జయలక్ష్మి సొసైటీ కేసు సీబీసీఐడీకి

ABN , First Publish Date - 2022-07-01T06:33:32+05:30 IST

కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మదుపరుల నెత్తిన శఠగోపం పెట్టి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి కోఆపరేటివ్‌ సొసైటీ కేసును ఎట్టకేలకు పోలీసులు సీబీసీఐడీకి అప్పగించారు.

జయలక్ష్మి సొసైటీ కేసు సీబీసీఐడీకి
అధికారులకు రికార్డులు అప్పగిస్తున్న స్థానిక పోలీసు అధికారులు

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 30: కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మదుపరుల నెత్తిన శఠగోపం పెట్టి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి కోఆపరేటివ్‌ సొసైటీ కేసును ఎట్టకేలకు పోలీసులు సీబీసీఐడీకి అప్పగించారు. సొసైటీ ముసుగులోజరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బాఽధితుల ఆందోళనల నడుమ ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేయడంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా వారి డిమాండ్‌ మేరకు కేసును బదలాయించారు. కాకినాడ రూరల్‌ సర్పవరం జంక్షన్‌లో సెంట్రల్‌ కార్యాలయంగా చేసుకుని 1999లో ది. జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ లిమిటెడ్‌ 95 మ్యాక్స్‌ చట్టం కింద ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయవాడ జిల్లాలో సుమారు 29 బ్రాంచీలను ఏర్పాటు చేసిన సొసైటీ నిర్వాహకులు 19,971 మంది నుంచి సుమారు రూ. 520 కోట్ల పైబడి  డిపాజిట్లు సేకరించారు. సొసైటీ ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, ఆర్‌బీ విశాలక్ష్మితో పాటు 11 మంది డైరెక్టర్లు డిపాజిట్‌దారుల నెత్తిన శఠగోపం పెట్టి ఏప్రిల్‌ 6న బోర్డు తిప్పేసి పరారయ్యారు. సొసైటీలో అక్రమాలపై జిల్లా సహకార శాఖ అధికారుల ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ రిజిస్ర్టార్లతో విచారణకు ఆదేశించించడంతో ఏప్రిల్‌ 18 నుంచి విచారణ ప్రారంభించారు. పలు బ్రాంచీల్లో విచారణ చేపట్టి నేటికి 84 రోజులు పూర్తయినా సంస్థ ఆర్థిక లావాదేవీలు, రుణాలు, రికార్డుల పరిశీలన కొనసాగుతోంది.  బాధితుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు జయలక్ష్మి సొసైటీల్లో నిధుల స్వాహాకు పాల్పడిన కేసులో నిందితులు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌తో పాటు డైరెక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, దర్యాప్తు అధికారిగా కాకినాడ డీఎస్పీ భీమారావును నియమించారు. సొసైటీ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సుమారు రెండు నెలలు దాటినా జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు, డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్న దాఖలాలు కనిపించకపోవడం పట్ల బాఽధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ అక్రమాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఉదాశీనవైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండగా నిందితులను అరెస్ట్‌ చేయడంలో మీనమేషాలు లెక్కించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసును సీబీసీఐడీకి అప్పగించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో  జయలక్ష్మి సొసైటీ కేసును పోలీసులు విశాఖలోని సీబీసీఐడీకి కాకినాడ పోలీసులు బదలాయించారు. ఈ మేరకు గురువారం విచారణాధికారి, డీఎస్పీ వి.భీమారావు ఆదేశాల మేరకు సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌లు సొసైటీకి చెందిన కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేసే రికార్డులను తీసుకెళ్లి సీఐడీ అధికారులకు అప్పగించారు. కోట్లాది డిపాజిట్లు స్వాహా చేసిన సొసైటీ నిర్వాహకులను ఇప్పటికైనా సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-01T06:33:32+05:30 IST