జిగ్నేశ్, కన్హయ్య నిరాశపరిచారా?

ABN , First Publish Date - 2021-09-30T06:44:38+05:30 IST

భారత జాతీయ కాంగ్రెస్ను లోపలివాళ్లు, బయటివాళ్లూ కూడా జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకపక్కన రత్నాలు జారిపోతుంటే, నత్తగుల్లల్ని పట్టుకువచ్చి విజయచిహ్నాలుగా ప్రదర్శిస్తోందేమిటని వెక్కిరింతలు వినిపిస్తున్నాయి...

జిగ్నేశ్, కన్హయ్య నిరాశపరిచారా?

భారత జాతీయ కాంగ్రెస్ను లోపలివాళ్లు, బయటివాళ్లూ కూడా జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకపక్కన రత్నాలు జారిపోతుంటే, నత్తగుల్లల్ని పట్టుకువచ్చి విజయచిహ్నాలుగా ప్రదర్శిస్తోందేమిటని వెక్కిరింతలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో  పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. సిద్ధూ రాజీనామా చేశాడు, అమరీందర్ అమిత్ షా దగ్గరకు వెళ్లాడు. గోవాలో ఓ పెద్ద నాయకుడు వెళ్లిపోతున్నాడు. గత రెండేళ్లలో మధ్యప్రదేశ్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, బెంగాల్‌లో ఒక చోట అనేమిటి, యువనేతలు సీనియర్లు అనే తేడా లేకుండా కాంగ్రెస్ నావ నుంచి దూకేస్తున్నారు. పార్టీకి కీలకమయినవాళ్లే ఓ 23 మంది పార్టీ ప్రక్షాళన కోసం అధినాయకురాలికి లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. ఆ బృందం ఇప్పటికీ ఒక్కటిగా గొంతు విప్పుతోంది. ఇంత జరుగుతుంటే, కన్హయ్యకుమార్, జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ శిబిరంలోకి రావడం పెద్ద విజయమా? ఒకరు బిహార్‍లో లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయిన సిపిఐ నాయకుడు, మరొకరు, గుజరాత్‌లో కాంగ్రెస్, ఆప్ మద్దతుతో గెలిచిన స్వతంత్ర శాసనసభ్యుడు. 


అధికార రాజకీయాల తూకపు రాళ్లలో ఆ ఇద్దరు నాయకులకు పెద్ద విలువ లేకపోవచ్చును కానీ, గత ఆరేడేళ్ల కాలంలో దేశ రాజకీయాలలో, సమాజంలో రగులుకుంటున్న కలవరానికి వారిద్దరూ గొంతులుగా ఉన్నారు. కొత్త రకం రాజకీయాల కోసం, ఆచరణల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ ఇద్దరూ ఎంతో కుతూహలం కలిగించారు. ఆ ఇద్దరూ ఆ ఇద్దరే కాదు. గుజరాత్‍లోని దళితహక్కుల ఉద్యమం, పౌర మానవ హక్కుల ఉద్యమాలు, పౌరసమాజపు అనేక సంస్థలు, బృందాలు–, వీటి మధ్య జిగ్నేశ్ మేవానీ ప్రయాణించాడు. పదిహేను పదహారేళ్ల కిందటే ఆరంభమైన అతని క్రియాశీల సామాజిక ఆచరణ, తనకు తాను స్పష్టీకరించుకున్న రాజకీయ అవగాహనతో జోడించుకుని సాగుతూ వచ్చింది. నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో రెండో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులకు యువతరం ఆక్రోశపు స్పందనను వినిపించిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల నాయకుడిగా ఆరేళ్ల కిందట కన్హయ్య కుమార్ ప్రత్యక్షమయ్యాడు. తన కంటె తీవ్రస్వరాలను వినిపించగలిగిన, సాహసోపేతమైన సవాళ్లను ఎదుర్కొనగలిగిన మిత్రబృందం అతనిది. క్షేత్రస్థాయిలో దళిత ఉద్యమం ఎట్లా ఉండాలో జిగ్నేశ్ ప్రతిపాదిస్తే, ఫాసిస్టు స్థాయికి చేరుకుంటున్న మతవిద్వేషాన్ని, వైజ్ఞానిక స్ఫూర్తిని హేతుబుద్ధిని చంపేసే మూఢత్వాన్ని ఎదుర్కొనగలిగే భావప్రచారం, వాగ్ధాటి ఎట్లా ఉండాలో కన్హయ్య చూపించాడు. ఈ మిత్రబృందాలన్నిటికీ గౌరీలంకేశ్ ఒక లంకె. రోహిత్ వేముల ఉద్యమం ఒక చేర్పు.


ఇప్పుడే అధికారికంగా చేరితే, శాసనసభ్యత్వం పోతుంది కాబట్టి, సాంకేతికంగా మాత్రమే చేరడం లేదని జిగ్నేశ్ అన్నారు. సైద్ధాంతికంగా కాంగ్రెస్ వాదినే అని ఆయన చెప్పారు, కాంగ్రెస్ అనే ఒక భావన గురించి కన్హయ్య మాట్లాడారు. ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏమిటో, కాంగ్రెస్ భావన ఏమిటో, చరిత్రలోకి వెడితే బహుశా ఏమీ దొరకకపోవచ్చు. గాంధీకి, భగత్ సింగ్‍కు, అంబేడ్కర్‌కు కూడలి కాంగ్రెస్ అన్న అర్థంలో కన్హయ్య మాట్లాడారు. దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను కాపాడుకోవాలని ఇద్దరూ అంటున్నారు. కాంగ్రెస్‌ను కాపాడడం కోసం తాము అందులో చేరుతున్నామని చెప్పడం కాదా, అది? కాంగ్రెస్‌ను కాపాడే కిటుకు ఏదో ఇటువంటి శక్తులను సమకూర్చుకోవడంలోనే ఉన్నదని రాహుల్ గాంధీ నమ్ముతున్నారా? 


ఆ చర్చలోకి వెళ్లే ముందు జిగ్నేశ్, కన్హయ్య కాంగ్రెస్‌లో చేరతారన్న సూచనలు కనిపించినప్పుడు, కలగవలసిన దిగ్ర్భాంతి గురించి, నిరుత్సాహం గురించి మాట్లాడుకోవాలి. వారు కాంగ్రెస్‌కు చేసే మేలు, కాంగ్రెస్ వల్ల వారికి కలిగే మేలు సంగతి తరువాత. ఆరున్నరేళ్లుగా, జాతీయ ప్రతిపక్షం చేవచచ్చిపోయి, అప్పటిదాకా గొంతు విప్పగలిగి ఉన్న సకలపక్షాలూ స్వచ్ఛందంగానో నిర్బంధంతోనో నిశ్శబ్దంలోకి జారుకుంటున్నప్పుడు, తలెత్తిన ఉలిపికట్టెలు కదా వీరు, వీరు కూడా ప్రధాన అపస్మారక రాజకీయ స్రవంతిలోకి జారిపోవడం, జనాన్ని నిస్సహాయులను, నిరాయుధులను చేయడం కాదా? వారు అధికార రాజకీయాలలోకి ప్రవేశించి, క్రమక్రమంగా వ్యవస్థలో సంలీనం అయిపోరా? ఒకనాడు తాము మాట్లాడిన మాటలను ఖండిస్తూ రేపు ప్రచారం చేయరా?


ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. బహుశా అట్లాగే జరగవచ్చును కూడా. తెలంగాణలో కెసిఆర్‌పై ఒక బలమైన అసమ్మతి స్వరం వ్యక్తం కావాలనుకున్నవారికి ఈటల రాజేందర్ ఆశ కలిగించాడు. ఆత్మరక్షణే ప్రధానంగా ఆయన అధికారానికి అల్లంత దూరాన ఉన్న పార్టీలో చేరారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశం సంచలనాత్మకంగా జరిగింది కానీ, ఆయన వేగానికి, ఆయన ఎంచుకున్న వేదికకు మధ్య సమన్వయం మీద సందేహాలు మిగిలిపోయాయి. తమ తమ అభిమానగణాన్ని కూడా ఆశ్చర్యపరచే ఎంపికలు నాయకులు చేసుకున్నప్పుడు, నిరాశ కలగడం సహజం. కానీ, రాజకీయం అన్నది దీర్ఘకాలికంగా లక్ష్యసాధనను, వర్తమానంలో బలమైన మనుగడను కూడా కోరుకుంటుంది. ఉనికి కోసం అనేక విపరీత నిర్ణయాలకు అది ప్రేరేపిస్తుంది. కానీ, జిగ్నేశ్, కన్హయ్య ఇద్దరి నిర్ణయం తమ ఆత్మరక్షణ కోసమూ కాదు, బహుశా, ఆత్మ ప్రయోజనం కూడా కాదు. అది వారి, సొంత, లేదా ఉమ్మడి రాజకీయ వ్యూహం కావచ్చును. 


సిపిఐ కంటె తెలివితేటలు, చురుకుదనం, భావావేశం ఉన్న వాడు కన్హయ్య. ఫాసిజంపై పోరాటమని అతను చెబుతున్నప్పుడు, అతని పార్టీకి ఆ కార్యక్రమం ఉన్నదా అన్న సందేహం కలుగుతుంది. బిహార్‍లో సిపిఐకు కూడా మిలిటెంట్‍గా ఉండక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐతో సహా అనేక వామపక్షాలు ఒక కూటమిగానే ఉన్నాయి. రాష్ట్రంలోనే కొనసాగదలిస్తే, అతను ప్రత్యేకంగా ఇప్పుడు పార్టీ మారవలసిన అవసరం లేదు. బిహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. నీ శత్రువును నువ్వు ఎంచుకుంటే, మిత్రులు వారంతట వారే సమకూరతారని కన్హయ్య మంగళవారం నాడు అన్నాడు. అతని శత్రువు బహుశా, మతోన్మాదం, బిజెపి, సంఘ్ పరివార్. ఆ రీత్యా కాంగ్రెస్ అతనికి సహజమైన గమ్యం అనిపించింది. భావ ఐక్యతనో, భావ సారూప్యతనో కంటె, సుదీర్ఘ చరిత్ర ఉన్న జాతీయ ప్రతిపక్షం అన్న పరిగణన ముఖ్యమై ఉండాలి. జాతీయస్థాయిలో కన్హయ్య ప్రచార రంగంలో పనిచేయడానికి ఈ మార్పు అవకాశం కల్పిస్తుంది. 


జిగ్నేశ్ మేవానీ ఎంతటి సమర్థత, లక్ష్యశుద్ధి ఉన్నవాడో ఉనా పోరాటం తెలిపింది. దళితుల ఆత్మగౌరవ పోరాటాలను, ఆర్థిక డిమాండ్లతో మేళవించాలని నమ్మే మేవానీ, అందుకు తగ్గట్టుగా గుజరాత్‍లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులను, గ్రామీణ దళితులను సంఘటితం చేశారు. తనను తాను ఆయన కమ్యూనిస్టు అని చెప్పుకోవడానికి సంకోచిస్తాడు కానీ, అతని సిద్ధాంతాలు ఆ కోవకు చెందినవే. అతనికి కూడా తాను చేసే పని తప్ప, తాను ఏ పార్టీలో ఉన్నాడన్నది ముఖ్యం కాదు. అట్లాగని, తాను వ్యతిరేకించే మతతత్వ పార్టీలలో చేరడు. మొదట ఆమ్ ఆద్మీపార్టీలో పనిచేశాడు. తరువాత, స్వతంత్రంగా ఉంటూ, కాంగ్రెస్ నుంచి మద్దతు పొందాడు. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికలలో ప్రముఖపాత్ర నిర్వహించడానికి వీలుగా అతనిని కాంగ్రెస్ స్వీకరించి ఉండవచ్చు. బిజెపిని బలహీనపరచడమే అన్నిటికంటె ముఖ్యమైన కర్తవ్యం అన్న అభిప్రాయం, కన్హయ్యలో వలె మేవానీలో కూడా ఉండి ఉండవచ్చు. 


పంజాబ్‌లో దళిత ముఖ్యమంత్రిని నియమించి, కాంగ్రెస్ ఇచ్చిన సంకేతానికి కొనసాగింపుగానే జిగ్నేశ్ చేరిక జరిగి ఉండవచ్చు. చేరుతున్న ఇద్దరూ కమ్యూనిస్టు భావాలు కలిగినవారు కాబట్టి, తిరిగి 1970 దశకం మొదట్లోని పరిస్థితులు వస్తున్నాయా అని మనీష్ తివారీ ఒక విసురుతో కూడిన వ్యాఖ్య చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా కాంగ్రెస్‌లో ఉండిన స్వాతంత్ర్యపు పూర్వ కాలాన్ని కన్హయ్య గుర్తుచేశారు. ఏ సమీకరణకైనా వేదిక కాగలిగిన సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉన్న మాట నిజమే. సొంతంగా ఏ సిద్ధాంతం లేకపోవడమే దాని బలం. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను ఎడమవైపు మొగ్గేట్టుగా మారుస్తున్నారన్న విమర్శ మొదలయింది. మొత్తంగా ఉనికి ప్రశ్నార్థకమవుతున్న కాలంలో ఈ ప్రయోగాలు అవసరమా అన్నది ఒక వాదన. దేశద్రోహ భావాలు కలవారికి కాంగ్రెసే కదా అంతిమ గమ్యం అని బిజెపి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తిరుగులేని బలంతో అధికారంలో ఉన్న జాతీయపక్షాన్ని వ్యతిరేకించేవారందరూ తమ మధ్య విభేదాలను ఒక్క తాటి మీదకు రావడం అత్యవసరం అయితే, వారికి కాంగ్రెస్ సహజ గమ్యమే. 


ప్రభుత్వం మారినా మారకపోయినా, భారత సమాజం ఇప్పుడు కనీసం ఒక బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందనిపిస్తోంది. వివిధ పక్షాల మధ్య ఎంతగా సమతూకం ఉంటే, అంతగా ప్రజలకు సాపేక్ష స్వేచ్ఛలు లభిస్తాయి. కాంగ్రెస్‌లో చేరిక వల్ల జిగ్నేశ్, కన్హయ్య వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లినప్పటికీ, ఈ నిర్ణయం వల్ల ఆశిస్తున్న తక్షణ ఫలితం సమకూరితే, అది వారికి విజయమే కావచ్చు!


కె. శ్రీనివాస్

Updated Date - 2021-09-30T06:44:38+05:30 IST