Visit visa: సౌదీ వార్నింగ్.. అవన్నీ అసత్య ప్రచారాలేనంటూ..!

ABN , First Publish Date - 2022-03-23T16:01:15+05:30 IST

విజిట్ వీసాలను రెసిడెన్సీ పర్మిట్లుగా(ఇఖామా) మార్చుకునేందుకు అనుమతి లేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) స్పష్టం చేసింది.

Visit visa: సౌదీ వార్నింగ్.. అవన్నీ అసత్య ప్రచారాలేనంటూ..!

రియాద్: విజిట్ వీసాలను రెసిడెన్సీ పర్మిట్లుగా(ఇఖామా) మార్చుకునేందుకు అనుమతి లేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) స్పష్టం చేసింది. విజిట్ వీసాను కొంత రుసుముతో రెసిడెన్సీ పర్మిట్‌గా మార్చుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా జవాజత్ తోసిపుచ్చింది. అలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది. అవన్నీ నిరాధరమైన అసత్య ప్రచారాలని కొట్టిపారేసింది. “సౌదీ అరేబియాలోని సమర్థ అధికారులు జారీ చేసిన సూచనలు విజిట్ వీసాను ఇఖామాగా మార్చడానికి అనుమతించవు. ఒకవేళ సందర్శన వీసాలకు సంబంధించి కొత్త నిర్ణయం లేదా సూచనలు జారీ అయితే, అది అధికారిక మార్గాల ద్వారా వెంటనే ప్రకటించబడుతుంది" అని జవాజత్ వెల్లడించింది. అలాగే విజిట్ వీసాలపై సౌదీకి వచ్చే వారికి కింగ్‌డమ్‌లో పని చేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 


ఇదిలాఉంటే.. దేశంలో అమలులో ఉన్న నియమ నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు ప్రచారాల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మోసాలకు పాల్పడే కేటుగాళ్లను సైఫ్ అల్ హకామి అనే లీగల్ కన్సల్టెంట్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గతేడాది ఏప్రిల్‌లో సౌదీ మంత్రి మండలి ఆర్థిక మోసాలకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ చట్ట ప్రకారం దోషిగా తేలిన మోసగాళ్లకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా 5 మిలియన్ల సౌదీ రియాళ్ల జరిమానా లేదా రెండు విధించడం జరుగుతుంది. ఇక చట్టంలో పేర్కొన్న ఏదైనా నేరాలకు పాల్పడేలా మరొకరిని ప్రేరేపించినా, సహాయం చేసినా శిక్షించేందుకు దీనిలో నిబంధనలు ఉన్నాయని అల్ హకామీ పేర్కొన్నారు. దోషికి విధించే జరిమానా, జైలు శిక్షలే ఇలా చేసేవారికి కూడా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 

Updated Date - 2022-03-23T16:01:15+05:30 IST