చీకటి నుంచి వెలుగులోకి...

May 7 2021 @ 00:00AM

ఏసు ప్రభువు జెరూసలేములో ఉన్నప్పుడు అనేక బోధలు చేశాడు. కొన్ని అద్భుతాలు ప్రదర్శించాడు. దీనితో ఎంతోమంది ప్రజలు ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ ఊర్లో నికోదేము అనే పరిసయ్యుడు ఉన్నాడు. అతను యూదుల చట్టసభలో సభ్యుడు. ఏసు క్రీస్తు గురించి ఆయన ఎన్నో విన్నాడు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. కానీ అతను సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. బహిరంగంగా ఏసును కలుసుకోవడానికి వెళ్తే ఇతర యూదు నాయకుల కంట పడాల్సి వస్తుందనీ, దానివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనీ భయపడ్డాడు. అందుకని ఒక రోజు రాత్రి రహస్యంగా ఏసు దగ్గరకు వచ్చాడు. ‘‘బోధకుడా! నువ్వు దేవుడి దగ్గర నుంచి ఒక బోధకుడిగా ఇక్కడకు వచ్చావని మాకు తెలుసు. నువ్వు చేసే అద్భుతాలను దేవుని సహాయం లేనివారెవరూ చెయ్యలేరని మాకు తెలుసు’’ అన్నాడు.

దీనికి ఏసు బదులిస్తూ ‘‘మానవుడు మళ్ళీ జన్మిస్తే కాని దైవరాజ్యంలో ప్రవేశించలేడు’’ అని చెప్పాడు.

ఆయన మాటలు నికోదేముకు అర్థం కాలేదు. ‘‘అదేమిటి? మనిషికి వార్ధక్యం వచ్చాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండో సారి జన్మించడానికి మళ్లీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడా?’’ అని అడిగాడు. 

‘‘నీటి నుంచీ, ఆత్మనుంచీ తిరిగి పుడితే తప్ప ఎవరూ దేవుడి రాజ్యాన్ని చేరుకోలేరు. శరీరం నుంచి పుట్టింది శరీరమే. ఆత్మ నుంచి పుట్టినది ఆత్మే. గాలి తనకు ఇష్టం వచ్చిన వైపు వీస్తుంది. దాని శబ్దం మాత్రమే నీకు వినిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తోందో, ఎక్కడికి వెళుతోందో నీకు తెలీదు. ఆత్మ నుంచి పుట్టినవాడు అలాగే ఉంటాడు’’ అన్నాడు ఏసు.

నికోదేము మరింత గందరగోళంలో పడిపోయాడు. ‘‘ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?’’ అని ఏసును ప్రశ్నించాడు.

‘‘నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివి. మరి ఈ సంగతులు నీకు అర్థం కావడం లేదా? మాకు తెలిసినవీ, మేము చూసినవీ వివరిస్తున్నాం. కానీ మీరు మా సాక్ష్యాన్ని ఒప్పుకోరు. నేను భూమికి సంబంధించిన విషయాలు చెబితేనే మీరు నమ్మరు కదా? మరి పరలోకానికి సంబంధించినవి ఎలా విశ్వసిస్తారు? ఎందుకంటే, పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చిన మనుష్య కుమారుడు మినహా, పైకి ఎక్కి పరలోకానికి వెళ్ళినవారు ఎవరూ లేరు’’ అన్నాడు ఏసు. 

సందిగ్ధంగా చూస్తున్న నికోదేముకు మరింత బోధ చేస్తూ ‘‘ఈ లోకం మీద దేవుడికి ఎంతో ప్రేమ. తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన వరంగా ఇవ్వడానికి కారణం అదే! అరణ్యంలో సర్పాన్ని మోషే ఎలా పైకి ఎత్తాడో తెలుసు కదా! అలాగే మానవ కుమారుణ్ణి కూడా పైకి ఎత్తాల్సి ఉంది. అప్పుడే దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరూ నిత్య జీవనాన్ని పొందుతారు. తన ప్రియమైన కుమారుడి ద్వారా లోకం రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే... తన కుమారుణ్ణి ఆయన పంపాడు తప్ప ఈ లోకానికి శిక్ష విధించడానికి కాదు. ఆ కుమారుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరికీ రక్షణ దొరుకుతుంది’’ అని చెప్పాడు ఏసు ప్రభువు.

దీనితో నికోషేముకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. ఏసుపై విశ్వాసం అంకురించింది. క్రమేణా స్థిరపడింది. చీకటిలో ఏసును కలవడానికి వచ్చిన అతను ఆ ప్రభువు చూపిన వెలుగు దారిలోకి నడిచాడు. మంచి విశ్వాసిగా నిలిచాడు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.