Jharkhand trust vote: విశ్వాస పరీక్ష నెగ్గిన సొరేన్ సర్కారు

ABN , First Publish Date - 2022-09-05T19:34:51+05:30 IST

రాంచీ: జార్ఖండ్‌‌లోని హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ విశ్వాస పరీక్ష నెగ్గింది. ఆయన ప్రభుత్వానికి మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి.

Jharkhand trust vote: విశ్వాస పరీక్ష నెగ్గిన సొరేన్ సర్కారు

రాంచీ: జార్ఖండ్‌‌లోని హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ విశ్వాస పరీక్ష నెగ్గింది. ఆయన ప్రభుత్వానికి మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. విశ్వాస పరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్‌ చేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా రాలేదు. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎమ్‌ఎమ్‌కు 30, కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి 1, ఎన్సీపీకి 1, సీపీఐఎంఎల్‌కు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి 26, ఏజేఎస్‌యూ‌కు 2, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 41 కాగా జేఎంఎం కూటమికి 48 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. విశ్వాస పరీక్షకు ముందు హేమంత్ సొరేన్ బీజేపీ విధానాలను విమర్శించారు. కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేస్తోందని ఆరోపించారు. 






అసెంబ్లీ సాక్షిగా విశ్వాస పరీక్ష నెగ్గినా సొరేన్‌ మెడపై అనర్హత కత్తి వేలాడుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ పేరు మీద గనుల తవ్వకం లీజు ఉందని, ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆరోపించారు. దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఫిబ్రవరి 11న గవర్నర్ రమేశ్ బయిస్‌ను కలిసి, ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరింది. దీనిపై అభిప్రాయాన్ని తెలపాలని ఈసీఐని గవర్నర్ కోరారు. ఈసీఐ మొదట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. సోరెన్‌కు మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ పత్రాలన్నిటినీ పరిశీలించిన తర్వాత మే 2న సోరెన్‌కు నోటీసు ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీఐ ధర్మాసనం సమక్షంలో బీజేపీ, సోరెన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోరెన్ తరపు న్యాయవాదుల వాదనలు ఆగస్టు 12తో ముగిశాయి. బీజేపీ ఆగస్టు 18న ఓ రిజాయిండర్‌ను సమర్పించింది. సొరేన్ అనర్హతపై ఈసీఐ ఇప్పటికే గవర్నర్‌కు నివేదిక పంపించింది. సొరేన్‌పై వేటు తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-09-05T19:34:51+05:30 IST