణను ఇందిరాదత్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, సమాఖ్య ఉపాధ్యక్షురాలు కవితా దత్‌ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. గౌరవ అతిథి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్‌ భండారిని కూడా నిర్వాహకులు సత్కరించారు. 


స్మారక పురస్కారాలు...

ఈ వేడుకల్లో యార్లగడ్డ ప్రభావతి శంభూ ప్రసాద్‌ స్మారక పురస్కారం కింద ఆర్థిక సహాయాన్ని, స్పాస్టిక్‌ సొసైటీ దివ్యాంగులు కుమారి పునర్వికా, కుమారి స్వప్న కొండయ్యకు, గుమ్మడి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారాన్ని, ప్రముఖ తెలంగాణా జానపద గాయకుడు సి. నాగేశ్వరరావు (70)కు, ఇందిరా దత్‌ ఏర్పాటు చేసిన రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్‌, శ్రీమతి రాజా వాసిరెడ్డి స్మారక పురస్కారం కింద తిరువొత్తియూరు వి రామకృష్ణ హయ్యర్‌ సెకండరీ స్కూలు తెలుగు మీడియం పదో తరగతి విద్యార్థి నిమ్మకాయల శిరీషకు, వేమిరెడ్డి శ్యామలమ్మ పురస్కారం కింద తమిళనాడు ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి శ్వేతకు ఆర్థిక సహాయాన్ని  చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్‌ భండారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సమాఖ్య సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పీవీ సాయి వ్యవహరించారు. సమాఖ్య కార్యదర్శి డీఎల్‌ఎన్‌ రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ వేడుకల్లో తెలుగు ప్రముఖులు ఆస్కా ఆదిశేషయ్య, ఎంవీ నారాయణగుప్తా, ఆచార్య సీఎంకే రెడ్డి, బేతిరెడ్డి శ్రీనివాసన్‌, దేవరకొండ రాజు, సీనియర్‌ న్యాయవాది రవీంద్రనాథ్‌, గోటేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T13:44:36+05:30 IST