రక్తాక్షరాల చరిత్రలోకి రాజ్యం చొరబాటు!

ABN , First Publish Date - 2022-09-17T07:20:57+05:30 IST

నియంతల కనుసన్నల్లో చరిత్ర రాయబడితే నికార్సయిన త్యాగాలు తెరమరుగవుతాయి. జనం తమ చరిత్రను తామే రాసుకుంటే అది నిప్పుకణికలా వెలుగుతూ తరతరాలకు నిజాన్ని నిగ్గు తేల్చి చూపిస్తూ ఉంటుంది.

రక్తాక్షరాల చరిత్రలోకి రాజ్యం చొరబాటు!

నియంతల కనుసన్నల్లో చరిత్ర రాయబడితే నికార్సయిన త్యాగాలు తెరమరుగవుతాయి. జనం తమ చరిత్రను తామే రాసుకుంటే అది నిప్పుకణికలా వెలుగుతూ తరతరాలకు నిజాన్ని నిగ్గు తేల్చి చూపిస్తూ ఉంటుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పర్యవసానంగా నిజాం నిరంకుశత్వం నుంచి ఈ ప్రాంతం నెహ్రూ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ సారథ్యంలో సెప్టెంబర్ 17, 1948న విముక్తమయింది.


సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్ర్య దినం. దానిని అధికారికంగా ఎందుకు నిర్వహించరు? తన స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోలేని ప్రజలు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వారు తెలంగాణ ప్రజలే అని ఉద్యమం రోజుల్లో గొంతు చించుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... ఏరుదాటాక తెప్ప తగలేశారు. సెప్టెంబర్ 17 ప్రస్తావన వచ్చినప్పుడల్లా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. ‘విమోచన కాదు, మన్ను కాదు...! అది జరిపితే ఏంది జరపకుంటే ఏంది...? అదొక పెద్ద ఎజెండానా? ఈ దేశం ఏమైనా మునిగిపోతదా...?’ అని కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడారు. అదే కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా సమైక్యతా ఉత్సవాలు అని కొత్త పల్లవి అందుకున్నారు. ఇంతకంటే అవకాశవాదం ఏముంటుంది!


ఇక మన చరిత్రలో త్యాగం సంగతి దేవుడెరుగు... స్థానమే లేని భారతీయ జనతా పార్టీ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ప్రవర్తిస్తోంది. సాయుధ రైతాంగ పోరాటం నాడు బీజేపీనే లేదు. దాని మాతృక సంస్థ అయిన జనసంఘ్ కూడా లేదు. బీజేపీ భావజాలం కలిగిన వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లేనే లేరు. అట్లాంటి బీజేపీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతాన్ని జోడించి, లబ్ధి పొందే కుయుక్తులు పన్నుతోంది. దానిని హిందూ –ముస్లిం పోరాటంగా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగడుతోంది. సాయుధ రైతాంగ పోరాటానికి తామే వారసులమన్నట్టు బీజేపీ–టీఆర్ఎస్‌లు జిత్తులమారి నక్క వేషాలు వేయడం నేటి విషాదం. నాటి పోరాటంలో అసువులు బాసిన అమరులకు జరుగుతోన్న అవమానం.


అసలు సాయుధ పోరాట మూలం ఏమిటి? అది ఎవరిపై ఎవరు చేసిన పోరాటం... నిజాం రాచరిక పాలనపై, ఆయన మద్దతుతో పేదలను పీడించిన దొరలు, దేశ్‌ముఖ్‌లపై, నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్ల దురాగతాలపై తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా చేసిన తిరుగుబాటే ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’. ఇది సబ్బండ వర్గాల ఐక్య పోరాటం. ప్రజలు మొదలు పెట్టిన ఈ పోరాటాన్ని స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, మరికొన్ని సంస్థలు ఎవరి పంథాలో వాళ్లు లీడ్ చేశారు. అంతిమంగా భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వ చరిత్రాత్మక నిర్ణయంతో... నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ సారథ్యంలో ‘ఆపరేషన్ పోలో’ ద్వారా తెలంగాణ ప్రాంతానికి నిజాం రాచరికం నుంచి విముక్తి లభించింది. ఈ ప్రాంతం భారత యూనియన్‌లో చేరి స్వాతంత్ర్య ఫలాలను అందుకుంది.


ఈ పోరాటంలో కుల, మత ప్రస్తావన లేదు. ఉన్నత నిమ్నవర్గ బేధం లేదు. రావి నారాయణ రెడ్డి లాంటి ఉద్దండులు, చాకలి ఐలమ్మ లాంటి తెగింపు కలిగిన వీర వనితలు ఈ పోరాటంలో చరిత్రాత్మక పాత్ర పోషించారు. రజాకార్ల దురాగతాలను ఎండగడుతూ సంపాదకీయాలు రాసినందుకు ‘ఇమ్రోజ్’ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ లాంటి మహనీయులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి ఆడబిడ్డలు తుపాకులు పట్టి జరిపిన పోరులో అడుగు వేశారు. మఖ్దూం లాంటి ప్రజాకవులు అజ్ఞాతం నుంచే ఉద్యమానికి ఊతమిచ్చారు. ఇది రాచరిక, భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ప్రతి పల్లె, ప్రతి గూడెం పోరుబాట పట్టిన ఉద్యమం. గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకుని రాచరికంపై పల్లె జనం ఎక్కుపెట్టిన విప్లవ పోరాటం. ఫలితం 1948 సెప్టెంబర్ 13 నుండి ఐదు రోజుల పాటు భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రాచరిక వ్యవస్థను కూల్చిన ఘన చరిత్ర. భారత సైన్యం దెబ్బకు నిజాం సెప్టెంబర్ 17 సాయంత్రం ఐదు గంటలకు తాను లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించారు. ఇదీ చరిత్ర. ఇందులో తెలంగాణ ప్రజల పోరాటం... నెహ్రూ సారథ్యంలోని భారత ప్రభుత్వ చరిత్రాత్మక పాత్ర ఇమిడి ఉన్నాయి.


చరిత్ర చెప్పిన సత్యం ఇలా ఉంటే... కేసీఆర్ మాత్రం తన పార్టీ స్థాపించిన 2001 తర్వాత చరిత్ర మాత్రమే తెలంగాణ చరిత్రగా చరిత్రలో నిలిచిపోవాలని... అందులోనూ టీఆర్ఎస్ చరిత్రే తెలంగాణ చరిత్రగా మిగలాలని కుట్ర చేశారు. టీఆర్ఎస్ చరిత్రే తెలంగాణ చరిత్రగా భవిష్యత్ తరాల మెదళ్లకు ఎక్కించే కుతంత్రానికి తెగబడ్డారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, 1969 ఉద్యమం కానీ, ఆ తర్వాత తెరలు తెరలుగా తెలంగాణ కోసం జరిగిన పోరాటాలను తెరమరుగు చేయాలని భావించారు. తాను చేసిందే పోరాటం, తన కుటుంబ చరిత్రే తెలంగాణ చరిత్ర, తన పార్టీ జెండానే తెలంగాణ జెండా, దొరసానిని స్ఫురించేలా తాను రూపొందించిన విగ్రహమే తెలంగాణ తల్లిగా సమాజంపై రుద్దే కుయత్నం చేశారు.

తెలంగాణ తల్లి పేరుతో ఆడంబరంగా ఉన్న దొరసాని విగ్రహాన్ని తెర మీదకు తేవడం, ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి సంకేతంగా గోడలపై రాసుకున్న TG రాతలను అధికారంలోకి వచ్చిన తర్వాత TSగా మార్చేయడం, తెలంగాణ కవుల రచనలకు గౌరవం ఇవ్వకపోవడం, టీఆర్ఎస్ పార్టీ జెండానే తెలంగాణ జెండాగా భ్రమింపజేయడం వీటిని తేలిగ్గా తీసుకుంటే అత్యంత ప్రమాదం. ఇవన్నీ కేసీఆర్ యథాలాపంగా చేసినవి కాదు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల విధ్వంసం ఇది. వాటి స్థానంలో తన కుటుంబ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిష్ఠించే కుట్ర ఇది.


అందుకే వజ్రోత్సవాల వేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనుల పక్షాన మన చరిత్రను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ మట్టి చరిత్ర, ఇక్కడ జరిగిన పోరాటాలు, ఇక్కడ ప్రజల చైతన్యం, ప్రశ్నించే తత్వం, ప్రేమచూపే నైజం కలగలిసిన చరిత్రను శాశ్వతం చేసే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ తల్లికి ఆడంబరం లేదు. తను కష్టజీవి. ఊరి సంస్కృతికి ప్రతి రూపం. తెలంగాణ తల్లి దొర గడీలో దొరసాని కాదు... ఒంటి నిండా వజ్రవైడూర్యాలతో పొదిగిన నగలు, నెత్తిన కిరీటాలు ధరించి రాచరికం ప్రదర్శించడం మన తల్లి నైజం కాదు. సకల జనులు ఈమె మా తల్లి అని భావించే రూపం మాత్రమే తెలంగాణ తల్లి స్థానానికి అర్హురాలు. ఆ దిశగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ రూపొందించింది. ఇక తెలంగాణ అంటే పోరాటం, పేదవర్గాల సమాహారం, సారవంతమైన భూముల మణిహారం... ఈ ఎజెండాను ప్రతిబింబించేదే మన జెండా. ఆ రకమైన తెలంగాణ జాతి జెండాను ఆవిష్కరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ గోడ చూసినా TG అని రాసిన స్లోగన్లే కనిపించేవి... ఉద్యమకారుల ఒంటిపై TG పేరుతో పచ్చబొట్లు ఉండేవి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తన పార్టీ పేరుకు సమీపంగా, స్ఫురించేలా TGని కాస్తా TSగా మార్చేశారు కేసీఆర్. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం...’ అని ఉద్యమ సమయంలో ప్రతి నోటా ప్రతిధ్వనించిన మన కవి అందెశ్రీ రాసిన గేయం ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదెందుకు? రాష్ట్ర అధికార గీతం కావాల్సిన ఆ గేయం ఇప్పుడు ఏ చరిత్ర పుటల్లో నలిగిపోతోంది? మన సంస్కృతిని, తెలంగాణ ఘనతను చాటిన ఆ గేయం ఎందుకు గుర్తింపునకు నోచుకోవడం లేదు!? ఇదే కేసీఆర్ చేస్తోన్న తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం. దుర్మార్గం.


తెలంగాణ చరిత్రను కేసీఆర్ విధ్వంసం చేస్తోన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కీలక పాత్ర పోషించాల్సిన అనివార్యత వచ్చింది. అందుకే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పోరాటం, మన ఘన వారసత్వాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించేలా తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ జెండా, తెలంగాణ అస్తిత్వ సంక్షిప్త రూపం TGలను తిరిగి తెస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. వజ్రోత్సవాల సందర్భగా వీటన్నింటినీ జాతికి అంకితం చేస్తున్నాం. ఇది మన చరిత్రను మనం కాపాడుకోవడం. తెలంగాణ సకల జనులు సహృదయాలతో ఆమోదించి, ఆశీర్వదించాలని కోరుతున్నాను.




Updated Date - 2022-09-17T07:20:57+05:30 IST