Chief Minister: ఆ ముగ్గురి విచారణ!

ABN , First Publish Date - 2022-08-30T14:11:54+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సిఫార్సుల అమలుకు

Chief Minister: ఆ ముగ్గురి విచారణ!

- జయ మృతి వ్యవహారంలో శశికళ, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, మాజీ సీఎస్‏పై విచారణకు

- న్యాయనిపుణులతో సంప్రదింపులు  

- మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం


చెన్నై, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సిఫార్సుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఆ కమిషన్‌ చేసిన సిఫారసుల మేరకు జయ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఆమె తుదిశ్వాస విడిచేవరకు క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె సన్నిహితురాలు వీకే శశికళ, నాటి ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, జయ వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌లను విచారణ జరపడంపై న్యాయనిపుణులను సంప్రదించాలని నిర్ణయించింది. ఆ తరువాతే జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ నివేదికను శాసనసభ ముందుంచాలని నిర్ణయం తీసుకుంది. 

సచివాలయంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్‌ మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఏవీ వేలు, తంగం తెన్నరసు, సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు(Subramaniam, PK Shekharbabu) తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ఇటీవల అందించిన నివేదికపైనే చర్చించారు. అంతేగాక సంచలనం రేపిన తూత్తుకుడి కాల్పులకు సంబంధించి చెందిన 17 మంది పోలీసు ఉన్నతాధికారులు, నాటి జిల్లా కలెక్టర్‌ సహా నలుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ జస్టిస్‌ అరుణా జగదీశన్‌ చేసిన సిఫార్సులను కూడా మంత్రివర్గం చర్చించింది. ఆ మేరకు చర్యలకు సంబంధించి సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదే విధంగా పరందూరులో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు స్థలసేకరణకు ఎదురవుతున్న సమస్యలు, ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం అమలుపైనా మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు త్వరలో ప్రారంభం కానుండటంతో వరద ముందస్తు చర్యలు చేపట్టడంపై కూడా మంత్రివర్గసభ్యులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధానంగా వాననీటి కాల్వలు, మురుగుకాల్వల మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Updated Date - 2022-08-30T14:11:54+05:30 IST