అన్నిటికీ అవే ఆధారం!

ABN , First Publish Date - 2021-05-14T05:30:00+05:30 IST

మానవులు ఎలా ఉండాలో ధర్మశాస్త్రాలు సూచిస్తాయి. వారు పాటించాల్సిన విషయాలను ఆజ్ఞల రూపంలో అందిస్తాయి. అయితే ఈ ఆజ్ఞలలో ఏవి గొప్పవి? ఈ ప్రశ్నకు ఏసు ప్రభువు స్పష్టమైన...

అన్నిటికీ అవే ఆధారం!

మానవులు ఎలా ఉండాలో ధర్మశాస్త్రాలు సూచిస్తాయి. వారు పాటించాల్సిన విషయాలను ఆజ్ఞల రూపంలో అందిస్తాయి. అయితే ఈ ఆజ్ఞలలో ఏవి గొప్పవి? ఈ ప్రశ్నకు ఏసు ప్రభువు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.


ఒకసారి ఏసు ప్రభువును కొందరు పరిసయ్యులు కలుసుకున్నారు. వారిలో ఒకరు ధర్మశాస్త్ర పండితుడు. అతను ఏసును పరీక్షించాలనుకున్నాడు. ‘‘బోధకుడా! ధర్మశాస్త్రాలలో పొందుపరిచిన ఆజ్ఞలు అన్నిటిలోనూ గొప్ప ఆజ్ఞ ఏదో చెప్పగలరా?’’ అని అడిగాడు.


దీనికి ఏసు బదులిస్తూ ‘‘మీకు ప్రభువైన దైవాన్ని పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన బుద్ధితో, పరిపూర్ణమైన ఆత్మతో ప్రేమించండి. ఆజ్ఞలన్నిటికన్నా ఇది మొదటిదీ, ప్రధానమైనదీ. అంతే గొప్పదైన, ప్రధానమైన మరో ఆజ్ఞ కూడా ఉంది. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో మీ పొరుగువారిని కూడా అంతగా ప్రేమించండి. ధర్మశాస్త్రాలన్నిటిలో ఉన్న విషయాలకూ, ప్రవక్తలు చెప్పిన, రాసిన విషయాలకూ ఆధారం ఈ రెండు ఆజ్ఞలే!’’ అని చెప్పాడు. 


మన పొరుగువారితో, తోటి మనుషులతో మనం పెంపొందించుకున్న మంచి సంబంధాలే దైవానికీ, మనకూ ఉన్న సంబంధంలో ప్రతిఫలిస్తాయి. ప్రేమ, సౌభ్రాతృత్వం కలిగిన వ్యక్తులు మసలే చోట దైవం ఉనికి నెలకొంటుంది. మనుషులందరూ పరస్పర ప్రేమానురాగాలతో మెలగాలన్నదే సృష్టికర్త సంకల్పం. ‘దైవాన్ని ప్రేమించాలి. దేవుడు సృష్టించిన ఈ లోకం మీదా, ఆయనకు ఎంతో ఇష్టులైన మానవుల మీదా ఆ ప్రేమను ప్రతిఫలింపజేయాలి. ఇదే నిజమైన ఆరాధన, అసలైన విశ్వాసం’ అని ఏసు తన సమాధానం ద్వారా వెల్లడి చేశాడు.

Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST