జయేందర్‌నాయక్‌ అంత్యక్రియలు పూర్తి

Jan 15 2022 @ 01:22AM

మౌనంగా రోదిస్తూ ఖననం చేసిన తండ్రి

శూన్యపహాడ్‌లో విషాదఛాయలు

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

పాలకవీడు, జనవరి 14 : మౌనంగా రోదిస్తూ ఒక్కగానొక్క కుమారుడికి ఆ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇద్దరు చెల్లెళ్లు, తనకు తోడుగా ఉంటాడనుకున్న కుమారుడు మతిస్థిమితం తప్పినా; ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటాడనుకున్నాడు. ఇంతలో ఈ నెల 10న తల ఒకచోట, మూడు రోజులకు 13వ తేదీన మరోచోట కుళ్లిన మొండెం లభించడంతో ఆ రోజు ఆ తండ్రి గొంతు మూగబోయింది. కళ్లారా చివరి చూపు చూద్దామనుకున్న కుటుంబసభ్యులకు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరబలి ఘటనలో జయేందర్‌నాయక్‌ కుటుంబ సభ్యుల పరిస్థితి. నల్లగొండ జిల్లాలో నరబలికి గురైన జయేందర్‌నాయక్‌ అంత్యక్రియలు శుక్రవారం రాత్రి స్వగ్రామం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్‌లో పూర్తయ్యాయి. మొండెం కుళ్లి దుర్వాసన వస్తుండటంతో హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామంలోని పొలాన్ని నేరుగా తరలించారు. అక్కడ  జయేందర్‌నాయక్‌ మృతదేహాన్ని తండ్రి శంకర్‌నాయక్‌ ఖననం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాలుగు రోజులుగా ఆందోళనలో ఉన్న గ్రామంలో జయేందర్‌నాయక్‌ మృతదేహం రాకతో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కఠినంగా శిక్షించాలి: అశోక్‌నాయక్‌, జయేందర్‌నాయక్‌ బాబాయి 

మతిస్థిమితం సరిగా లేని జయేందర్‌నాయక్‌ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జయేందర్‌నాయక్‌ బాబాయి అశోక్‌నాయక్‌ కోరారు. పదో తరగతి వరకు జయేందర్‌ ఎలాంటి ఆర్భాటం లేకుండా చదవివాడని; ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు.  ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొన్ని రోజుల కిందట వెళ్లిపోయాడని అన్నారు. ఈ మధ్య వనస్థలిపురంలో ఉన్నట్లు సమాచారం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి పలకరించి వచ్చారని తెలిపారు. హత్యకు బాధ్యులను శిక్షించాలని ఆయన కోరారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.