తాండూరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా జయప్రసాద్‌..!

ABN , First Publish Date - 2021-05-07T05:50:34+05:30 IST

తాండూరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా జయప్రసాద్‌..!

తాండూరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా జయప్రసాద్‌..!
తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

తాండూరు: తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా వైద్యవిధాన పరిషత్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి డాక్టర్‌ మల్లిఖార్జున్‌ తప్పుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల మందలింపులు, నిర్వహణ బాధ్యతలు పెరిగిపోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాలని ఇదివరకే ఆయన రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌కు లేఖ రాశారు. కరోనా పాజిటివ్‌ కేసుల విజృంభణ తరుణంలో తక్షణమే బాధ్యతల నుంచి తప్పించలేమని రాజీనామాను పెండింగ్‌లో పెట్టారు. కాగా రాజీనామా ఆమోదానికి డా.మల్లిఖార్జున్‌ ఒత్తిడి పెంచడంతో ఆయన స్థానంలో ఆసుపత్రి సీనియర్‌ వైద్యులు డా.జయప్రసాద్‌కు ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డీసీహెచ్‌వో బాధ్యతలు కట్టబెడుతూ వైద్యవిధాన పరిషత్‌ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్‌ జయప్రసాద్‌ తన తండ్రి కరోనా పాజిటివ్‌తో హైద్రాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున తాను బాధ్యతలు చేపట్టలేనని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇంతకుముందు తాండూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన మర్పల్లి ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ ఆనంద్‌ తిరిగి బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో చిన్న తప్పిదం చూపి సూపరింటెండెంట్‌ బాధ్యతల నుంచి తప్పించారనే అసహనంతో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరో వ్యక్తిని నియమించేవరకు కొనసాగాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌.మల్లిఖార్జున్‌ను కమిషనర్‌ కోరినట్లు సమాచారం. డాక్టర్‌.మల్లిఖార్జున్‌ త్వరలో పదోన్నతిపై అసిస్టెంట్‌ కమిషనర్‌ కావాల్సి ఉంది.

Updated Date - 2021-05-07T05:50:34+05:30 IST