Jharkand Crisis: రిసార్ట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి..!

ABN , First Publish Date - 2022-08-27T19:53:20+05:30 IST

జేఎంఎం నేత, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఏ క్షణంలోనైనా అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో..

Jharkand Crisis: రిసార్ట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి..!

రాంచీ: జేఎంఎం నేత, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)పై ఏ క్షణంలోనైనా అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో ఆయన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోరెన్ టీమ్ ఎమ్మెల్యేలు శనివారంనాడు ఆయన నివాసానికి బ్యాగేజీలతో (bags packed) చేరుకున్నారు. ఎమ్మెల్యేల బేరసారాలకు (poaching) అవకాశం లేకుండా  అధికార యూపీఏ ఎమ్మెల్యేలంతా ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)కు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలకు గాను అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేల  బలం ఉంది. అతిపెద్ద పార్టీ అయిన జేఎంఎంకు 31 మంది, కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒకటి, బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.


గనులశాఖను కూడా పర్యవేక్షిస్తున్న హేమంత్‌ సీఎం సోరెన్‌ స్టోన్‌ చిప్స్‌ మైనింగ్‌లో ఒక లీజును చేజిక్కించుకున్నారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9(ఏ) ఉల్లంఘనే అని పేర్కొంటూ బీజేపీ నేత, మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ ఈ నెల 18న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ ఈసీఐ అభిప్రాయాన్ని కోరారు. సోరెన్‌ను తొలగించవచ్చంటూ గవర్నర్‌కు సీల్ట్ కవర్‌లో ఈసీఐ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా గవర్నర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కాగా, తాజా పరిణామాలపై సమీక్షించి తగిన వ్యూహరచన చేసేందుకు హేమంత్ సోరెన్ శుక్రవారంనాడు తన నివాసంలో యూపీఏ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో పార్టీ  ఫిరాయింపులకు తావీయకుండా ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించనున్నారు. 


దుష్టశక్తుల పన్నాగం సాగదు: సోరెన్

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని సోరెన్ శనివారం ఒక బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. ప్రజాతీర్పు తమ వైపే ఉన్నందున తనకెలాంటి భయం లేదని, తన చివరి రక్తం బొట్టు వరకూ పోరాటం సాగిస్తానని అన్నారు. కాగా, బీజేపీ ఇప్పటికే సోరెన్ రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.

Updated Date - 2022-08-27T19:53:20+05:30 IST