జీవభ్రాంతి

ABN , First Publish Date - 2022-09-22T05:17:20+05:30 IST

జీవక్రాంతి పథకం 2020 డిసెంబరులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హత ఉన్న వారికి ఒక్కో యూనిట్‌ కింద 14 గొర్రెలు, ఒక పొట్టేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జీవభ్రాంతి

ఊసేలేని జీవక్రాంతి పథకం

లక్ష్యాలు ఘనం.. చేతల్లో శూన్యం

చేయూత డబ్బులతో మెలికే ప్రతిబంధకం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7,281 యూనిట్ల లక్ష్యం

తొలుత అంగీకరించినా ఆపై ముందుకురాని లబ్ధిదారులు

 

జీవక్రాంతి.. భ్రాంతిగా మారింది. ఘనమైన లక్ష్యాలతో ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుతం ఊసే లేకుండా పోయింది. దశల వారీగా ఈ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని ఆరంభంలో రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అయితే తొలిదశ లక్ష్యాలకే గ్రహణం పట్టింది. ఇక ప్రస్తుతం దాదాపు ఈ పథకం అమలు సంగతి ప్రభుత్వం మరిచిపోయింది. యంత్రాంగం మాత్రం తాము వందశాతం లక్ష్యాలను చేరుకున్నామనే మాటలను చెబుతూ అంకెల గారడీకి తెరతీస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందించిన యూనిట్లకు ప్రారంభంలో ప్రభుత్వం చెప్పిన మాటలకు హస్తిమశకాంతరం తేడా కనిపిస్తోందంటే ఈ పథకం ఏ స్థాయిలో అమల్లో ఉందో తెలుసుకోవచ్చు. 


బాపట్ల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):  జీవక్రాంతి పథకం 2020 డిసెంబరులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హత ఉన్న వారికి ఒక్కో యూనిట్‌ కింద 14 గొర్రెలు, ఒక పొట్టేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు మాత్రమే కాకుండా లబ్ధిదారులు కోరుకున్న విధంగా గేదె లేదా ఆవును కూడా ఒక యూనిట్‌గా పరిగిణించి అందిస్తామని అప్పట్లో  ప్రభుత్వం ప్రకటించింది. పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా సాధికారత చేకూర్చాలనేదే తమ లక్ష్యమని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకం అమలును కొనసాగించి ఉంటే  తొలివిడతలో భాగంగా అనుకున్న లక్ష్యాలకు చేరువయ్యేది. కానీ ఆరంభశూరత్వం లాగా ప్రభుత్వ చర్యలు మిగిలిపోయాయి. దీంతో అరకొర లబ్ధిదారులతో పథకాన్ని మమ అనిపించి అసలు లక్ష్యాన్ని నీరుగార్చారు. లబ్ధిదారుల ప్రయోజనాలకు గండికొట్టింది. ఈ పథకానికి ఆమోదం తెలిపిన మహిళలు ప్రభుత్వం చేయూత పథకం కింద ఇచ్చిన రూ.18,750లను బ్యాంకులో ఉన్నట్లు చూపితేనే రుణం మంజూరు చేసేలా నిబంధన పెట్టింది. యూనిట్‌ విలువ రూ.75,000 కాగా లబ్ధిదారులు బ్యాంకులో ఉంచిన రూ.18,750 పోనూ మిగిలిన రూ.56,250 బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ మొత్తాన్ని వారు వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలి. చేయూత సొమ్ముల మెలిక విషయంలో ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బీసీ, ముస్లింలకు మాత్రం తప్పనిసరి చేసింది. పథకం నత్తనడకన అమలు కావడానికి ప్రధాన కారణం లబ్ధిదారులకు చేయూత డబ్బులు మెలిక పెట్టడమేనని తెలుస్తోంది. ప్రారంభంలో  చేయూత డబ్బుల ఊసెత్తని ప్రభుత్వం వాటిని బ్యాంకులో ఉన్నట్లు లబ్ధిదారులు చూపెడితేనే మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయని అప్పట్లో తాపీగా ప్రకటించింది. ఆ మెలికతో అంగీకారం తెలిపిన వారు కూడా వెనక్కి తగ్గారు.    ప్రకటనలు ఒకలా, విధి విధానాలు వేరే విధంగా ఉండడంతో యత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. 


ఉమ్మడి గుంటూరు జిల్లాలో 40 శాతమే.. 

పథకం అమల్లోకి తెచ్చిన 2020 డిసెంబరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొలి విడతలో 7,281 యూనిట్లను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దశల వారీగా యూనిట్ల సంఖ్యను పెంచుతామని కూడా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే అంతా కలిపి 2,800 యూనిట్లలోపేనని తెలుస్తోంది. అంటే విధించుకున్న లక్ష్యంలో 40 శాతం కూడా చేరుకోని పరిస్థితి కనబడుతోంది.  ప్రస్తుతం ఈ పథకం ఉనికినే ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. ఇక అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11,937 యూనిట్లను  లబ్ధిదారులకు  పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఎడెనిమిది నెలలలోపులోనే పంపిణీ చేయాలని కాలపరిమితి కూడా  విధించుకున్నారు. అయితే ఈ పథకం కింద అందించిన యూనిట్లు కేవలం 3,500 మాత్రమే అంటే ఆశ్చర్యం కాదు. ఇందులో బాపట్ల జిల్లాలో కలిసిన మూడు నియోజకవర్గాల వాటా అంతా కలిపి 700 యూనిట్లలోపే ఉంది. ఇలా మాటలకు చేతలకు పొంతన లేదు.  

Updated Date - 2022-09-22T05:17:20+05:30 IST