ధాన్యం కొనుగోళ్లలో పురోగతి

ABN , First Publish Date - 2022-01-29T05:44:35+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో గణనీయమైన పురోగతిని సాధించామని జాయింట్‌ కలెక్టర్‌ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో పురోగతి
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌

జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌

గుంటూరు, జనవరి28(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో గణనీయమైన పురోగతిని సాధించామని జాయింట్‌ కలెక్టర్‌ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన డయల్‌ యువర్‌ జేసీ నిర్వహించారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇప్పటివరకు 12,873 మంది రైతుల వద్ద నుంచి 86,862 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. డివిజనల్‌ స్థాయిలో నియమించిన నాలుగు టాస్కుఫోర్సు బృందాలు నిత్యం రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి అక్కడ రైతులు, అధికారులను సమావేశపరిచి కనీస మద్దతు ధరపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఏ-గ్రేడ్‌ వెరైటీ ధాన్యం క్వింటాలు రూ.1,960, కామన్‌ వెరైటీ రూ.1,940కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ధాన్యానికి సంబంఽధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొనుగోలు చేస్తామని ఆయా రైతులకు ధైర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.శివరాంప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ఎన్‌హెచ్‌ 565 విస్తరణ పనులపై సమీక్ష

జాతీయ రహదారి 565 విస్తరణలో భాగంగా వెల్దుర్తి మండలం పరిధిలో శిరిగిరిపాడు అటవీ రిజర్వు నుంచి ప్రకాశం జిల్లా మల్లాయపాలెం జంక్షన్‌ వరకు 20.97 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనుల్లో జేసీ దినేష్‌కుమార్‌ కదలిక తీసుకొచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2019లో ఈ రహదారి విస్తరణ ప్రారంభం కాగా అటవీశాఖ నుంచి భూమి బదలాయింపు కోసం అవసరమైన అటవీ హక్కుల చట్టం 2006 అమలు విషయమై ధ్రువీకరణ పత్రం జారీ కాలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. జేసీ దినేష్‌కుమార్‌ చొరవ తీసుకొని ఐటీడీఏ శ్రీశైలం, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ వన్యప్రాణి విభాగం, మార్కాపురం రెవెన్యూ శాఖ, జాతీయ రహదారి విభాగం అఽధికారులను సమన్వయపరిచారు. సదరు ధ్రువీకరణ పత్రం జారీ విషయమై ఏడు రోజుల్లో పరిష్కారం అయ్యేలా సూచనలు చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు పరిధిలో ఆదిమ గిరిజన తెగలు, వవారికి అటవీ హక్కుల చట్టం కింద అందించాల్సిన పరిహారం విషయమై ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధం చేశారు. 

 ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ఉపాధి

జిల్లావ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని (రైతు భరోసా) దినేష్‌కుమార్‌ తెలిపారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధిపరిశ్రమల క్రమబద్దీకరణ పథకం జిల్లాస్థాయి సమావేశాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఆహార పరిశ్రమలకు చేయూత ఇవ్వటానికి 35 శాతం రాయితీతో రూ.పది లక్షల వరకు బ్యాంక్‌ ద్వారా రుణాలిస్తున్నట్లు చెప్పారు. డీఆర్‌డీఏ, మెప్మా, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ రుణాలు తీసుకోవచ్చన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ జిల్లా ఈడీ సుజాత అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నాబార్డు ఏజీఎం కార్తీక్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్‌, ఎల్‌డీఎం ఈదర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:44:35+05:30 IST