ltrScrptTheme3

'జాతిరత్నాలు‌' మూవీ రివ్యూ

Mar 11 2021 @ 15:30PM

చిత్రం: 'జాతిరత్నాలు'

నటీనటులు: నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మజీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు 

క‌థ‌: అనుదీప్ కె వి,

సినిమాటోగ్ర‌ఫి: సిద్ధం మనోహర్‌,

సంగీతం: రాధన్, 

ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,

ఎడిట‌ర్‌: అభినవ్ రెడ్డి దండ,

బ్యానర్‌: స్వప్నా సినిమా,

నిర్మాత‌: నాగ్ అశ్విన్,

ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె వి


ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల తర్వాత స్వప్నాసినిమా‌ సంస్ధ ముచ్చటగా మూడో చిత్రంగా నిర్మించిందే 'జాతిరత్నాలు'. సహజంగానే స్వప్నా సంస్ధకి ప్రేక్షకులలో ఏర్పడిన నమ్మకంతో జాతిరత్నాలు సినిమా మీద చెప్పుకోదగ్గ అంచనాలే ఏర్పడతాయి. ఏర్పడ్డాయి కూడా. స్వప్నా సంస్థ నిర్మాణానికి మహానటి దర్శకుడు నాగఅశ్విన్‌ జాతిరత్నాలు కథ ఐడియా విని ఇటువంటి కథను సినిమాగా తీయాలని ముచ్చటపడ్డాడన్న సంగతి జాతిరత్నాలు చిత్రానికి మరింత హైప్‌ని ఇచ్చింది. వీటన్నింటినీ మించి బాహుబలి ది గ్రేట్‌ ప్రభాస్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండలు సినిమా క్యాంపైన్‌లో యాక్టివ్‌ పార్ట్‌ తీసుకోవడంతో జాతిరత్నాలు ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా..? అని ఎదురుచూపులు కూడా మొదలయ్యాయి. మరిన్ని అంచనాలకు, ఎదురుచూపులకు సరిపోయే రేంజ్‌లో జాతిరత్నాలు సినిమా ఉందా లేదా.. అనేది తెలుసుకుందామా..

కథ

జోగిపేట అనే ఓ గ్రామంలో శ్రీకాంత్‌ అనే కుర్రాడు, వాడి ఇద్దరు ప్రెండ్స్.. ముగ్గురూ కలిసి బలాదూర్‌గా ఊళ్ళో వాళ్ళవాళ్ళ తలిదండ్రులకి తలనొప్పి తెప్పించే పనులు చేస్తూ ఇష్టానికి తిరుగుతుంటారు. అందులో శ్రీకాంత్‌ ఓ శారీ, మేచింగ్‌ గాజుల దుకాణం నడుపుతుంటాడు. కానీ శ్రీకాంత్‌కి ఆ ఆడంగి గుర్తింపు ససేమిరా ఇష్టం లేక హైదరాబాద్‌ వచ్చి, మెడలో ట్యాగ్‌ వేసుకుని స్టయిల్‌గా అందరి యూత్‌లాగే ఉండాలన్నది తాపత్రయం. చివరికి రెండు నెలలలో హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించి సెటిల్‌ అవుతానని, సంపాదించలేకపోతే మళ్ళీ జోగిపేట తిరిగొచ్చి శారీ సెంటరే నడుపుకుంటానని ప్రామిస్‌ చేసి మరీ హైదరాబాద్ ప్రయాణమవుతాడు. శ్రీకాంత్‌తో పాటు వాడికిష్టం లేకపోయినా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ శ్రీకాంత్‌తో పాటు వెంటపడి మరీ హైదరాబాద్‌ వచ్చేస్తారు. తీరా వచ్చాక అసలైన తిప్పలు మొదలవుతాయి ముగ్గురికి. ఈ ప్రయాణంలోనే అనుకోకుండా ముగ్గురూ ఓ మర్డర్‌ కేసులో వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇరుక్కుంటారు. ఆ మర్డర్‌ కేసులోనుంచి ఎలా ముగ్గురూ బయటపడతారు అన్నదే కథా సారాంశం. 


విశ్లేషణ

దర్శకుడు అనుదీప్‌ జాతిరత్నాలు చిత్రాన్ని ఫుల్‌ లెంత్ ఎంటర్‌టైనర్‌గానే మలచాలనుకున్న సంకల్పం పూర్తిగా నెరవేరింది. ఏ క్షణంలోనూ పిసరంతైనా బోర్ లేకుండా ప్రతీ సీనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ మోతమోగిపోయింది. రాసుకున్న కథను అనుకున్న రీతిలో, కావాల్సినంత టెంపో మేయిన్‌టైన్ చేస్తూ, పకడ్బండీ స్క్రీన్‌ప్లేతో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆద్యంతం నడిపించగలిగాడు దర్శకుడు అనుదీప్‌. ఈ తరం ప్రేక్షకులకి, ముఖ్యంగా మాస్‌ అండ్‌ యూత్‌ని టార్గెట్‌ చేసి తీసిన ఈ జాతిరత్నాలు.. టార్గెట్‌ని పవర్‌ఫుల్‌గానే కొట్టింది. అనవసరమైన ఊకదంపుడు డైలాగులు గానీ, చేటభారతం సీన్లు గానీ లేకుండా థియేటర్‌లో ఉన్న ఆ రెండున్నరగంటల వ్యవధి ఇట్టే గడిచిపోయేలా, ఆడియన్స్‌కి రియల్ టైమ్ రిలీఫ్‌నిచ్చింది జాతిరత్నాలు సినిమాలో ప్రతీ సీను, ప్రతీ డైలాగ్‌. బాగా సుపరిచితమైన నటులతో పాటుగా కొత్త ముఖాలు కూడా అక్కడక్కడ కనిపించినా, వాళ్ళలో కూడా అనుదీప్ పరకాయప్రవేశం చేసి, వాళ్ళ నుంచి మెరిటెడ్‌ పెరఫారమెన్స్‌ని రాబట్టాడు. దాని వల్ల సినిమా మొదటనుంచి చివరిదాకా ఎంతో ఆహ్లాదకరంగా రక్తి కట్టింది. ప్రతీ క్యారెక్టరూ రాణించింది. మొత్తానికి సినిమా వినోదాల విందు భోజనంలా, సకుటుంబ సపరివార సమేతంగా చూసే లేదా చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

నటీనటులు…సాంకేతిక నిపుణులు

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలపైనే సినిమా అంతా రన్‌ అవుతుంది. ముగ్గురికి ముగ్గురూ పేరు పెట్టడానికి లేని విధంగా నటించారు. ఎవరి పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి, మోస్ట్ నేచురల్‌ పెరఫారమెన్స్‌తో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తారు అంటే అతిశయోక్తి కానేకాదు. ఇందులో మళ్ళీ నవీన్‌ పోలిశెట్టి మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌ కాబట్టి, సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించడానికి ఎక్కువ బాధ్యత నవీన్‌ భుజాల మీదే పడింది. ఆ బాధ్యతని నవీన్‌ చాలా ఈజీగా నిర్వర్తించాడు. నవీన్‌ బాడీ లాంగ్వేజ్‌ గానీ, ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, డైలాగ్‌ డెలివరీ గానీ.. వేటికవే జోగిపేట శ్రీకాంత్‌ క్యారెక్టర్‌కి బాగా సూటయ్యాయి. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వారివారి పాత్రల పరిధి మేరకు ఎక్కడా ఏ లోటూ రానీయలేదు. కొత్త అమ్మాయే అయినా ఫరియా సైతం తన షేర్‌ని బాగా క్యారీ చేసింది. మురళీశర్మ, బ్రహ్మాజీ తదితరులు గురించి ప్రత్యేకంగా వివరించనే అక్కర్లేదు. అనుభవజ్ఞులు కాబట్టి సులభంగా చేసేశారు.

మొత్తం మీద పాత్రలకు తగ్గ నటులు, నటులకు తగిన పాత్రలు.. జాతిరత్నాలు చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ప్రేక్షకులు ఎన్నిసార్లైనా చూసే విధంగా గమ్మత్తుగా ఉంది. మ్యూజిక్‌ విషయానికొస్తే చిట్టి పాట సినిమాకి ఓ లైఫ్‌. టెన్షన్‌ సీన్స్‌లో రీరికార్డింగ్‌.. కెమెరా వర్క్ రెండింటికీ రెండూ క్వాలిటీని ప్రదర్శించాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.