JDS: బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో భారీ అవినీతి

ABN , First Publish Date - 2022-09-04T18:20:39+05:30 IST

బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, సీబీఐ దర్యాప్తు జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని జేడీఎస్‌

JDS: బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో భారీ అవినీతి

                                         - సీబీఐ విచారణకు జేడీఎస్‌ డిమాండ్‌


బెంగళూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, సీబీఐ దర్యాప్తు జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని జేడీఎస్‌ డిమాండ్‌ చేసింది. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం మాగడి ఎమ్మెల్యే ఏ మంజునాథ్‌(MLA Manjunath) మీడియాతో మాట్లాడారు. భూములకు నష్ట పరిహారం చెల్లింపుతో ప్రారంభమైన అక్రమాలు హైవే నిర్మాణం వరకు కొనసాగాయన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న ఢిల్లీకి పార్టీ అగ్రనేతల బృందం వెళ్లనుందన్నారు. ఈ బృందానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వం వహిస్తారని తెలిపారు. కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరి(Minister Nitin Gadkari)ని కలసి అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందచేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు భూ స్వాధీనం పరిహారం చెల్లింపు వ్యవహారం అడ్డగోలుగా సాగిందని ఆరోపించారు. బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే వస్తే ప్రజలకు ప్రత్యేకించి రైతులకు మేలు చేకూరుతుందని భావించామని, అయితే ఇటీవలి వర్షాల సమయంలో నాసిరకం పనుల డొల్లతనం బయటపడిందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా మైసూరు ఎంపీ ప్రతాప్‏సింహ(Mysore MP Pratap Simha) సమర్థించుకుంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే కోట్లాదిరూపాయల డబ్బులతోనే ప్రాజెక్టు నిర్మించారన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ అక్రమాల వెనుక బడానేతల హస్తం ఉందని, హైవే ప్రాధికార ఉన్నతాధికారులు కొందరు కుమ్మక్కయ్యారని అందుకే సీబీఐ దర్యాప్తుకోసం డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-09-04T18:20:39+05:30 IST