మహ్మద్‌ జానీ.. ఇకలేరు

ABN , First Publish Date - 2021-04-18T05:37:57+05:30 IST

మాజీ మంత్రి మహ్మద్‌ జానీ(74) శనివారం మధ్యాహ్నం గుంటూరులో గుండెపోటుతో మృతి చెందారు. కాంగ్రెస్‌లో పాతతరం నాయకుడు జానీ.

మహ్మద్‌ జానీ.. ఇకలేరు
మహ్మద్‌ జానీ

గుండెపోటుతో మాజీ మంత్రి హఠాన్మరణం

సహచర రాజకీయ నేతలు, అభిమానులు దిగ్ర్భాంతి

పోస్టల్‌శాఖలో ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయ ప్రస్థానం

గుంటూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మహ్మద్‌ జానీ(74) శనివారం మధ్యాహ్నం గుంటూరులో గుండెపోటుతో మృతి చెందారు. కాంగ్రెస్‌లో పాతతరం నాయకుడు జానీ. ఆయనకు గాడ్‌ఫాదర్‌ లేనప్పటికీ వ్యక్తిగత ప్రతిభతో రాజకీయాల్లో అడుగుపెట్టి అనతికాలంలోనే అమాత్య పదవిని అధిష్ఠించగలిగారు. తాడికొండలో జన్మించిన జానీ ఆ తర్వాత గుంటూరులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. తొలుత పోస్టల్‌శాఖలో ఆర్‌ఎంఎస్‌లో ఉద్యోగం చేస్తూ ఐఎన్‌టీయూసీ నాయకుడిగా ఎదిగారు. ఆ తరువాత గుంటూరులోని అంజుమన్‌ కమిటీ సెక్రటరీగా 11 ఏళ్లు కొనసాగారు. ఈ క్రమంలో ఆయనలోని ప్రతిభను గుర్తించి 1985లో గుంటూరు-1 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించిన జానీకి మంత్రి వర్గంలో చోటు దక్కింది. అప్పట్లో ఆయన కొద్దికాలం జిల్లాలో ఏకైక మంత్రిగా వ్యవహరించి తిరుగులేని నేతగా చలామణి అయ్యారు. ఆ తరువాత 1994, 99 ఎన్నికలో ఓటమి చెందినప్పటికీ 2007లో జానీకి శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కల్పించారు. జానీకి ఉన్న వాక్‌చాతుర్యాన్ని గుర్తించి మండలికి డిప్యూటీ చైర్మన్‌గా నాలుగేళ్లపాటు చేసే అవకాశం కల్పించారు. మళ్లీ 2010లో మండలిలో అడుగుపెట్టి ఆరేళ్లపాటు కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ, ఏఐసీసీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి రెండేళ్ల పాటు కొనసాగారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరినప్పటికీ కొంత అసంతృప్తితో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. 

గత ఏడాది కరోనా నుంచి క్షేమంగా..

గతేడాది ఆయన కరోనాకి గురైనప్పటికీ క్షేమంగా బయటపడ్డారు. శనివారం ఉదయం కూడా జానీ తన నివాసంలో అనుయాయులతో సరదాగా మాట్లాడారు.  హఠాత్తుగా గుండెనొప్పికి గురవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే చనిపోయారు. ఆయన భార్య ఏడాది కిత్రం మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులున్నారు. పొన్నూరు రోడ్డులోని నివాసానికి వెళ్ళి భౌతికకాయానికి పూలమాలలతో నివాళులర్పించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి ఇతర నేతలు  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జానీ మృతి పట్ల మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, జడ్పీ మాజీ చైర్మన్‌ రాయపాటి శ్రీనివాస్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. తాము విద్యనభ్యసించిన తాడికొండ ఎస్‌వీవీ హైస్కూల్‌లోనే జానీ చదువుకున్నారని, తొలినాటి నుంచి రాజకీయాల్లో తమకు ఎంతో ఆప్తుడని  రాయపాటి సోదరులు గుర్తు చేసుకున్నారు. గుంటూరు నగరం రాజకీయ ఉద్దండుడిని కోల్పోయిందని టీడీపీ పశ్చిమ, తూర్పు ఇన్‌చార్జి లు కోవెలమూడి రవీంద్ర, మహ్మద్‌ నసీర్‌ సంతాపం వ్యక్తం చేశారు.  జిల్లా రాజకీయాల్లో జానీ చెరగని ముద్ర వేశారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ హిదాయత్‌ సంతాపం తెలిపారు. జానీ మృతి నేటి రాజకీయాలకు తీరనిలోటని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, మోడల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్‌ వేర్వేరు ప్రకటనల్లో జానీ మృతికి సంతాపం తెలిపారు.  


Updated Date - 2021-04-18T05:37:57+05:30 IST