Thane court:బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు కోర్టు షోకాజ్ నోటీసు

Sep 28 2021 @ 11:53AM

ఆర్ఎస్ఎస్‌ను తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు...

ముంబై (మహారాష్ట్ర): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ను తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కు థానే కోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్‌ను తాలిబన్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ కు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువునష్టం దావా దాఖలు చేశారు. 76 ఏళ్ల జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై పరిహారంగా ఒక రూపాయి చెల్లించాలని కోరుతూ వివేక్ చంపనేర్కర్ దావా వేశారు. దీనిపై థానే నగర అదనపు చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్, జాయింట్ సివిల్ జడ్జి జావేద్ కు షోకాజ్ నోటీసులు పంపించారు. జావేద్ అక్తర్ నవంబరు 12వతేదీన కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశించారు.‘‘తాలిబన్లు ఇస్లామిక్ దేశాన్ని కోరుకుంటున్నారు. 

ఈ ప్రజలు హిందూ రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నారు’’ అని అక్తర్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి తరఫున హాజరైన అడ్వకేట్ ఆదిత్య మిశ్రా కోర్టులో సుదీర్ఘంగా వాదించారు. ప్రతివాది అయిన అక్తర్ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ షోలో పాల్గొన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మిశ్రా పేర్కొన్నారు.చంపానేర్కర్ తన పిటిషన్‌లో అక్తర్ చేసిన ప్రకటనలు సామాన్య ప్రజల దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్ ఇమేజ్‌ని కించపరచడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. జావేద్ అక్తర్ చేసిన నిరాధారమైన, తప్పుడు ఆరోపణల వల్ల తమ పరువుకు నష్టం జరిగిందని, అందువల్ల అతను ఒక రూపాయిని పరిహారంగా చెల్లించాలని చంపానేర్కర్ కోరారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.