ఆ ఒక్క మాటతో హైదరాబాద్‌లో డబుల్‌ మర్డర్‌..!

ABN , First Publish Date - 2022-03-12T17:41:48+05:30 IST

ఆ ఒక్క మాటతో హైదరాబాద్‌లో డబుల్‌ మర్డర్‌..!

ఆ ఒక్క మాటతో హైదరాబాద్‌లో డబుల్‌ మర్డర్‌..!

  • బావను, అతడి సోదరుడిని హత్య చేసిన బావమరుదులు


హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : మద్యం మత్తులో బావమరిదికి ఫోన్‌ చేసి ‘మీ అక్కను చంపేశా’ అన్న మాట ఇద్దరి హత్యకు దారి తీసింది. తమ అక్కను బలి తీసుకున్నారన్న కోపంతో బావతో పాటు మరో ఇద్దరిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. జీడిమెట్ల పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. సుభా‌ష్‌నగర్‌లో ఉంటున్న మూకా సీతాలక్ష్మికి వెంకటేశ్‌ (32), పోతురాజు (26) కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వెంకటేశ్‌ పెయింటర్‌గా పని చేసేవాడు. అతడిపై చిల్లర దొంగతనాల కేసులు ఉన్నాయి. 


పోతురాజుపై అనేక పోలీ‌స్‌స్టేషన్‌లలో 34 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఏడేళ్ల క్రితం వెంకటేశ్‌కు సికింద్రాబాద్‌ చిలకానగర్‌కు చెందిన రేఖ (40)తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మొదటి భర్తతో విడిపోయిన రేఖ వెంకటేశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొంత కాలం తర్వాత వెంకటేశ్‌ అనుమానంతో భార్యను నిత్యం కొట్టేవాడు. ఈ నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి. వెంకటేశ్‌ గురువారం ఉదయం రేఖను కొట్టి తన తల్లి వద్దకు వెళ్లాడు. సాయంత్రం సోదరుడు పోతురాజు, తన బావ కృష్ణతో కలిసి మద్యం తాగాడు.


చిలకానగర్‌లో ఉంటున్న బావ మరిది వినయ్‌కి ఫోన్‌ చేసి ‘మీ అక్కను చంపేశా’ అని చెప్పాడు. ఆగ్రహానికి గురైన వినయ్‌.. తమ్ముడు మధును వెంటపెట్టుకుని బైక్‌పై వచ్చి సుభా‌ష్‌నగర్‌ పోచమ్మ ఆలయం వద్ద ఉన్న బావతో గొడవపడ్డారు. వెంట తెచ్చుకున్న కత్తితో బావతో పాటు పోతురాజు, కృష్ణలను పొడిచారు. పోతురాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నాడు. స్థానికులు ఆ యువకులను పట్టుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-03-12T17:41:48+05:30 IST