కొండ మీది ప్రసంగం

ABN , First Publish Date - 2022-05-27T05:37:17+05:30 IST

ప్రకృతిలో... కొండలు, కోనలు, సముద్ర, నదీ తీరాల్లో తన ఏకాంతాన్ని గడపడానికి ఏసు ప్రభువు ఎక్కువగా ఇష్టపడేవాడు.

కొండ మీది ప్రసంగం

ప్రకృతిలో... కొండలు, కోనలు, సముద్ర, నదీ తీరాల్లో తన ఏకాంతాన్ని గడపడానికి ఏసు ప్రభువు ఎక్కువగా ఇష్టపడేవాడు. కానీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ... ఆ ప్రాంతమంతా క్షణాల్లో జనసంద్రం అయ్యేది. ఆయన వెళ్ళిన ప్రతిచోటా ప్రజలు చుట్టుముట్టేవారు. ఆయన మాటలను వారు ఎంతో ఇష్టపడేవారు. సుప్రసిద్ధమైన కొండ మీది ప్రసంగానిది కూడా ఇటువంటి నేపథ్యమే. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు?


‘‘వినయంగా బతుకులు సాగించే దీనాతి దీనులు నిజంగానే ధన్యులు. రకరకాల కారణాలతో శారీరకంగా, మానసికంగా వేదనపడేవారు ధన్యులు. వారికి ఓదార్పు తప్పకుండా లభిస్తుంది. నీతిని నిలపడం కోసం ఆకలిదప్పులతో కుంగిపోయేవారు ధన్యులు. వారు కనికరాన్ని పొందుతారు. హృదయశుద్ధితో స్వచ్ఛంగా, సచ్ఛీలతతో బతికేవారు ధన్యులు...’’ 


ఈ మాటలను జనం శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు ప్రభువు... ‘‘ప్రతి వ్యక్తి లోకానికి ఉప్పులా... శుచిగా, రుచిగా మెలగాలి. నిప్పులా బతకాలి. ఒక్కొక్కరూ ఒక్కొక్క దీపస్తంభం మీద ముట్టించిన దీపంలా వెలగాలి’’ అంటూ తన మాటలతో మేలుకొలిపాడు. వచ్చిన దీనులకూ, హీనులకూ తగిన ఓదార్పు ఇచ్చాడు. ‘‘నేనే వెలుగును’’ అని చెప్పిన ప్రభువు... ఆ గుట్టల మీద, ఆ చీకటిలో... చింతలతో సతమతమవుతున్న గుండెలకు కొండంత వెలుగు ఇచ్చాడు. కాలం తెలియకుండా, ఆకలి ఎరుగకుండా... ఆ ప్రజాసమూహం ఆయన మాటలు ఆలకిస్తోంది. 


ఒక్కొక్క వాక్యం ఒక దివ్య గ్రంథం. ఆయన ఒక్కొక్క మాటా అగ్నికణంలా రగులుతోంది. ఆ శ్రోతల్లో నిద్రాణమైన శక్తులను మేలుకొలుపుతోంది. ‘అణచివేతకు గురైన ప్రతి వ్యక్తీ అనంతర కాలంలో అందలం ఎక్కకపోడు’ అనే భావన ధ్వనిస్తోంది. నిత్యం ప్రభువు వాక్యాన్ని వింటూ కూడా అహాన్ని వదులుకోని వారికి... ప్రభువు వాక్యాన్ని అనుసరిస్తూ వినయంగా జీవిస్తున్నామని నటించేవారికీ ఈ సందేశం ఛెళ్ళుమనిపించే చెంప దెబ్బ.  రవ్వంత బాధకే రచ్చ రచ్చ చేస్తూ, చీమంత చీవాట్లకే ఆత్మహత్యలు చేసుకుంటూ... ‘ఈ అవమానం భరించలేం, ఇకపై జీవించలేం’ అనుకొని నిరుత్సాహంతో, అవివేకంతో ఆత్మహత్యలు చేసుకొనే అజ్ఞానులకు... ఈ కొండమీది ప్రసంగం... ఒక పరిష్కార సందేశం.


ప్రభువు నోటి నుంచి వెలువడిన ఆ వాక్యాలు ధన్యమైపోయాయి. జనమంతా ఆ వాక్యాలను స్మరించుకుంటూ... ‘మనకన్నా ధన్యులు మరెవరున్నారులే’ అనుకొంటూ... ఆశీస్సులు నిండిన హృదయాలతో... ఇళ్ళకు పయనమయ్యారు. 


డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024 

Updated Date - 2022-05-27T05:37:17+05:30 IST