పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి.. సంచలనం రేపుతున్న పోస్ట్‌మార్టం నివేదిక..!

ABN , First Publish Date - 2022-07-17T01:30:09+05:30 IST

ఓహాయోలో(అమెరికా) పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు జేల్యాండ్ వాకర్ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి.. సంచలనం రేపుతున్న పోస్ట్‌మార్టం నివేదిక..!

ఎన్నారై డెస్క్: ఓహాయోలో(అమెరికా) పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు జేల్యాండ్ వాకర్(Jayland walker) ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన జేల్యాండ్ వాకర్.. కారులో తప్పించుకుని పారిపోయే క్రమంలో తూటాలకు నేలకొరిగాడు. గత నెల 27న ఆక్రాన్ నగరంలో ఈ ఘటన జరిగింది. కాగా.. మృతుడి శరీరంపై 46 బుల్లెట్ గాయాలు ఉన్నట్టు తాజాగా పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడడంతో స్థానికంగా కలకలానికి దారితీసింది. అతడి ముఖం, ఊపిరితిత్తులు, కాలేయం, ఎడవవైపున్న కిడ్నీ, పేగులు, పలు ఎముకలకు గాయాలయ్యాయని తేలింది. కాల్పుల సమయంలో వాకర్ వద్ద ఎటువంటి ఆయుధాలు లేవన్న వార్తలు ఒకవైపు.. అతడు ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదన్న టాక్సీకాలజీ రిపోర్టు మరోవైపు.. వెరసి ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఇక.. ఘటనా స్థలంలో పోలీసులు ఓ గన్నును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కాల్పుల సమయంలో మాత్రం అతడు నిరాయుధుడిగానే ఉన్నాడు. 


మరోవైపు.. పోలీసుల యూనీఫార్మ్‌లకు అమర్చిన కెమెరాలో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. జేల్యాండ్ ప్రయాణిస్తున్న కారులోంచి కాల్పులు జరిగినట్టు కెమెరాలో రికార్డైంది. అయితే..అతడే ఈ కాల్పులు జరిపాడా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. పోలీసులు జేల్యాండ్‌ను వెంబడిస్తుండగా అతడు ఓ ప్రాంతంలో కారు నిలిపి డ్రైవర్ పక్క సీటులోంచి కిందకు దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. కాగా.. ఈ ఘటనతో సంబంధమున్న పోలీసు అధికారులందరూ శాఖాపరమైన సెలవులపై వెళ్లారు. మరోవైపు.. నిరాయుధుడైన తమ కుమారుడిపై తూటాల వర్షం కురిసినట్టు పోస్ట్‌మార్టంలో తేలడంతో జేల్యాండ్ కుటుంబం షాక్‌కు గురైయింది. ఆ సమయంలో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలంటూ ప్రభుత్వాన్ని జేల్యాండ్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-17T01:30:09+05:30 IST