జయహో.. రామప్ప!

ABN , First Publish Date - 2021-07-26T05:58:52+05:30 IST

నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మాణం.. సూది బెజ్జం సందుతో ఉండే అతి సూక్ష్మమైన శిల్పాలు.. హొయలొలికే సాలబంజికల స్వాగతం.. విభిన్నరూపాలతో ఉండే గజరాజుల గంభీరం.. వివిధ భంగిమలతో చెక్కబడిన మధనిక, నాగిణి శిల్పాలు.. ఇసుక పునాదితో నిర్మించిన భారీ కట్టడం.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అత్యంత సుందరమైన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. ఆదివారం చైనా దేశపు రాజధాని బీజింగ్‌లో యునెస్కో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిదేళ్లుగా రామప్పకు హెరిటేజ్‌ గుర్తింపు కోసం కాకతీయ హెరిటేజ్‌ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రామప్పకు వారసత్వ సంపద హోదా లభించడంతో తెలుగు ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

జయహో.. రామప్ప!

ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం
చారిత్రక కట్టడానికి యునె స్కో గుర్తింపు
ఫలించిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కృషి
17 సభ్య దేశాల మద్దతుతో గుర్తింపు హోదా
హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా ప్రజలు


నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మాణం.. సూది బెజ్జం సందుతో  ఉండే అతి సూక్ష్మమైన శిల్పాలు.. హొయలొలికే సాలబంజికల స్వాగతం.. విభిన్నరూపాలతో ఉండే గజరాజుల గంభీరం.. వివిధ భంగిమలతో చెక్కబడిన మధనిక, నాగిణి శిల్పాలు.. ఇసుక పునాదితో నిర్మించిన భారీ కట్టడం.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అత్యంత సుందరమైన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. ఆదివారం చైనా దేశపు రాజధాని బీజింగ్‌లో యునెస్కో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిదేళ్లుగా రామప్పకు హెరిటేజ్‌ గుర్తింపు కోసం కాకతీయ హెరిటేజ్‌ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రామప్పకు వారసత్వ సంపద హోదా లభించడంతో తెలుగు ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించింది. దీని కోసం నిట్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు నేతృత్వంలో కాకతీయ హెరిటేజ్‌ కమిటీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. 2012లో మొదటిసారిగా హెరిటేజ్‌ గుర్తింపు కోసం యునెస్కోకు రామప్ప ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత 2013లో మరోసారి రామప్ప ప్రతిపాదనలు యునెస్కోకు వెళ్లాయి. ఈ రెండు పర్యాయాలు కూడా రామప్పకు యునెస్కో గుర్తింపు లభించలేదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడోసారి 2014లో హెరిటేజ్‌ గుర్తింపు ఇవ్వాలని పకడ్బందీగా నివేదికలతో ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈసారి గుర్తింపు రాకున్నప్పటికీ యునెస్కో మాత్రం రామప్ప ప్రతిపాదనలు పరిశీలించింది. కానీ, గుజరాత్‌లోని రాణి కి వావ్‌కు గుర్తింపు లభించింది. 2015లోనూ నిరాశే మిగిలింది. 2018లో కూడా హెరిటేజ్‌ రామప్ప కోసం ప్రతిపాదనలు పంపించారు. రామప్పకు పక్కాగా హోదా వస్తుందని భావించినప్పటికీ చివరి నిమిషం లో రాజస్థాన్‌ రాజధాని, చారిత్మక కట్టడమె ౖన జైపూర్‌కు వరల్డ్‌ హెరిటేజ్‌ సిటీగా గుర్తింపు లభించిం ది. ఇక 2019 ఫిబ్రవరిలో మరోసారి కాకతీ య హెరిటేజ్‌ ట్రస్టు ప్రతిపాదనలను పం పించారు. రామప్ప ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపు పొందేందుకు కావాల్సిన నివేదికను కేంద్రానికి పంపించారు. ఈ సారి దేశం నుంచి కేవలం రామప్ప ఒక్కటే నామినేషన్‌ యునెస్కోకు వెళ్లడంతో పాటు అదే డిసెంబరు నెలలో యునెస్కో ప్రతినిధి బృందం రామప్పను పరిశీలించారు. అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ముగ్ధులయ్యారు. 2020లో ఎంపిక చేయాల్సిన వారస త్వ కట్టడాలను కరోనాతో వాయిదా వేశారు. 2021 జూ లై 16నుంచి సమావేశం జరుగుతున్నాయి. ఈ సమావేశంలోనే రామప్పకు హెరిటేజ్‌ గుర్తింపు ఇచ్చారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ప్రజలు రా మప్పకు హెరిటేజ్‌ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త కళ
రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా లభించడంతో కొత్త రూపు దాల్చనుంది. 2020 సంవత్సరానికి గాను చారిత్రాత్మక కట్టడంగా యునెస్కో గుర్తించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు రామప్ప ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుం ది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రామ ప్ప ఆలయ అభివృద్ధికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శిథిలమవుతున్న రామప్ప ఆలయంతో పాటు కాటేజీల ని ర్మాణం, రామప్ప సరస్సులో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. దీంతోపాటు స్థానికంగా ఉన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి పదవిలో ఉండటం రామప్ప అభివృద్ధికి మరింత దోహదపడే అవకాశం ఉంది. యునెస్కో గుర్తింపు లభించిన రామప్పకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించనున్నారు.

అద్భుత శిల్ప సంపద  
ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుత కట్టడాల్లో రామప్ప ఒకటి. క్రీ.శ. 1213 సంవత్సరంలో గణపతి దేవుడి కాలానికి చెందిన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించారు. మధ్యయుగానికి చెందిన ఈ ఆలయంలో ఉన్న శివుడి పేరుమీద కాకుండా ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప పేరుమీదనే ఆలయం ఉండటం ఇక్కడ విశేషం. శిల్పి పేరుతోపాటు ఆలయంలో ఉన్న శివుడి పేరు కలిపి రామలింగేశ్వరుడిగా శివుడిని కొలవడం మరో విశేషం. రాముడు, శివుడు కలిసిన ప్రధాన దైవంగా ఈ ఆలయం కొనసాగుతోంది. ఇక గర్భాలయంలో ఎత్తై న పీఠంపై నల్లని నునుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం రామప్ప ఆలయంలో దర్శనమిస్తోంది. మహామండపం మధ్యభాగంలో ఉన్న కుంఢ్యస్తంభాలు, వాటిపై గల దూలాలపై ఉన్న రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో నిండిన అతి రమణీయమైన శిల్పాలు ఆకర్షిస్తాయి. వివిధ భంగిమలతో స్వరాంగ సుందరంగా చెక్కబడిన మధనిక, నాగిణి శిల్పాలు కాకతీయుల శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. రాయిని మీటితో రామప్పలో స్వరాగాలు పలుకుతాయి. ఇక్కడ రాళ్లలో రాగాలు పలికే త్వత్తం ఉంది. ఇక నంది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయం. ఏ దిక్కు నుంచి నందిని చూసిన అది మన వైపే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే 17వ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపం వల్ల కొద్దిగా ఆలయం శిథిలమైంది. అంతేకాకుండా పలుమార్లు జరిగిన దండయాత్రల వల్ల కొంత నష్టం జరిగింది. అయినప్పటికీ 800 ఏళ్లకుపైగా చెక్కుచెదరకుండా రామప్ప ఆలయం నిలబడుతోంది.

ప్రత్యేకతలివే..

రామప్ప ఆలయం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మాణం జరిగింది. రామప్ప గోపురంపై ఉన్న ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతాయి. ఆ కాలంలోనే ఏనుగు పేడ, తవుడు, కరక్కాయి, చెట్టజిగురు తదితర వాటి మిశ్రమంతో తయారు చేసిన ఇటుకలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆలయ గోపురాన్ని నిలబెడుతున్నాయి. ఇక ఆలయంలో మరొక ప్రత్యేకత సాండ్‌బ్యాగ్స్‌ నిర్మాణం.. రామప్ప ఆలయం కట్టడం కింద ఇసుక పునాదులు ఉన్నాయి. ఇసుకను పునాదిగా ఏర్పాటు చేసి ఆలయం నిర్మించడం ఇప్పటి టెక్నాలజీకి కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతోపాటు ఆలయంలో ఉన్న మండపం నిర్మాణం అద్భుతం. సూది బెజ్జం సందుతో  అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరాయి. అంతేకాదు ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుతో సంబంధం లేకుండా భిన్నంగా ఉంటాయి. ఇక శివుడు ఎదురుగా ఉన్న నంది శివుడి అజ్జ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెవిని లింగం వైపుకు పెట్టి లేవడానికి తయారుగా ఉన్నట్టుగా నందిని మలిచాడు శిల్పి.

కేసీఆర్‌ కృషితోనే..
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ టౌన్‌, జూలై 25: రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావ డం హర్షణీయమని, ఈ ఘనత సాధించడం వెనుక సీఎం కేసీఆర్‌ కృషి ఎంతగానో ఉందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. హన్మకొండలోని తన క్యాం పు కార్యాలయంలో ఆదివారం విలేకరుల స మావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం మన కాకతీయ వారసత్వ సంపదకు గొప్ప కీర్తిప్రతిష్టలు వచ్చినట్లయిందని అన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనన్నారు.
చైనాలో జరిగిన హెరిటేజ్‌ పోటీల్లో ప్రపంచంలోని 167 దేశాలు పోటీ పడగా, రామప్పకు రష్యాతో సహా 17దేశాలు మద్దతు తెలిపాయని వివరించారు. ఇండియా నుంచి గుజరాత్‌కు చెందిన దోలవీరతో పాటు తెలంగాణ నుంచి రామప్ప దేవాలయాలు పోటీ పడ్డాయన్నారు. ఇందులో రామప్పను ఎంపిక చేశారని తెలిపారు. యునెస్కో గుర్తింపు సాధించడానికి సీఎం కేసీఆర్‌.. నిపుణులతో చర్చించి ప్రతిపాదనలు పంపించారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇటీవల తాము ఢిల్లీ వెళ్లి వినతిపత్రం అందించామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాల అలసత్వంతో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు సాధ్యపడలేదన్నారు. సమైక్య రాష్ట్రంలో మన చారిత్రక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ గుర్తింపు రావడం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు గర్వకారణమని, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప నిలవనుందన్నారు.

వేయిస్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్‌ టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు మంత్రి వివరించారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి అనేక జాగ్రత్తలు తీసుకుందని, ఢిల్లీ స్థాయిలో పూర్తి సహకారం లభించిందన్నారు. ఈఘనత సాధించడానికి సహకరించిన వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, నిపుణులకు ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నేత జన్ను జకార్య పాల్గొన్నారు.













Updated Date - 2021-07-26T05:58:52+05:30 IST