జిమ్‌ చేసేటప్పుడు జాగ్రత్త

Published: Tue, 02 Nov 2021 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జిమ్‌ చేసేటప్పుడు జాగ్రత్త

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ హఠాన్మరణం బోలెడన్ని సంశయాలు, భయాలను లేవనెత్తింది. ఫిట్‌నెస్‌, శరీర సౌష్టవం, వ్యాయామం, ఆరోగ్యవంతమైన ఆహారం, జీవనశైలి... ఇలా గుండెపోటుకు ఏమాత్రం తావు లేని జీవితం గడిపే వారి గుండె ఎందుకు ఆగుతోంది? నిపుణులేమంటున్నారు?ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తే చాలు గుండె జబ్బులు దరి చేరవని మన ప్రగాఢ నమ్మకం. కానీ 46 ఏళ్ల కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం, మనం ఇప్పటివరకూ నమ్ముతూ వచ్చిన అంశాల గురించి పునరాలోచించుకోవలసిన అవసరాన్ని కల్పించింది. అయితే నిజానికి గుండెపోటు పెద్దలకే పరిమితం కాదు. 50 లోపు వారిలో గుండెపోట్లు సామాన్యమే! గుండెపోటుకు గురయ్యే వారిలో 30ు మంది 50 ఏళ్ల కంటే తక్కువ వయస్కులే! ఇందుకు కారణాలను విశ్లేషిస్తే....


కుటుంబ చరిత్ర ఉంటే..

ఒత్తిడి, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహం, దురలవాట్లు... ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే అరుదుగా కొందర్లో ఆ కారకాలేవీ లేకుండా కూడా హఠాత్తుగా గుండెపోటు రావచ్చు. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు కలిగి ఉన్నవాళ్లు ఈ కోవలోకి వస్తారు. 60 ఏళ్ల లోపు గుండెపోటుకు గురైన వ్యక్తులు కుటుంబంలో ఉంటే, ఇతరత్రా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేని ఆరోగ్యవంతమైన వ్యక్తులు సైతం తక్కువ వయసులోనే గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కోవలోకి వచ్చేవాళ్లు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, క్రమం తప్పక గుండె పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నవాళ్లు రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి.


హఠాత్తుగా గుండెపోటు ఎందుకంటే...

రక్తనాళాల్లో 60 లేదా 70 శాతం పూడికలు ఉన్నవాళ్లలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. అంతకంటే తక్కువగా  ఇరవై, ముప్పై శాతం మేరకు పూడిక ఉన్నా రక్తసరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. దాంతో లక్షణాలు కూడా కనిపించవు. అయితే కొంతమందిలో, మరీ ముఖ్యంగా గుండెపోటు కుటుంబ చరిత్ర కలిగి ఉన్నవాళ్లలో.. కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లోని లోపలి పొర ఎండోథీలియం దెబ్బతిని, పూడిక మీద రక్తం గడ్డకట్టి, రక్తనాళం హఠాత్తుగా పూర్తిగా మూసుకుపోతుంది. దాంతో క్షణాల వ్యవధిలోనే గుండెవేగం విపరీతంగా పెరిగిపోయి, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా గుండెలోని ఎలక్ర్టికల్‌ యాక్టివిటీ మారిపోయి, గుండె ఒక్కసారిగా నిమిషానికి 400 సార్లు అత్యంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఆ వేగాన్ని గుండె తట్టుకోలేక, చివరకు ఆగిపోతుంది. గుండెపోటుకు గురైనప్పుడు శరీరంలో ఏర్పడే పరిస్థితి ఇది. ఈ పరిస్థితి ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. నటుడు పునీత్‌ విషయంలో, అతను వ్యాయామం చేస్తుండగా జరిగింది కాబట్టి వ్యాయామం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అనుకోవడం సరి కాదు. అయితే ఎక్కడ జరిగినా, వెనువెంటనే ప్రధమ చికిత్స సిపిఆర్‌ను అందించి ప్రాణాపాయ పరిస్థితి నుంచి గుండెను కాపాడుకునే వీలుంది. 


గుండెకు ప్రథమ చికిత్స ‘సిపిఆర్‌’

గుండెపోటుకు గురయ్యే వంద మందిలో కేవలం 30 మంది పరిస్థితి మాత్రమే, ఆస్పత్రి చేరుకునేలోపు  చేయి దాటిపోతూ ఉంటుంది. గుండెపోటు నుంచి గుండెను కాపాడుకోవడానికి తోడ్పడే ప్రథమ చికిత్స... సిపిఆర్‌ (కార్డియో పల్మనరీ రీససిటేషన్‌). వైద్య చికిత్స అందేలోగా, లేదా అంబులెన్స్‌ వచ్చేలోగా సిపిఆర్‌ చేయగలిగితే, గుండెకు కలిగే నష్టం తగ్గుతుంది. తర్వాత అందే వైద్య చికిత్సతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తనాళం హఠాత్తుగా పూడుకుపోయినప్పుడు, రక్తసరఫరా ఆగిపోయి, గుండె కండరం వెనువెంటనే చనిపోదు. అందుకు కొంత సమయం పడుతుంది. ఆలోగా పోటుకు గురైన గుండెను కుదుపుకు (షాక్‌) గురి చేస్తే, అది పూర్వంలా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఇందుకోసం ఛాతీ మీద రెండు చేతులు ఉంచి నొక్కే, ఎక్స్‌టర్నల్‌ కార్డియాక్‌ మసాజ్‌, నోటి ద్వారా గాలి ఊదడం చేస్తే, ఆస్పత్రికి చేరేలోపు గుండెకు జరిగే నష్టాన్ని ఆపవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఆర్‌ గురించి అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం. 


వ్యాయామం సామర్థ్యం మేరకే!

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నా సరే, సామర్థ్యానికి మించిన వ్యాయామాలు చేయకపోవడమే మేలు. చేయగలుగుతున్నాం కదా అని శరీరాన్ని అవసరానికి మించిన ఒత్తిడికి లోను చేయడం సరి కాదు. వయసును బట్టి వ్యాయామాల తీవ్రత ఎంచుకోవాలి. ఏ వ్యాయామమైనా శరీరానికి నెమ్మదిగా అలవాటు చేసి, శరీర సామర్ధ్యం పరిధి మేరకు సాధన చేయాలి. 


నిర్లక్ష్యం కూడదు

‘ఇంకా 50 ఏళ్లు దాటలేదు కాబట్టి నాకేం కాదులే!’ అనే ధీమా ఈ వయసు వారిలో ఎక్కువ. లక్షణాలు కనిపించినా వాటిని ఇతరత్రా స్వల్ప రుగ్మతలుగా పొరబడి సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గుండెపోటు కుటుంబచరిత్ర ఉన్నవాళ్లు రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి.జిమ్‌ చేసేటప్పుడు జాగ్రత్త

లక్షణాల మీద ఓ కన్నేసి...

  1. గుండెజబ్బు లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండగలిగితే గుండెపోటును నివారించుకోవచ్చు. ఆ లక్షణాలు ఏవంటే...
  2.  పూర్వం తేలికగా చేయగలిగిన పనులను ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆయాసం మొదలైనా...
  3. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో బరువుగా, అసౌకర్యంగా, మంటగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నా,    గుండె దడ పెరిగినా....
  4. ఎడమ చేయి లాగేస్తున్నా
  5. వ్యాయామంతో ఈ లక్షణాల తీవ్రత పెరుగుతున్నా...

జిమ్‌ చేసేటప్పుడు జాగ్రత్త

గుండెపోటు వ్యాయామం చేస్తున్నప్పుడు వస్తే, ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగే వ్యాయామ శిక్షకుల పాత్రే కీలకంగా మారుతుంది. జిమ్‌ ట్రైనర్లకు సిపిఆర్‌ గురించి కచ్చితంగా తెలిసి ఉండాలి. కేవలం సర్టిఫైడ్‌ ట్రైనర్లకు మాత్రమే ఈ ప్రథమ చికిత్స పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి జిమ్‌ను ఎంచుకునేటప్పుడు శిక్షకుల అర్హతలనూ పరిగణలోకి తీసుకోవాలి. అలాగే తమకున్న రుగ్మతలు, శారీరక సమస్యల గురించి వ్యాయామ శిక్షకులకు చెప్పడం కూడా ముఖ్యమే! వ్యాయామం చేస్తున్నప్పుడు ఎలాంటి అసౌకర్యం కలిగినా, వెంటనే శిక్షకుల దృష్టికి తీసుకురావాలి. కార్డియో వ్యాయామాలు వయసును బట్టి ఎంచుకోవాలి. శిక్షకులకు ఈ విషయం పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. జిమ్‌లో మొదట స్ట్రెంగ్త్‌ వ్యాయామాలు, ఆ తర్వాత కార్డియో వ్యాయామాలు చేయాలి.

ఆదిత్య,

జిమ్‌ ట్రైనర్‌,

పిఆర్‌ క్లాసిక్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌,

హైదరాబాద్‌.

జిమ్‌ చేసేటప్పుడు జాగ్రత్త

డాక్టర్‌ రమేష్‌ గూడపాటి,

కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌,

స్టార్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


TAGS: NEET Exam
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.