జిన్నింగ్‌ మిల్లులపై బకాయిల భారం

ABN , First Publish Date - 2020-12-02T06:03:40+05:30 IST

పత్తిని జిన్నింగ్‌ చేసే మిల్లులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. జిల్లాలో దిగుబడి అవుతున్న పత్తి కేవలం 67శాతమే స్థానికంగా జిన్నింగ్‌ అవుతోంది. మిగతా పత్తి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు తరలివెళ్తోంది. పత్తి మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ రాయితీలు రూ.65కోట్ల బకాయి ఉంది.

జిన్నింగ్‌ మిల్లులపై బకాయిల భారం

ఉమ్మడి జిల్లాకు రావాల్సింది రూ.65కోట్లు 

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

నార్కట్‌పల్లి: పత్తిని జిన్నింగ్‌ చేసే మిల్లులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. జిల్లాలో దిగుబడి అవుతున్న పత్తి కేవలం 67శాతమే స్థానికంగా జిన్నింగ్‌ అవుతోంది. మిగతా పత్తి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు తరలివెళ్తోంది. పత్తి మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ రాయితీలు రూ.65కోట్ల బకాయి ఉంది. ప్రభుత్వం జిన్నింగ్‌ పరిశ్రమకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోకుంటే వచ్చే సీజన్‌ నాటికి మిల్లులు నడపడం కష్టమేనని యజమానులు పేర్కొంటున్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనా జిల్లాలో ఇప్పటివరకు 4 జిన్నింగ్‌ మిల్లులు తెరవకపోవడాన్ని తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌(టీసీఏ) ఉదహరిస్తోంది.

దేశవ్యాప్తంగా పత్తిని అధికంగా సాగుచేసే రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు 350వరకు జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా పత్తి దిగుబడి ఎక్కువగా ఉండటంతో ఇక్కడ 46కుపైగా పత్తి మిల్లులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా 25, యాదాద్రి జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 7వరకు జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో మిల్లు ఏర్పాటుకు సుమారు రూ.8కోట్ల నుంచి రూ.15కోట్ల వ్యయం అవుతుంది.


రూ.65కోట్ల బకాయిలు

రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్‌ పరిశ్రమ నిర్వాహకులకు 2014 నుంచి ప్రభు త్వం చెల్లించాల్సిన వివిధ రకాల రాయితీ బకాయిలు రూ.450కోట్ల వరకు ఉంది. అందులో ఉమ్మడి జిల్లాకు రూ.65కోట్లు రావల్సి ఉంది. విద్యుత్‌ బిల్లులపై ఇచ్చిన రూ.0.75 రాయితీ సుమారు రూ.80కోట్లు, బ్యాంకు రుణాల చెల్లింపులో ప్రభుత్వం భరించాల్సిన పావలా వడ్డీ కింద సుమారు రూ.125కోట్లు, జీఎ్‌సటీ చెల్లింపుల్లో 50శాతం తిరిగి చెల్లించనున్న రాయితీ రూ.250కోట్లు బకాయి ఉన్నట్టు తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ బాధ్యులు చెబుతున్నారు. ఈ సీజన్‌ ప్రారంభంలో కనీసం రూ.150కోట్లు బకాయి లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా చెల్లింపులు జరగలేదు. బకాయిల భారం అలా ఉంచితే గత ఏడాది సీజన్‌ వ్యాపారంలో ఇంకా 10శాతం మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.


సీసీఐ తీరుతో రూ.కోటి నష్టం

సీసీఐ నిబంధనలు కూడా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని పత్తి మిల్లుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని మిల్లర్లు బేళ్లుగా మార్చి టెండర్‌ కోట్‌చేసిన బిడ్డర్లకు ఎగుమతి చేస్తారు. బేళ్లుపోగా మిగిలే గింజలకు కూడా సీసీఐ టెండర్‌ పిలుస్తుంది. దీనికి టెండర్‌దారులెవరూ ముందుకు రాకపోతే గింజలను సంచుల్లో నింపి బ్యాగింగ్‌ చేయాల్సిన బాధ్యత సంబంధిత పత్తి మిల్లుదే. ఈ నష్టాన్ని భరించడంకన్నా గింజలను కొనడమే మేలన్న ఉద్దేశంతో గత ఏడాది బహిరంగ మార్కెట్‌ రేటుకు అధికంగా రూ.200కు చెల్లించి గింజలు కొనుగోలు చేయడంతో ఒక్కో మిల్లు సుమారు రూ.కోటి వరకు నష్టపోయిందని యజమానులు చెబుతున్నారు.


ప్రోత్సాహకం ఏదీ?

జిన్నింగ్‌ పరిశ్రమను ప్రోత్సాహిస్తామన్న ప్రభుత్వ పెద్దల హామీ మాటలకే పరిమితమైందన్న అభిప్రాయాన్ని టీసీఏ వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న పత్తి దిగుబడులకు అనుగుణంగా జిన్నింగ్‌ పరిశ్రమల ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పినా, ప్రభుత్వ తీరుతో కొత్త మిల్లుల సంగతి అటుంచితే ఉన్నవి మూతపడేలా ఉందంటోంది. పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనా నల్లగొండ జిల్లాలో కొండమల్లేపల్లి, మాల్‌ ప్రాం తాల్లోని 4జిన్నింగ్‌ మిల్లులు ఇంకా తెరవకపోవడాన్ని టీసీఏ ఉదాహరిస్తోంది. వాస్తవానికి జిల్లాలో దిగుబడి అవుతున్న పత్తిని జిన్నింగ్‌ చేసే సామర్థ్యం కేవలం 67శాతమే ఉండగా, మిగతా పత్తి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్తోంది.


బకాయిలు చెల్లించి ఆదుకోవాలి : శ్రీధర్‌రెడ్డి, టీసీఏ కోశాధికారి

జిన్నింగ్‌ మిల్లులకు రాయితీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.450కోట్ల బకాయిలను వెంటనే ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా గత ఏడాది జరిగిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన బకాయి ఉన్న 10శాతం బిల్లులు కూడా చెల్లించాలి. లేదంటే జిన్నింగ్‌ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. గత సీజన్‌లో సీసీఐ వేసిన బిడ్డింగ్‌లో పత్తిగింజలు కొనుగోలు చేసి నష్టపోయాం. ఏడాదిలో ఆరు నెలల సీజన్‌లో వాడకం మేరకు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ మిగతా ఆరు నెలల కాలంలో కనీస చార్జీ కింద రూ.లక్ష వరకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపు భారమవుతోంది. దీన్ని ప్రభుత్వం తగ్గించాలి.

Updated Date - 2020-12-02T06:03:40+05:30 IST