ఎక్కువసేపు మాస్క్‌లు ధరించొద్దు... జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-13T13:03:02+05:30 IST

కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ఫేస్ మాస్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

ఎక్కువసేపు మాస్క్‌లు ధరించొద్దు... జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

రాంచీ : కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ఫేస్ మాస్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాస్కులు ఎక్కువసేపు ధరించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ పీల్చడానికి దారి తీస్తుందని ఎంబీబీఎస్ డాక్టర్ అయిన ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ చెప్పారు. అధిక సమయం మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరమని, కాబట్టి ఎక్కువ సమయం మాస్కులను ధరించొద్దు అని ఎమ్మెల్యే సూచించి వివాదానికి తెర తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియెంట్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఫేస్ మాస్కులు ధరించాలని, కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తుండగా, డాక్టరైన జార్ఖండ్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. 


ధన్‌బాద్‌ నగరంలోని వాసేపూర్ ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అన్సారీ మాస్కు ధరించకుండా కనిపించారు. దీనిపై విలేఖరులు ప్రశ్నించగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మాస్క్‌లు ఎక్కువ కాలం ధరించకూడదని ఒక వైద్యుడిగా నేను కరోనా బారిన పడిన వారితో చెబుతున్నాను.కరోనా వైరస్ సంక్రమించిన వారు భయపడకూడదు. వారు ఓపిక పట్టాలి.కొవిడ్ ఇన్ఫెక్షన్ నాలుగు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండదు.’’ అని ఎమ్మెల్యే అన్సారీ చెప్పారు.కాగా ఇర్ఫాన్ అన్సారీ మాస్కు ధరించొద్దు అనే వాదనను ఐఎంఏ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ అజయ్ సింగ్ ఖండించారు. 


ఎమ్మెల్యే అన్సారీ సాకులు చెప్పారని అజయ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు.ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌పై మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మానసిక సమతుల్యతను కోల్పోయారని మాజీ స్పీకర్, బీజేపీ నేత సీపీ సింగ్ మండిపడ్డారు. ఇర్ఫాన్ అన్సారీ ఎంబీబీఎస్ డిగ్రీని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.కొవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు, మాస్కు ధరించవద్దని ప్రజలను ప్రేరేపించినందుకు ఇర్ఫాన్ అన్సారీపై కేసు పెట్టాలని బీజేపీ నాయకుడు కోరారు.


Updated Date - 2022-01-13T13:03:02+05:30 IST