Jharkhand Crisis: రాయపూర్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు తిరుగుముఖం

ABN , First Publish Date - 2022-09-04T23:21:51+05:30 IST

జార్ఖాండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు మకాం మార్చిన అధికార యునైటెడ్ ప్రొగ్రసివ్ అలయెన్స్..

Jharkhand Crisis: రాయపూర్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు తిరుగుముఖం

న్యూఢిల్లీ: జార్ఖాండ్‌ (Jharkhand)లో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు మకాం మార్చిన అధికార యునైటెడ్ ప్రొగ్రసివ్ అలయెన్స్ (UPA)కు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు రాంచీకి (Ranchi) తిరిగి పయనమయ్యారు. ఆదివారం ఉదయం రాయపూర్ స్వామి వివేకానంద అంతర్జాతీయ విమానాశ్రయానికి వీరంతా చేరుకున్నారు. అక్కడి నుంచి రాంచీ చేరుతారు. వారిని పికప్ చేసుకునేందుకు రాంచీ విమానాశ్రయంలో రెండు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరినీ సర్క్యూట్ హౌస్‌కు చేరుస్తారు. సర్క్యూట్ హౌస్ నుంచే ఎమ్మెల్యేలు నేరుగా జార్ఖాండ్ అసెంబ్లీకి సోమవారం హాజరవుతారు. జార్ఖాండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయన్న కారణంగా 32 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆగస్టు 30న రాయ్‌పూర్ తరలించారు.


5న సోరెన్ విశ్వాస పరీక్ష

జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఈనెల 5వ తేదీ సోమవారంనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే సోరెన్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. తన మెజారిటీని నిరూపించుకునేందుకు వీలుగా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎమ్మెల్యేలకు పంపిన లేఖలో అసెంబ్లీ సెక్రటేరియట్ పేర్కొంది. 

Updated Date - 2022-09-04T23:21:51+05:30 IST