పోతానన్నా.. పొగబెట్టారు! JNTU సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-08-13T19:58:36+05:30 IST

పాలకులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విశ్వవిద్యాలయ(University) ప్రాంగణాల్లో సంచలనం రేకెత్తించిన కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌

పోతానన్నా.. పొగబెట్టారు! JNTU సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్‌ నాగభూషణం సస్పెన్షన్‌

ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి 


కలికిరి, ఆగస్టు 12: పాలకులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విశ్వవిద్యాలయ(University) ప్రాంగణాల్లో సంచలనం రేకెత్తించిన కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌ నాగభూషణం(Superintendent Nagabhushanam) అందరూ అనుకున్న విధంగానే సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన ధిక్కార స్వరాన్ని సహించని జేఎన్టీయూ(jntu) వర్శిటీ యాజమాన్యం గురువారం సాయంకాలం ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్శిటీ వీసీ రంగజనార్ధన్‌ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ శశిధర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నాగభూషణం సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన విషయం వాస్తవమేనని, వీటిని ఆయనకు వ్యక్తిగతంగా అంజేసేందుకు ప్రత్నిస్తున్నామని కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్వీ సత్యనారాయణ ధ్రువీకరించారు. అయితే ఈ ఉత్తర్వు నకలును ఇవ్వడానికి మాత్రం ఆయన నిరాకరించారు. నాగభూషణం కూడా వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. రెడ్డి రాజ్యంలో తనలాంటి బీసీలు ఉద్యోగాలు చేయలేమని, అందుకే త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకోబోతున్నానని గత బుధవారం అనంతపురం నుంచి ఒక వీడియో విడుదల చేశారు. తనను పనిగట్టుకుని బదిలీ చేయడం వంటి వాటితో వేధిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపైన ‘జేఎన్టీయూలో కులాల కుంపటి’ పేరుతో జేఎన్టీయూలో తిష్ట వేసిన అగ్రకుల ఆధిపత్య ధోరణి గురించి ఆంధ్రజ్యోతి గురువారం ఒక కథనం ప్రచురించింది. నాగభూషణంను సస్పెన్షన్‌ చేసేందుకు ఉన్నతస్థాయిలో సన్నద్ధమ వుతున్నట్లు కూడా ఈ కథనంలో పేర్కొనడం జరిగింది. ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఆంధ్రజ్యోతి చెప్పిన విషయాన్ని యూనివర్శిటీ యాజమాన్యం కార్యాచరణలోకి తెచ్చింది. 


గత మూడు రోజుల నుంచి నాగభూషణం సెలవులో ఉన్నారు. శుక్రవారం కూడా హాజరు కాలేదు. కాగా తమకు గిట్టని వారిని లేదా పంటికింద రాయిలా ఉన్న వారిని తొలగించుకోవడానికి పొమ్మనకుండా పొగబెట్టడమనే సామెత ఉంది. ఇక్కడ నాగభూషణం తాను వీఆర్‌ఎస్‌ ద్వారా ఉద్యోగం వదిలి వెళ్లిపోయి సామాజిక సేవ చేసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో పోతామనే వారికి కూడా పొగ బెట్టినట్లయిందని చెపుతున్నారు. నాగభూషణం సస్పెన్షన్‌ వెనుక యూనివర్శిటీ యాజమాన్యంతోపాటు ‘ఉన్నత’ స్థాయిలో కూడా వ్యూహాత్మకత ఉన్నట్లు చెబుతున్నారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న అనంతరం యూనివర్శిటీలోని అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నాగభూషణం సమాయత్తమవుతున్నట్లు గుర్తించారు. అంతేగాకుండా గతంలో జరిగిన లొసుగుల జాబితా ఆయన వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీఆర్‌ఎస్‌ తీసుకుని స్వేచ్ఛగా యూనివర్శిటీ వైఫల్యాలను ఎండగట్టకుండా కట్టడి చేసేందుకే ఆయన్ను సస్పెన్షన్లో ఉంచినట్లు చెపుతున్నారు. సస్పెన్షన్‌ వ్యవహారం తేలేంత వరకూ ఆయనకు వీఆర్‌ఎస్‌ వర్తించబోదని, కాబట్టి సస్పెన్షన్‌ కాలంలో కూడా ప్రభుత్వ ఉద్యోగిగానే కోడ్‌ ఆఫ్‌ కాండక్టు పరిధికి లోబడి ఉండాల్సి ఉందని... లేదంటే మరిన్ని ధిక్కార ఆరోపణలు ఆయన ఎదుర్కోవాల్సి రావచ్చనే కారణాలతోనే సస్పెన్షన్‌తో ఆయన్ను తాత్కాలికంగా కట్టడి చేయడం జరిగిందని కూడా చెపుతున్నారు. 


సస్పెన్షన్‌ ఉత్తర్వులో ఏముంది?

నాగభూషణం సస్పెన్షన్‌కు సంబంధించి బుధవారం ఆయన విడుదల చేసిన వీడియోతోపాటు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా తీసుకున్నారు. దీంతోపాటు గతంలో 2017 హైదరాబాదు రాజ్‌భవన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి నుంచి వచ్చిన ఒక లేఖను, 2017, 2018, 2019లో ఆయనకు యూనివర్శిటీ జారీ చేసిన మూడు మెమోలను ఆధారంగా చేసుకుని గురువారం వర్శిటీ వీసీ సస్పెన్షన్‌ ఉత్తర్వుకు ఆమోద ముద్ర వేశారు. ఇక వీడియోలో ఆయన చెప్పిన ‘రెడ్డి రాజ్యంలో ఉద్యోగం చేయలేక విసిగి వేసారి పోతున్నాను’ అనే ఆరోపణను ప్రధానంగా చూపించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గానికి తప్పించి మరెవరికీ యూనివర్శిటీలోనూ, బయట న్యాయం జరగలేదని ఆయన చేసిన మరో ఆరోపణను కూడా ప్రస్తావించారు. సీసీ రూల్స్‌లోని 3, 15, 16, 17 నిబంధనల మేరకు ఈ చర్య తీసుకున్నారు. కాగా సస్పెన్షన్‌ కాలంలో ఆయన పనిచేస్తున్న కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాలను వదిలి వెళ్లరాదని నిబంధన విధించారు.

Updated Date - 2022-08-13T19:58:36+05:30 IST