జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

ABN , First Publish Date - 2022-08-09T05:59:14+05:30 IST

దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీలలో ఇంజనీరింగ్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు.

జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు
వర్షిత్‌ చాణుక్యరెడ్డి

 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు 


నెల్లూరు (విద్య) ఆగస్టు 8 : దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీలలో ఇంజనీరింగ్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జూలై 25 నుంచి 29వతేదీ వరకు రెండు బ్యాచ్‌లుగా జరిగిన ఈ పరీక్షలకు జిల్లాలో 6వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పలు విభాగాల్లో సత్తాచాటుతూ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఏ వర్షిత్‌ 101వ ర్యాంకు, టీవీ సాయి పవన్‌ చాణుక్యరెడ్డి 128, ఏ తౌసిఫ్‌ అహ్మద్‌ 278, సీహెచ్‌ కృష్ణ భరద్వాజ్‌ 608వ ర్యాంకు సాధించారు. వీరితోపాటు మొత్తం జిల్లా నుంచి 80శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.


ఐఐటీలో సీటు సాధిస్తా: ఏ వర్షిత్‌ , 101వ ర్యాంకర్‌ 

మా కుటుంబం బాలాజీనగర్‌లో ఉంటుంది. తల్లిదండ్రులు కిషోర్‌, వాణి చిరు వ్యాపారం చేసుకుంటూ నన్ను చదివిస్తున్నారు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటర్‌ లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ ప్రిలిమ్స్‌లో  99.993 పర్సంటైల్‌ సాధించాను. మెయిన్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 101వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.  ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం.


సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా రాణిస్తా:  టీవీ సాయి పవన్‌ చాణుక్యరెడ్డి, 128వ ర్యాంకర్‌

రేబాలకు చెందిన నేను చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ప్రభాకర్‌రెడ్డి, విజిత అందించిన ప్రోత్సాహంతో విద్యలో ఉత్తమంగా రాణిస్తున్నాను. ఇంటర్‌లో 969 మార్కు లు సాధించాను. జేఈఈ తొలివిడతలో 99.992 పర్సంటైల్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుత మెయిన్స్‌ ఫలితాల్లో 128వ ర్యాంకు సాధించాను. అధ్యాపకుల కృషి, తల్లిండ్రుల సహకారంతో మున్ముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా రాణించేందుకు కృషి చేస్తాను. 

 

ఐసెట్‌లో 772 మంది విజయం

నెల్లూరు (విద్య), ఆగస్టు 8 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదయ్యాయి. ఈ పరీక్షకు జిల్లా నుంచి 980 మంది దరఖాస్తు చేసుకోగా 895 మంది హాజరయ్యారు. ఫలితాల్లో పురుషులు 335 మంది, మహిళలు 437 మంది కలిపి మొత్తం 772 మంది ఉత్తీర్ణత సాధించారు. 

Updated Date - 2022-08-09T05:59:14+05:30 IST