జాతరో.. జాతర..

ABN , First Publish Date - 2022-01-14T06:01:32+05:30 IST

జాతరో.. జాతర..

జాతరో.. జాతర..
ఆలయ ప్రాంగణంలో విడిది చేస్తున్న భక్తులు

ప్రారంభమైన ఐనవోలు, కొత్తకొండ జాతరలు

ఘనంగా మల్లికార్జునస్వామి, వీరభద్రుడికి పూజలు

మల్లన్నకు వైభవంగా ధ్వజారోహణం

వీరన్నకు శాస్ర్తోక్తంగా లక్ష బిల్వార్చన

రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివస్తున్న భక్తజనం

కొవిడ్‌ నిబంధనలతో దర్శించుకోవాలని అధికారుల సూచనలు


హనుమకొండ జిల్లాలోని ప్రధాన జాతరలైన ఐనవోలు మల్లికార్జునస్వామి, కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి రోజుల్లో జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆర్టీసీ, ప్రయివేటు వాహనాల్లో ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించి దైవదర్శనం ప్రశాంతంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. పోలీసులు బందోబస్తు విధుల్లో చేరారు. శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి రోజుల్లో ఐలోని, కొత్తకొండ జాతరలు ఉత్సాహంగా సాగనున్నాయి. 


ఐనవోలు, జనవరి 13: మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఒగ్గుపూజారులు మేలు కొలుపు చేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాతఃకాలంలో విఘ్నేశ్వరపూజ రుద్రాభిషేకం నూతన వస్త్రాలంకరణ చేశారు. ఉదయం గణపతి పూజ శైవశుద్ధి పుణ్యాహవచనం నిర్వహించారు. దేవతలను ఆలయంలోకి ఆహ్వానిస్తూ ఉత్సవ ప్రారంభ సూచికగా కాషాయ ధ్వజ పతాకాలను చేతపట్టి మంగళ వాయిద్యాలతో పరుష సూక్త మంత్ర పఠనంతో మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసిఆలయశిఖరం, క్షేత్రపాలకుడు అంజనేయస్వామి గుడిపై ఎగురవేశారు. అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహానివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ చేసిఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌, వేద పండితుడు గట్టు పురుషోత్తంశర్మ, ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్‌శర్మ, అర్చకులు, ధర్మకర్తలు, ఆలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.


తరలివస్తున్న భక్తజనం

ఐనవోలు మల్లికార్జునస్వామి సన్నిధికి భక్తుల రాక మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయ చుట్టూ 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మించగా, తూర్పు వైపున నిర్మించిన కమాన్‌ ద్వారా మాత్రమే భక్తులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. సాయంత్రం నుంచి సుదూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు విడిది చేస్తుండటంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. నృత్యమండపంలో భక్తులు విడిది చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తులరాక పెరుగుతూ ఉంది. గురువారం తెల్లవారేవరకు జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. వచ్చిన భక్తులు పట్నాలు, మొక్కులు తీర్చుకుంటూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఢమరుకం.. డోలు శబ్ధాలతో ఆలయం ప్రాంగణం మారుమోగుతోంది. భక్తుల వాహనాలతో ఐనవోలుకు వచ్చే అన్ని ప్రధానదారులు రద్దీ అయ్యాయి. ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వాహనాలను ప్రాంగణంలోకి రానివ్వకుండా బయటనే పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచనలు


పోలీసు ఔట్‌పోస్టు నుంచి పోలీసులు మైకుల ద్వారా కరోనాపై భక్తులను చైతన్యపరుస్తున్నారు. ప్రతీఒక్కరు మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలని పదే పదే సూచిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతగా కరోనాపై అప్రమత్తం చేస్తున్నారు.


నేడు భోగి పూజలు

భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శుక్రవారంఉదయంస్వామి వారికి ప్రాత:కాలం మేలుకొలుపుతో పూజలు ప్రారంభమవుతాయి. విఘ్నేశ్వరపూజ పుణ్యాహవచనాలు, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు- మంత్ర పుష్పాలు పూజలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కొవిడ్‌ నిబంధనల నడుమ స్వామిని దర్శించుకోవచ్చని ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు.


కోరమీసాల స్వామి చెంతకు..

భీమదేవరపల్లి, జనవరి 13: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 10న స్వామి వారి కల్యాణంతో ప్రారంభమయ్యాయి. 11, 12 తేదీల్లో నిత్యాహోమం, వాస్తుపూజ, నవగ్రహపూజ, సౌర్యయంత్ర స్థాపనలాంటి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. గురువారం రోజున స్వామి వారికి లక్ష బిల్వార్చనను నిర్వహించారు. 14న భోగి పండుగను పురస్కరించుకొని శ్రీచక్రార్చన, శ్రీచక్రోపనిషత్‌ పారాయణం, చండీ హోమం, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకన్న తెలిపారు. శుక్రవారం భోగి పండుగను పురస్కరించుకొని జాతర ప్రారంభమవుతుంది. 


ఈ జాతరకు కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి ప్రవేశం జరుగుతున్న సమయంలో వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వీరభద్రుడిని దర్శించుకొని నమస్కారం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు శత్రుపీడ, శరీరపీడ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయాన్ని విద్యుత్‌ కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల తాకిడిని తట్టుకునే విధంగా భారీ కేడ్లు నిర్మించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చలువపందిళ్లు వేశారు.


వెలసిన దుకాణాలు

జాతరలో రంగులరాట్నం, సర్కస్‌ సందడి చేస్తున్నాయి. ఇవి శుక్రవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. మిఠాయి దుకాణాలు, బొమ్మల దుకాణాలు, గాజులు, కుంకుమ, తదితర దుకాణాలు వెలిశాయి. హోటళ్లు, మెస్‌లు, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. జాతరలో భక్తుల కోసం మినీ వాటర్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. కొత్తకొండ జాతరలో 24గంటల పాటు విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు, ఏఈ రాములు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సామ్యేల్‌ తెలిపారు.





Updated Date - 2022-01-14T06:01:32+05:30 IST